బీజేపీ నుంచి పాత సామాను బయటకు పోవాలి: రాజాసింగ్
x

బీజేపీ నుంచి పాత సామాను బయటకు పోవాలి: రాజాసింగ్

రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్య భేటీలు అవుతున్నారు. ఇలాంటి సీక్రెంట్ సమావేశలు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుందన్నారు.


సొంతపార్టీపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాకపోవడానికి కొందరు సొంతపార్టీ నేతలే కారణమన్నారు. అధికారంలో ఎవరు ఉంటే వారితో సొంతపార్టీ నేతలు కొందరు రహస్య సమావేశాలవుతున్నారని, ఇలా చేస్తే ఎప్పటికీ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదని అన్నారాయన. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలంటే పార్టీ నుంచి పాతసామాను బయటకు పోవాలన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఎవరిని ఉద్దేశించి రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ తీవ్రంగా జరుగుతోంది. రాజాసింగ్ మాటలతో బీజేపీలో అంతర్గతపోరు ముదురుతుందా అన్న భావన కూడా ప్రజల్లో కలుగుతోంది. ఇటీవల కొందరు తనపై ప్రెజర్ చేస్తున్నారని కూడా రాజాసింగ్ అన్నారు. ఇంతలోనే మరోసారి సొంతపార్టీపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కీలకంగా మారింది. రాజాసింగ్‌ ఒక్కసారిగా బీజేపీ వ్యతిరేక స్వరం ఎందుకు వినిపిస్తున్నారు? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

‘‘పార్టీ నుంచి పాత సామాను బయటకు పోతేనే తెలంగాణలో బీజేపీ పవర్‌లోకి వస్తుంది. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ సీఎంతో కొందరు బీజేపీ నేతలు రహస్య భేటీలు అవుతున్నారు. ఇలాంటి సీక్రెంట్ సమావేశలు పెట్టుకుంటే బీజేపీ అధికారంలోకి ఎలా వస్తుంది. ఇలాంటి విషయాలపై బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టాలి. రహస్య సమావేశాలకు వెళ్తున్నవారిని బయటకు పంపాలి. అప్పుడు తెలంగాణలో బీజేపీ మంచిరోజులు వస్తాయి’’ అని రాజాసింగ్ అన్నారు.

కొన్ని రోజులుగా తెలంగాణ బీజేపీలో ముసలం పుట్టిందన్న వార్తలు అధికం అవుతున్నాయి. రాజాసింగ్‌కు సొంత పార్టీ నేతలకు ఏదో విషయంలో చెడిందని, అందుకే ఆయన తన పార్టీ నేతలపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. 14 ఫిబ్రవరి 2025న కూడా రాజాసింగ్ ఇదే విధంగా సొంతపార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. పార్టీలో వేధింపులు తట్టుకోలేకున్నానన్నారు. పార్టీకి తాను అవసరం లేదని చెప్తే తాను పార్టీ నుంచి తప్పుకుంటానని అన్నారు. గోల్కొండ-గోషామహల్ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి తాను సూచించిన వ్యక్తిని కాదని ఎంఐఎం లీడర్ల వెంట తిరిగే వ్యక్తిని ఎంపిక చేశారని ఆనాడు రాజాసింగ్ మండిపడ్డారు.

మళ్ళీ ఇప్పుడు పాత సామానును పార్టీ నుంచి బయటకు పంపాలని, అప్పుడు పార్టీ అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు మరోసారి తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి చేశారు? ఎందుకు చేశారు? అధికారంలో ఉన్న సీఎంలతో రహస్య మంతనాలు, సమావేశాలు ఎవరు నిర్వహించారు? అన్న అంశాలు తీవ్ర చర్చలకు దారితీస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం బీజేపీ పెద్దల చెంతకు చేరినట్లు సమాచారం. వారు కూడా ఈ అంశాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలో రహస్య మంతనాలు చేసేవారిని గుర్తించి చర్యలు తీసుకునే ఆలోచనలో బీజేపీ పెద్దలు ఉన్నారని సమాచారం. అదే విధంగా ఇవన్నీ ఉత్తుత్తి మాటలే అయితే రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Read More
Next Story