
‘స్థానిక ఎన్నికల్లో బీజేపీనే నెం.1’
స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచి చూపిస్తామన్న రామచందర్ రావు.
తెలంగాణలో స్థానిక ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో రాజకీయ పార్టీలన్నీ తమ వ్యూహాలను అమలు చేయడంపై ఫోకస్ పెట్టాయి. ప్రత్యర్థులను తొక్కుకుంటూ విజయం వైపు సాగేలా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల పోరు ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య జరగనుందని, బీజేపీ బలహీనంగా ఉందన్న ప్రచారంపై కమలం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ఘాటుగా స్పందించారు. బీజేపీ బలహీనంగా లేదని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ నెం.1గా నిలవనుందని ధీమా వ్యక్తం చేశారు. తమ పార్టీ బలహీనంగా ఉందనుకుంటే అది అపోహే అవుతుందని అన్నారు. ఈ సందర్భంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లకు సంబంధించి కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో ముస్లింలకు 10శాతం రిజర్వేషన్లు ఇచ్చే ఉద్దేశం లేనందున బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు తాము పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్‌వన్నీ నాటకాలే..
‘‘రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ముందు నుంచీ నాటకాలే ఆడుతోంది. పైగా రిజర్వేషన్లను గవర్నర్, బీజేపీ అడ్డుకుంటున్నాయని ఆరోపించింది. అదే జరిగి ఉంటే ఇప్పుడు జీఓను ఎలా జారీ చేశారు. ఈ జీఓ ఏదో గతంలోనే ఇచ్చి ఉంటే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు కదా. కావాలనే ఈ అంశాన్ని ఇంతకాలం సాగదీశారు. బీసీలకు రిజర్వేషన్లను కల్పించే ఉద్దేశం ప్రభుత్వానికి ఇప్పటికీ లేదు’’ అని విమర్శలు గుప్పించారు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్‌లు దాఖలవడానికి తమకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉందని, గతంలో కన్నా బలం ఇప్పుడు మరింత పెరిగిందని అన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకుంటే బీజేపీకి ఓటింగ్ శాతం కూడా పెరిగిందని చెప్పారు. ఈసారి స్థానిక ఎన్నికల్లో అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.