
రైల్వే స్టేషన్‌లో బాంబు పేలుడు..
కుట్ర కోణంపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ క్లారిటీ.
కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఆ పేలుడుతో ప్రయాణికులు, సిబ్బంది అంతా ఉలిక్కిపడ్డాడు. వెంటనే తేరుకున్న సిబ్బంది స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. బాంబు పేలుడు అని తెలియగానే పోలీసులు హుటాహుటిన రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. స్టేషన్ అంతా క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వారి సోదాల్లో మరో నాలుగు నాటు బాంబులను కనుగొన్నారు. వెంటనే వాటిని స్వాధీనం చేసుకున్నారు. అసలు అవి ఎక్కడికి ఎలా వచ్చాయి? తొలి పేలుడు ఎలా జరిగింది? అన్న అంశాలపై ఆరా తీశారు. కాగా రైలు పట్టాల దగ్గర ఓ వీధి కుక్క.. ఒక బాంబును కొరికిందని, దాని మూలంగానే ఆ బాంబు పేలిందని తేల్చారు. అయితే అసలు వాటిని అక్కడకు ఎవరు తెచ్చారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. ఈ కేసుకు సంబంధించి పలు వివరాలను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వెల్లడించారు.
అడవి జంతువుల కోసం వాడే బాంబులు..
తమకు లభించిన నాటు బాంబులు అడవి జంతువుల కోసం వినియోగించేవని జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ వివరించారు. గుర్తు తెలియని వ్యక్తులు బాంబులు ఉన్న సంచులను చెత్తకుప్పలో పడేసి వెళ్లారని, ఆ సంచిని అక్కడ తిరుగుతుండే వీధి కుక్క ఒకటి రైల్వే ట్రాక్‌పైకి లాక్కొచ్చి అందులో ఉన్న వాటిని తినే ప్రయత్నం చేసిందని చెప్పారు. ఈ క్రమంలోనే బాంబు పేలి కుక్క మరణించిందని తెలిపారు. కాగా మిగిలిన బాంబులను పోలీసులు సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, కుట్ర కోణం ఉందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు.
ఇదిలా ఉంటే కొంత కాలంగా దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్‌లు, విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి. బెదిరింపు వచ్చిన ప్రతిసారి అధికారులు తనఖీలు చేసి అవి బూటకపు బెదిరింపులుగా తేలుస్తున్నారు. కాగా ఇప్పుడు కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లోకి నాటు బాంబులు రావడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. బెదిరింపుల తరహాలో ఎవరైనా కావాలనే బాంబులను రైల్వే స్టేషన్‌లో తీసుకొచ్చి వదిలి వెళ్లారా? అన్న చర్చలు ఊపందుకుంటున్నాయి.
రైల్వే స్టేషన్‌లో అనుమానాస్పదంగా పడి ఉన్న మూడు సంచులను పారిశుద్ధ్య సిబ్బంది చెత్తకుప్పలో పడేశారని, ఆ సంచుల్లో మొత్తం ఐదు నాటు బాంబులు ఉన్నాయని కూడా ప్రచారం జరుగుతోంది. పారిశుద్ధ్యకార్మికులు పడేసిన సంచులనే కుక్క లాక్కొచ్చిందని అంటున్నారు. నాటు బాంబులను ఉదయం వెళ్లే రైలులో తరలించే ప్రయత్నంలో ఎవరో వ్యక్తులు ఈ సంచులను స్టేషన్‌లో వదిలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.
తృటిలో తప్పిన పెను ప్రమాదం..
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బాంబులు రైలు కింద పడి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని, వందల ప్రాణాలు ప్రమాదంలో పడేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు బాంబులు రైల్వే స్టేషన్‌లోకి ఎలా వచ్చాయో? అధికారులు కనుక్కోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దాంతో పాటుగా రైల్వే స్టేషన్‌లో ఉన్న భద్రతా లోపాన్ని ఈ ఘటన చూపుతోందని, భద్రతపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని డిమాండ్ చేస్తున్నారు.

