ఆవిర్భావం రోజే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం
x

ఆవిర్భావం రోజే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయకేతనం

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది.


మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. నవీన్ కుమార్ రెడ్డి 111 ఓట్ల మెజారిటీతో గెలుపు కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో విజయకేతనం ఎగరవేయడంపై బీఆర్ఎస్ వర్గాలు సంబురాలు జరుపుకుంటున్నాయి. సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు.

కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డిపై 111 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఆయన గెలుపొందారు. నవీన్ కుమార్ కి 763 ఓట్లు, జీవన్ రెడ్డికి 652 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థికి ఒక్క ఓటు పడింది. మొత్తం 1,437 ఓట్లు పోల్ కాగా అందులో 27 ఓట్లు చెల్లనవిగా అధికారులు గుర్తించారు. ఈ గెలుపుతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సంబురాల్లో మునిగితేలారు. బీఆర్ఎస్ అభ్యర్థి విజయాన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.


ఉపఎన్నిక ఎందుకు వచ్చిందంటే...

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక ప్రజా ప్రతినిధుల ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఎన్నికల సంఘం మార్చి 28న ఉపఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ తరఫున నవీన్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుంచి మన్నె జీవన్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్ గౌడ్ బరిలో నిలిచారు. బీజేపీ పోటీకి దూరంగా ఉంది. 1,437 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోగా.. 99.86 శాతం పోలింగ్ నమోదైంది. ఏప్రిల్ 2నే ఫలితాలు రావాల్సి ఉండగా.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కౌంటింగ్ తేదీని మర్చి జూన్ 2న కౌంటింగ్ నిర్వహించారు.

గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచింది -కేటీఆర్

ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానం గెలుచుకోవడం సంతోషంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ గెలుపు మా పైన బాధ్యతలు మరింత పెంచిందన్నారు. ఈ విజయం మరిన్ని విజయాలకు దారితీస్తుందని విశ్వసిస్తున్నాం.. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తామని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ అద్భుత గెలుపు హర్షణీయం అన్నారు.

"సీఎం సొంత జిల్లాల్లో బీఆర్ఎస్ సాధించిన ఈ గెలుపు.. మారుతున్న తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో కీలక మలుపు.. అధికార పార్టీ ప్రలోభాలకు నిలువునా పాతరేసిన ఎన్నిక ఇది. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత్తిచూపిన ఫలితమిది. నాడైనా.. నేడైనా.. ఏనాడైనా.. తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ మాత్రమే.. ఈ గడ్డకు శ్రీరామరక్ష అని మరోసారి తేల్చిచెప్పిన శుభతరుణమిది. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన నవీన్ కుమార్ రెడ్డికి శుభాకాంక్షలు. పార్టీ గెలుపు కోసం శ్రమించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ మరోసారి గుండెల నిండా కృతజ్ఞతలు" అని తెలిపారు కేటీఆర్.


Read More
Next Story