మీడియా అంటే సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగేనా ? (వీడియో)
x
Venu swamy and Hema

మీడియా అంటే సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగేనా ? (వీడియో)

సెలబ్రిటీలు విడుదల చేస్తున్న వీడియోలతో జనాలు చాలామందిలో మీడియా అంటేనే సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగేనా అనే భావం మరింతగా పెరిగిపోతోంది.


కొద్దిరోజులుగా మీడియా రంగంమీద టన్నుల కొద్ది బురద పడిపోతోంది. అసలే మీడియా మీద జనాల్లో గౌరవం తగ్గిపోయి చులకనభావం పెరిగిపోయింది. దీనిమీద కొద్దిరోజులుగా సెలబ్రిటీలు విడుదల చేస్తున్న వీడియోలతో జనాలు చాలామందిలో మీడియా అంటేనే సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగేనా అనే భావం మరింతగా పెరిగిపోతోంది. నాలుగురోజుల క్రితమే సెల్ఫ్ సర్టిఫైడ్ జ్యోతిష్కుడు పరాంకుశం వేణు @ వేణుస్వామి దంపతుల వీడియో సంచలనమైంది. మీడియా అంటే ఒకపుడు దినపత్రికలు+ఆల్ ఇండియా రేడియో మాత్రమే. కాని తర్వాత అంటే 2000 సంవత్సరంలో టీవీ న్యూస్ కూడా మొదలైంది. ఆ తర్వాత 24 గంటలు న్యూస్ ఛానళ్ళు పుట్టుకొచ్చాయి. ఓ పదేళ్ళుగా వీటన్నింటినీ మూలకు నెట్టేసి సోషల్ మీడియా ఇపుడు రాజ్యమేలుతోంది.

మంచైనా చెడైనా క్షణాల్లో ఏ విషయమైనాసరే కోట్లాదిమందికి స్మార్ట్ ఫోన్ల ద్వారా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతోంది. ఇపుడు వేణుస్వామి, ఆయన భార్య వాణి శ్రీవాణి చేసిన ఒక వీడియోలో మీడియాను అడ్డం పెట్టుకుని కొందరు తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, సెటిల్మెంట్ కోసం రు. 5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటు ఆరోపించారు. తమ గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్పింగును కూడా తమ వీడియోకి అటాచ్ చేశారు. 13 నిముషాల 20 సెకన్లున్న వీడియో నిముషాల్లోనే బాగా వైరలైపోయింది. వేణు దంపతుల ఆరోపణల్లో ఎంత నిజమున్నది అప్రస్తుతం. తమను మీడియాను అడ్డంపెట్టుకుని కొందరు 5 కోట్ల రూపాయలు కావాలని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నదే ఇంపార్టెంట్. తమ వీడియోలోనే మరో ఇద్దరు దంపతుల ఆర్ధికపరిస్ధితి గురించి మాట్లాడుకుంటున్న విషయాలు కూడా ఉన్నాయి. ఈ వీడియోలో ఎంత నిజముందో అబద్ధముందో తెలీదు.

ఎందుకంటే వేణు దంపతులను ఒక టీవీ ఛానల్ వాళ్ళు 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నది నిజమే అయితే విషయం ఏదో పెద్దదనే అనుకోవాలి. ఏ విషయంలో తమను మీడియా వాళ్ళు రు. 5 కోట్లు అడుగుతున్నారన్న విషయాన్ని దంపతులు చెప్పలేదు. ఒక సెలబ్రిటీ కపుల్ ఎంగేజ్మెంట్ పై వేణు మాట్లాడుతు ఈ బంధం ఎక్కువ కాలం నిలవదని చెప్పారు. దానిపై పెద్ద దుమారం రేగి వ్యవహారం పోలీసులకు ఫిర్యాదు చేయటం, మహిళా కమీషన్ దాకా చేరుకున్నది. ఆ వ్యవహారం ఏదైనా ఉంటే దాన్ని న్యాయపరంగా, చట్టపరంగా వేణు దంపతులు తేల్చుకుంటారు. మరి మధ్యలో మీడియా దూరి వీళ్ళని 5 కోట్ల రూపాయలు ఎందుకు డిమాండ్ చేసింది ? ఏ విషయంలో వేణు ఇరుక్కున్నారు ?

విషయం ఏదైనా ఈ వీడియో కారణంగా మీడియా అంటేనే సెటిల్మెంట్లు, బ్లాక్ మెయిలింగ్ అని అనుకునే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ఈ వీడియో గురించి ఒకవైపు జనాల్లో చర్చలు జరుగుతుండగానే ఇలాంటిదే మరో వీడియో ప్రత్యక్షమైంది. అదేమిటంటే సినీనటి హేమది. ఆమధ్య బెంగుళూరు రేవ్ పార్టీలో పోలీసులు కొందరిని అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ పార్టీలో నటి హేమకూడా ఉన్నారు, అరెస్టయ్యారు, తర్వాత బెయిల్ తెచ్చుకుని బయటకు వచ్చారు. తాను పార్టీలో లేనని, తనకు సంబంధంలేదని హేమ ముందు బుకాయిస్తు ఒక వీడియో రిలీజ్ చేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి హేమ విడిదులచేసిన వీడియో తప్పని నిరూపించటంతో చేసేదిలేక ఆమె నోరుమూసేసింది.


నిజానికి మీడియాను అడ్డంపెట్టుకుని బ్లాక్ మెయిలింగ్, పైరవీలు ఇతరత్రా రూపాల్లో డబ్బులు సంపాదించుకునే వాళ్ళ సంఖ్య తక్కువే. యాజమాన్యం ఇచ్చే జీతాల మీద ఆధారపడే జర్నలిస్టుల సంఖ్యే చాలా ఎక్కువ. మీడియాలోని కొందరి చేష్టల కారణంగా మొత్తం జర్నలిస్టులందరు నిందలు భరించక తప్పటంలేదు. జనాలు మాటల్లో మీడియా పేరుతో బ్లాక్ మెయిలింగు, బెదిరింపు, డబ్బు గుంజటాలు అనే అర్ధం వచ్చేయటంతో పద్దతిగా ఉండే జర్నలిస్టులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే సమయంలో వ్యక్తిగత ఇమేజితో నలుగురిలో గౌరవం అందుకుంటున్న జర్నలిస్టులు కూడా ఉన్నారు. మామూలు జనాలు మాట్లాడుకోవటం వేరు సమాజంలో సెలబ్రిటీ హోదాలో ఉన్న వాళ్ళు చేసే ఆరోపణలు వేరు. మామూలు జనాలు మాట్లాడుకుంటే అది వాళ్ళవరకే పరిమితమవుతుంది. కానీ సెలబ్రిటీలు మాట్లాడేది మొత్తం సమాజానికి చేరుతుంది. మీడియాపైన వేణు దంపతులు, హేమ చేసిన ఆరోపణలు వైరల్ అవ్వటమే దీనికి నిదర్శనం.

Read More
Next Story