ఫిరాయింపులకు ఈ ‘క్లాజే’ శ్రీరామ రక్ష
x
BRS six MLCs with Revanth

ఫిరాయింపులకు ఈ ‘క్లాజే’ శ్రీరామ రక్ష

పార్టీ మారిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టులో కేసువేసినా ఫిరాయింపులు లెక్కచేయటంలేదు..ఎందుకు ?


చట్టాలు చేసేటపుడే లొసుగులతో చేస్తుంటారు. అవసరం వచ్చినపుడు ఆ లొసుగులను కొందరు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. అందుకనే లొసుగులు లేకుండా చట్టాలను చేయలేరా ? అనే చర్చ చాలాకాలంగా జనాలమధ్య నడుస్తోంది. ఇపుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తున్న ఎంఎల్ఏలు, ఎంఎల్సీల విషయంలోనే. ఫిరాయింపుల నిరోధక చట్టం కింద పార్టీ మారిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోర్టులో కేసువేసినా ఫిరాయింపులు లెక్కచేయటంలేదు..ఎందుకు ?

ఎందుకంటే చట్టంలోని లొసుగుల వల్లే అని సమాధానం వినబడుతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధి హయాంలో ఫిరాయింపుల నిరోధక చట్టం తయారైంది. అందులో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఎవరు కూడా కోర్టుకు వెళ్ళేందుకు లేదని, కోర్టులు కూడా ఫిరాయింపులపై దాఖలైన కేసులను విచారించేందుకు లేదని చట్టం చేశారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టంలో కోర్టులు విచారించేందుకు లేదనే పాయింట్ ను స్పష్టంగా పెట్టారు. అయితే ఆ పాయింట్ ను చాలెంజ్ చేస్తు ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) రూపంలో కోర్టులో కేసు పడింది. పిల్ ను విచారించిన సుప్రింకోర్టు ఫిరాయింపుల నిరోధక చట్టంలోని ఈ పాయింటును కొట్టేసింది. ఫిరాయింపులపై ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని చెప్పింది. అయితే ఈ తీర్పుచెప్పిన సుప్రింకోర్టు మరో పాయింట్ ను స్పష్టంచేసింది.

అదేమిటంటే ఫిరాయింపులపై లోయర్ కోర్టు అంటే సుప్రింకోర్టు ఉద్దేశ్యంలో లాయర్ కోర్టంటే అసెంబ్లీ స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్లు. ఫిరాయింపులపై స్పీకర్, ఛైర్మన్ తీసుకున్న నిర్ణయాలను ఛాలెంజ్ చేయచ్చని, హైకోర్టు, సుప్రింకోర్టులు విచారణ చేయవచ్చని ఓ క్లాజులో స్పష్టంగా చెప్పింది. ఇపుడు ఫిరాయింపులకు ఈ క్లాజే వరప్రసాదంగాను శ్రీరామరక్షగాను మారింది. ఫిరాయింపుల చట్టాన్ని, దాన్ని స్పూర్తిని పక్కకు పడేసిన పార్టీలు చివరలో చెప్పిన క్లాజును మాత్రం అందిపుచ్చుకున్నాయి. ఆ క్లాజు ఆధారంగానే యధేచ్చగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయి.

సుప్రింకోర్టు చెప్పిన క్లాజుకు ఒక ఉదాహరణ చెప్పాలంటే బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఒక ఎంఎల్ఏపై అనర్హత వేటువేయాలని కారుపార్టీ నేతలు అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేస్తారు. ఆ ఫిర్యాదుపై స్పీకర్ వెంటనే యాక్షన్ తీసుకుని విచారణ జరుపుతారు. బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎంఎల్ఏని కాంగ్రెస్ ఎంఎల్ఏగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ చెప్పారని అనుకోండి. లోయర్ కోర్టంటే స్పీకర్ కాబట్టి, స్పీకర్ సదరు ఫిరాయింపు ఎంఎల్ఏని కాంగ్రెస్ ఎంఎల్ఏగా గుర్తించారని అనుకోండి. అప్పుడు వెంటనే బీఆర్ఎస్ నేతలు స్పీకర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తు హైకోర్టులో కేసు వేయవచ్చు. ఆ కేసును హైకోర్టు విచారణకు స్వీకరించి తీర్పును కూడా చెప్పవచ్చు. అయితే ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించినపుడు మాత్రమే.

అందుకనే ఇపుడు స్పీకర్లు ఏమిచేస్తున్నారంటే తమ నిర్ణయాలను ప్రకటించటంలేదు. ఎంఎల్ఏలు పార్టీలు ఫిరాయిస్తున్నారు, పార్టీ నేతలు స్పీకర్లకు అనర్హతపై ఫిర్యాదులు చేస్తున్నారు, స్పీకర్లు ఆ ఫిర్యాదులను పరిశీలిస్తూనే.....ఉన్నారు. ఫిర్యాదులను స్పీకర్లు పరిశీలించి నిర్ణయం చెప్పేటప్పటికి పుణ్యకాలం పూర్తయిపోతోంది. ఏపీలో స్పీకర్ గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు కాని తెలంగాణాలో బీఆర్ఎస్ హయాంలో స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు కాని ఫిరాయింపులపైన, అనర్హత పిటీషన్లపైన పరిశీలన జరిపారే కాని నిర్ణయాలను మాత్రం ప్రకటించలేదు. అప్పట్లో స్పీకర్లు, మండలి ఛైర్మన్లు నిర్ణయాలను ప్రకటించలేదు కాబట్టి ఫిరాయింపులపై వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసినా ఉపయోగంలేకపోయింది. కేసులు కోర్టుల్లో ఉండగానే తెలంగాణాలో రెండు ప్రభుత్వాలు, ఏపీలో రెండు ప్రభుత్వాలు మారిపోయాయి.

అప్పట్లో కేసీయార్ అనుసరించిన విధానాన్నే ఇపుడు రేవంత్ రెడ్డి కూడా ఫాలో అయిపోతున్నారు. ఫిరాయింపులపైన, అనర్హత పైన స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించేంతవరకు ఫిరాయింపుదారులు ఫుల్లు హ్యాపీ. స్పీకర్లు, ఛైర్మన్లు నిర్ణయాలు ప్రకటించేదిలేదు, ఫిరాయింపులపై అనర్హత వేటుపడేది లేదు. ఫిరాయింపుల విషయంలో ‘లోయర్ కోర్టు’ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేయచ్చన్న సుప్రింకోర్టు క్లాజ్ ను అడ్డుపెట్టుకుని పార్టీలు యధేచ్చగా ఫిరాయింపులకు పాల్పడుతున్నాయి. ఫిరాయింపులపైన, అనర్హతపైన వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఏ కోర్టు కూడా స్పీకర్, ఛైర్మన్ను ఆదేశించేందుకు లేదు. ఫిరాయింపుల విషయంలో శాసనవ్యవస్ధ పరిధిలోకి న్యాయవ్యవస్ధ చొరబడేందుకు లేదు. కాబట్టే ఫిరాయింపులను పరిశీలించండి, తొందరగా నిర్ణయం తీసుకోమని మాత్రమే కోర్టులు స్పీకర్, ఛైర్మన్లకు సూచనలిస్తున్నాయి. ఇంతకుమించి కోర్టులు చేయగలిగేది ఏమీలేదు కాబట్టే అధికారపార్టీలు, ఫిరాయింపుదారులు ఫుల్లు హ్యాపీ.

Read More
Next Story