తెలంగాణలో బిజేపి అండర్ కవర్ ఆపరేషన్..?
x

తెలంగాణలో బిజేపి అండర్ కవర్ ఆపరేషన్..?

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా పది నుంచి పన్నెండు స్థానాలు గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. నాలుగు నుంచి పన్నెండుకు ఎలా ఎదగబోతున్నారు?


గోపిరెడ్డి సంపత్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచుకున్న భారతీయ జనతా పార్టీ, అదే ఊపుతో పార్లమెంట్ ఎన్నికల్లో పాగా వేయ్యాలని వ్యూహాలు రచిస్తోంది. ఆమేరకు అభ్యర్ధుల ఎంపిక పట్ల ఆచితూచి వ్యవహరిస్తోంది. 2019 ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లలో విజయం సాధించిన బీజేపీ, ప్రస్తుతం 10 నుంచి 12 స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నది.
ఇప్పటికే సిట్టింగ్ ఎంపిలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కిషన్ రెడ్డి, సోయం బాబూరావులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈక్రమంలోనే మిగతా 13 పార్లమెంట్ స్థానాల్లో గెలుపు గుర్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలోని ప్రత్యేక బృందం రంగంలోకి దిగి, బీజేపీతో సహా ఇతర పార్టీల్లోని ఆశావహులపై సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఆ సమాచారం మేరకు గెలుపు గుర్రాలను ఎంచుకొని వారిని, బీజేపీ వైపుకు తిప్పుకొని టికెట్లు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పార్టీకి చెందిన నాయకులే బాహాటంగా వ్యాఖ్యనిస్తున్నారు.
ఇటీవలి కాలంలో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు, ఆపార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కచ్చితంగా 10 స్థానాల్లో గెలువబోతున్నామని ప్రకటించారు. అంతేకాకుండా పార్టీల పేర్లు, అభ్యర్దుల పేర్లు చెప్పకుండా.. నర్మగర్బంగా వారు రాబోతున్నారని, పక్కా పది సీట్లు గెలుస్తామని చెబుతున్నారంటే, తెలంగాణలో బీజేపీ అండర్ కవర్ ఆపరేషన్ మొదలు పెట్టిందా అనే అనుమానాలు వస్తున్నాయి.
కాగా బీజేపీలో ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీకి చెక్ పెడుతూ ఈసారి అభ్యర్థులను ముందే ఎంపిక చేసే పనిలో ఉంది. గజ్వేల్, హుజురాబాద్ లలో రెండు చోట్ల పోటీ చేసి ఓటమి పాలైన ఈటల రాజేందర్ ను మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి రంగంలోకి దింపాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో విజయం సాధించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ అందులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
మల్కాజ్గిరి నియోజకవర్గంలో గతంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఎంపీగా గెలిచారు. తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత రేవంత్ రెడ్డి ఎంపీగా రాజీనామా చేసి సీఎం పగ్గాలు చేపట్టారు. ఈసారి లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. రేవంత్ రెడ్డి వ్యూహాలను దీటుగా ఎదుర్కునేందుకు కోసం బీజేపీ బలమైన నాయకులను ఎన్నికల క్షేత్రంలోకి దించబోతోంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా ఈటల రాజేందర్ ను మల్కాజ్గిరి నియోజకవర్గం నుండి బరిలోకి దింపబోతున్నట్టు సమాచారం.
ఇక ఇప్పటికే బీజేపీ అభ్యర్థుల ఎంపికలో పలు నియోజకవర్గాలకు సంబంధించి ప్రాథమిక కసరత్తు పూర్తి చేసింది బీజేపీ. చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మెదక్ నుంచి ఎం రఘునందన్ రావు, భువనగిరి నుంచి బూర నర్సయ్య గౌడ్ లను అభ్యర్థులుగా బరిలోకి దించాలని నిర్ణయించింది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, శాంత కుమార్ పోటీ పడుతున్నారు. మిగిలిన నియోజక వర్గాల్లో ఇతర పార్టీల్లోని బలమైన నాయకులకు అవకాశం కల్పించే దిశగా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అధిష్టానం పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయా, చాపకింద నీరులా చేస్తున్న అండర్ కవర్ ఆపరేషన్ సక్సేస్ అవుతుందా లేదా వేచి చూడాలి.


Read More
Next Story