
బిగ్ బ్రేకింగ్ : రేవంత్ తో ‘ఫిరాయింపులు’ భేటీ
రేవంత్(Revanth) నివాసంలో బీఆర్ఎస్(BRS) నుండి ఫిరాయించిన ఎంఎల్ఏల్లో తొమ్మిది మంది సమావేశమయ్యారు.
ఈ సమయంలో బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏలు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో ఎందుకు భేటీఅయ్యారో తెలీటంలేదు. ఆదివారం సాయంత్రం రేవంత్(Revanth) నివాసంలో బీఆర్ఎస్(BRS) నుండి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల్లో తొమ్మిది సమావేశమయ్యారు. స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి(Kadiyam Srihari) నియోజకవర్గంలో ఉన్నకారణంగా మీటింగుకు హాజరుకాలేదు. ఒకవైపు సుప్రింకోర్టు ఆదేశాలతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఫిరాయింపు ఎంఎల్ఏలకు నోటీసులు జారీచేస్తున్నారు. మరోవైపు ఎలాగైనా ఫిరాయింపు ఎంఎల్ఏలందరిపైనా అనర్హత వేటు వేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
స్పీకర్ నుండి నోటీసులు అందుకున్న ఎంఎల్ఏల్లో కొందరు ఇప్పటికే జవాబులు ఇచ్చారు. కా కొంతమంది నోటీసులు అందుకోవాల్సుంది. ఈనేపధ్యంలో సడెన్ గా తొమ్మిదిమంది ఫిరాయింపులు రేవంత్ తో భేటీ అవటం సంచలనంగా మారింది. నోటీసులు అందుకున్న గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్ స్పీకర్ నోటీసులకు సమాధానాలు ఇచ్చారు. తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదన్నారు. తాము ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు జవాబులు ఇచ్చారు. నియోజకవర్గాల అభివృద్ధికి నిధుల కోసమే తాము సీఎంను కలిసినట్లు చెప్పారు.
తమపైన అనర్హత వేటు వేసేందుకు లేదని కూడా వీరు స్పీకర్ కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా దాదాపు ఇలాంటి సమాధానాలే ఇవ్వబోతున్నారని తెలిసింది. శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాందీ మీడియాలో మాట్లాడుతు తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు ప్రకటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ప్రకటన కారణంగానే గాంధీకి బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డికి మూడురోజుల పాటు బాగా గొడవైంది.
ఫిరాయింపులు స్పీకర్ నోటీసులకు ఏమని సమాధానాలు చెబుతారు ? స్పీకర్ ఆ సమాధానాల విషయంలో ఎలా రియాక్టవుతారు అన్నది సస్పెన్సుగా మారింది. తర్వాత సుప్రింకోర్టుకు స్పీకర్ ఇవ్వబోయే వివరణ ఏమిటన్నది కూడా ఆసక్తిగా మారింది. ఆమధ్య అసెంబ్లీలో రేవంత్ మాట్లాడుతు ఏ ఒక్క ఎంఎల్ఏపైనా అనర్హత వేటుపడదు అని ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రింకోర్టు సీరియస్ అయ్యింది. ఇన్ని డెవలప్మెంట్ల మధ్య సరిగ్గా ఈ సమయంలోనే ఫిరాయింపు ఎంఎల్ఏలు రేవంత్ తో భేటీ అవటం సంచలనంగా మారింది. భేటీ ఉద్దేశ్యం ఏమిటన్నది తెలియాల్సుంది.