తెలంగాణ సీఎంఓ, లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపు..
x

తెలంగాణ సీఎంఓ, లోక్‌భవన్‌కు బాంబు బెదిరింపు..

నేరుగా గవర్నర్ ఆఫీసుకే ఈమెయిల్ పెట్టిన ఆగంతకుడు.


తెలంగాణలో ముఖ్యమంత్రి కార్యాలయం(CMO), గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్‌కు మంగళవారం బాంబు బెదిరింపు రావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. మంగళవారం ఉదయం గవర్నర్ కార్యాలయానికి ఒక ఈమెయిల్ వచ్చింది. వాసుకి ఖాన్ పేరుతో ఈమెయిల్ రావడంతో అదేంటా అని అధికారులు పరిశీలించారు. కాగా అందులో సీఎంఓ, లోక్‌భవన్‌ను పేల్చేయనున్నామంటూ హెచ్చరికలు ఉన్నాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. వెంటనే లోక్‌భన్ నుంచి ప్రముఖులు, వీఐపీలను బయటకు పంపేశారు. అనంతరం పంజాగుట్ట పోలీసులకు బాంబు బెదిరింపుపై ఫిర్యాదు చేశారు. గవర్నర్ సీఎస్ఓ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

గవర్నర్ ఆఫీసుతో పాటు సీఎంఓలో కూడా తనిఖీలు చేపట్టారు. అంతేకాకుండా మరోవైపు ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది. దాని ఐపీ అడ్రెస్ ఏంటి? ఈ వాసుకి ఖాన్ ఎవరు? అన్న కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు విమానాశ్రయాలు, రైల్వేస్టేషన్‌లు, విద్యాసంస్థలను పేల్చేస్తామంటూ వివిధ గుర్తు తెలియని అకౌంట్ల నుంచి ఈమెయిల్స్ వచ్చేవి. కాగా ఇప్పుడు సీఎంఓ, గవర్నర్ కార్యాలయాన్ని పేల్చేస్తామంటూ గవర్నర్ ఆఫీసుకే ఈమెయిల్ రావడంతో ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ను అమెరికా నుంచి బెదిరింపు

ఇదిలా ఉంటే మరోవైపు శంషాబాద్ విమానాశ్రానికి కూడా బాంబు బెదిరింపు రావడం కీలకంగా మారింది. విమానాశ్రయానికి అమెరికా నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. న్యూయార్క్ నుంచి జాస్పర్ పకార్ట్ అనే వ్యక్తి ఈ బెదిరింపు మెయిల్ పంపాడు. శంషాబాద్ నుంచి అమెరికా వెళ్లే విమానాల్లో బాంబు ఉందని, విమానాలు టేకాఫ్ అయిన పదే పది నిమిషాల్లో బాంబును పేలుస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. బాంబును పేల్చకూడదంటే తమనకు ఒక మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన విమానాశ్రయ సిబ్బంది ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అమెరికాకు వెళ్లే ప్రతి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

Read More
Next Story