భారీగా పడిపోయిన బీఆర్ఎస్ విరాళాలు
x
BRS and KCR

భారీగా పడిపోయిన బీఆర్ఎస్ విరాళాలు

రిపోర్టు ప్రకారం 2024-25లో పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం రు. 15.09 కోట్లు మాత్రమే


అధికారంలో ఉన్నపార్టీ నీటిలో మొసలి లాంటిది. అధికారంలో నుండి దిగిపోతే ఒడ్డున పడ్డ చేపే అనటంలో సందేహంలేదు. ఇందుకు తాజా ఉదాహరణ బీఆర్ఎస్(BRS Donations) కు వచ్చిన విరాళాలే. 2024-25 సంవత్సరంలో బీఆర్ఎస్ కు వచ్చిన విరాళాల వివరాలను పార్టీ ప్రధానకార్యదర్శి రావులచంద్రశేఖరరెడ్డి కేంద్ర ఎన్నికల కమిషన్ కు సమర్పించారు. ఆ రిపోర్టు ప్రకారం 2024-25లో పార్టీకి వచ్చిన విరాళాలు కేవలం రు. 15.09 కోట్లు మాత్రమే. 2023 నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయింది. దాంతో 2024-25 ఏడాదిలో పార్టీకి వచ్చిన విరాళాలు భారీగా పడిపోయాయి. ప్రోగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ రు. 10 కోట్లు, ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రు. 5 కోట్లు విరాళాలు వచ్చాయి. వ్యక్తిగతంగా ఎస్. రాజేందర్ రెడ్డి రు. 8.79 లక్షలు, మహ్మద్ అజార్ రు. 29 వేలను అందించారు.

అధికారంలో ఉన్నపుడు అంటే 2023-24 ఆర్ధికసంవత్సరంలో పార్టీకి రు. 580.52 కోట్లు విరాళాలు వచ్చాయి. 2023-24లో కేవలం ఎలక్టోరల్ బాండ్ల ద్వారానే పార్టీకి 495.52 కోట్ల విరాళాలొచ్చాయి. అందులో ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ ద్వారా రు. 85 కోట్ల అందింది. అలాగే 2022-23 ఆర్ధిక సంవత్సరంలో రు. 683 కోట్ల విరాళాలు అందాయి. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో రు. 529 కోట్లు వచ్చాయి. ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ నుండి రు. 90 కోట్లు, వివిధ వ్యక్తుల నుండి రు. 64.03 కోట్ల విరాళాలు వచ్చాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఒకపుడు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన ప్రకారం బ్యాంకుల్లో సుమారు రు. 970 కోట్ల నిధులున్నాయి. ఆనిధుల్లో ఎక్కువభాగం ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చినవే. అధికారంలో ఉన్నంతవరకు పార్టీకి రెండేళ్ళల్లోనే వరుసగా 580 కోట్ల రూపాయలు, 683 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. ఎప్పుడైతే అధికారంలో నుండి దిగిపోయిందో విరాళాలు ఇచ్చేవారిలో చాలామంది మొహంచాటేసినట్లున్నారు. అందుకనే 2024-25 ఏడాదిలో వచ్చింది కేవలం రు. 15 కోట్లు మాత్రమే. ఎప్పడు కూడా అధికారంలో ఉన్న పార్టీ నీటిలో మొసలి లాంటిదే అన్న విషయం నిర్ధారణైంది. మరి అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీకి ఏమేరకు విరాళాలు వచ్చాయన్న విషయం ఇంకా వెలుగుచూడలేదు.

Read More
Next Story