రేవంత్ కి బీఆర్ఎస్ సెగ
సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది.
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. బీఆర్ఎస్ మహిళా నేతలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. బీఆర్ఎస్ పార్టీ రేవంత్ కామెంట్స్ ని చాలా సీరియస్ గా తీసుకుంది. పార్టీ మహిళా సభ్యులపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా గురువారం అన్ని జిల్లా కేంద్రాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేయాలని బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, తెలంగాణ ఆడబిడ్డలకు, మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని పార్టీ డిమాండ్ చేసింది.
బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలను తెలంగాణ ప్రజలు ఖండించాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటనలో కోరారు. తెలంగాణ సంస్కృతిలో ఆడబిడ్డలకు ప్రత్యేక గౌరవం, స్థానం ఉందన్న కనీస సొయి లేకుండా ఆడబిడ్డలను నమ్ముకుంటే ఆగమైతావంటూ, ఆడబిడ్డలను నమ్ముకుంటే ముంచుతారంటూ... జీవితం బస్టాండ్ పాలవుతుందంటూ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా తన స్థాయి మరిచి చేసిన నీచమైన వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అన్నారు.
సుదీర్ఘ కాలం పాటు ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యకర్తల ఆశీర్వాదంతో, అనేక త్యాగాలతో ప్రజలకు సేవ చేస్తున్న ఇద్దరు సీనియర్ మహిళా సభ్యులపైన, అహంకారంతో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఆడబిడ్డలందరి మనసులను నోప్పించాయని.. జీవితంలో ఎదగాలనుకుంటున్న ప్రతి ఒక్క మహిళకు, ఆడబిడ్డకు ఈ వ్యాఖ్యలు అవమానకరమని కేటీఆర్ అన్నారు. అధికార అహంకారంతో రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్న కేటీఆర్, రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలకు నిరసనగా రేపు ఆయన దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. దిష్టిబొమ్మల దహనంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కి పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.