ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ మహిళా నేతలు
x

ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ మహిళా నేతలు

కవితలో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. ఎన్నికల హడావిడి అంతా ముగిసి ఖాళీగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు తీహార్ జైల్లో కవితని పరామర్శించేందుకు వెళుతున్నారు.


లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు. ఇద్దరు మహిళా నేతలు ఈరోజు ఢిల్లీకి వెళ్లి కవితని పరామర్శించారు. ఇటీవలె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆమెను కలిశారు. కవితను భర్త వారానికి రెండుసార్లు కలుస్తున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలెవరూ పెద్దగా కలిసింది లేదు.

కవిత సరిగ్గా పార్లమెంటు ఎన్నికలకి రెండు నెలల సమయం ఉండగా అరెస్టయ్యారు. ఆ సమయంలో పార్టీ నేతలంతా ప్రచారంలో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆమెను కలిసేందుకు కుటుంబసభ్యులు, ఒకరిద్దరు పార్టీ నేతలు తప్ప మిగిలినవారెవరూ కలవలేదు. ఎవరికి వారు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోవడంతో ఢిల్లీ వెళ్ళడానికి తీరలేదు బహుశా. అయితే ఎన్నికలు ముగిసి, రిజల్ట్స్ కూడా వచ్చేశాయి. గులాబీ పార్టీ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. ఇంకోవైపు కవిత జ్యూడిషియల్ కస్టడీ కూడా కోర్టు పొడిగిస్తూనే ఉంది. ఈ క్రమంలో కవితలో ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ నేతలు ఢిల్లీ బాట పట్టారు.

ఎన్నికల హడావిడి అంతా ముగిసి ఖాళీగా ఉండడంతో బీఆర్ఎస్ నేతలు తీహార్ జైల్లో కవితని పరామర్శించేందుకు వెళుతున్నారు. ఇటీవల కేటీఆర్ కవితని కలవగా... నేడు మహిళా మంత్రులిద్దరూ కవితతో ములాఖత్ అయ్యారు. ముందుముందు ఇంకొందరు నేతలు కవితని కలిసి మనోధైర్యం చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి.

కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత మార్చ్ 15న అరెస్టయ్యారు. ఇప్పటికి ఆమె అరెస్టయ్యి దాదాపు మూడు నెలలు పూర్తయ్యింది. 80 రోజులుగా ఆమె తీహార్ జైల్లోనే ఉంటున్నారు. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన చార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా నలుగురు వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ పై చార్జిషీటు దాఖలు చేశామని, వారి పాత్రపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా.. చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడీషియల్ కస్టడీని జులై మూడో తేదీ వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది.

Read More
Next Story