ఢిల్లీ లిక్కర్ స్కాం దేశ రాజకీయాలను భారీ కుదుపు కుదిపింది. ఢిల్లీ నుంచి తెలంగాణ వరకు ఈ కుంభకోణం ప్రకంపనలు వ్యాపించాయి. ఇవి ఇంకెంత దూరం వ్యాపిస్తాయో కూడా అర్థంకాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసులో భాగంగా పలువురు కీలక నేతలను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరికి నోటీసులు పంపుతూ విచారణకు హాజరు కావాలని కోరుతున్నారు. వీరిలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. ఇటీవలే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కూతురు,
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కూడా ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నివాసంలో సుమారు ఐదు గంటలు సోదాలు చేసిన అధికారులు సాయంత్రం 5:20 గంటలకు ఆమెను అదుపులోకి తీసుకుని అదే రోజున ఢిల్లీకి తరలించారు. తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
బొయినపల్లి అభిషేక్‌కు బెయిల్
తన భార్య అనారోగ్యంతో బాధపడుతుందని, కావున తనకు ఐదు వారాల బెయిల్ మంజూరు చేయాలంటూ అభిషేక్.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను స్వీకరించి విచారణ జరిపిన ధర్మాసనం అతనికి మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని, ఈడీ అధికారులకు తన ఫోన్ నెంబర్‌ను ఇచ్చి 24 గంటలు అందుబాటులో ఉండాలని న్యాయస్థానం అతనికి తెలిపింది. ఈ సందర్భంగానే ట్రయల్ కోర్టులో పిటిషన్ల విచారణ విషయంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది.
సుప్రీంకోర్టుకు కవిత
తన అరెస్ట్ అక్రమమని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన అరెస్ట్‌ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనకు సంబంధించి ఓ కేసు సర్వోన్నత న్యాయ స్థానంలో కొనసాగుతుండగా ఈడీ అధికారులు తనను అరెస్ట్ చేశారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. గతంలో తనకు నోటీసులు జారీ చేయడంపై కొనసాగుతున్న విచారణలో భాగంగా తనకు ఎటువంటి సమన్లు జారీ చేయమని ఈడీ తరపు న్యాయవాది చెప్పారని, కానీ తనను అరెస్ట్ చేసి వారు కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు భావించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కవిత పిటిషన్‌లో వివరించారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని ధర్మాసనం నేడు విచారణ జరపనుంది.
కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ
లిక్కర్ స్కాంకు సంబంధించిన ఈడీ తనకు జారీ చేస్తున్న నోటీసులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయస్థానంలో ఈరోజు విచారణ జరిగింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని న్యాయస్థానం ఈడీని కోరింది. రెండు వారాల్లోగా తమ సమాధానాన్ని అందించాలని ఆదేశించింది. అనంతరం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది.