రికార్డులు చూడకుండా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారా?
x

రికార్డులు చూడకుండా రేవంత్ ఆరోపణలు చేస్తున్నారా?

సైనిక్ స్కూల్ నిర్మాణాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.


సైనిక్ స్కూల్ నిర్మాణాన్ని కేసీఆర్ పట్టించుకోలేదు అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఆయన తప్పుబట్టారు. రాజకీయ మైలేజ్ కోసం నిరాధారమైన ఆరోపణలు చేసే ముందు ముఖ్యమంత్రి తన కార్యాలయంలో అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించాలని ఆయన సూచించారు.

మంగళవారం తెలంగాణ భవన్‌లో వినోద్‌ కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ను కలిసిన అనంతరం సైనిక్‌ స్కూల్‌ విషయంలో రేవంత్‌ రెడ్డి గోబెల్స్ తరహాలో మాట్లాడారు అన్నారు. తెలంగాణకు చెందిన సైనిక్‌ స్కూల్‌ ను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారనే ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. బీఆర్‌ఎస్ హయాంలోనే వరంగల్‌లో పాఠశాల మంజూరైందని గుర్తు చేశారు.

"నాతో సహా బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో అప్పటి రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను, దివంగత అరుణ్ జైట్లీని సైనిక్ స్కూల్ ఏర్పాటు కోసం అనేక సార్లు కలిశాం. రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూళ్లను ఇక ముందు నడపలేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయి" అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.

"అబద్ధాలు మాట్లాడి మాట్లాడి రేవంత్ అబద్ధాలు తప్ప నిజాలు మాట్లాడడం లేదు. నిరుద్యోగ సమస్యపై రేవంత్ అబద్దాలు మాట్లాడి యువతను రెచ్చగొట్టారు. ఇకపై రేవంత్ అబద్ధాలకు ధీటుగా బదులిస్తాం. రక్షణ శాఖ భూములపై కూడా కేసీఆర్ చేసిన ప్రయత్నాలు రికార్డుల్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డికి సమయం ఉంటే అప్పటి డిఫెన్స్ అధికారి జె ఆర్ కే రావుతో మాట్లాడి నిజాలు తెలుసుకోవాలి. నీట్‌ తో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై రేవంత్ దృష్టి సారించాలి. నీట్‌పై సుప్రీం కోర్టులో మంచి న్యాయవాదిని రాష్ట్రం తరపున నియమించి కొట్లాడాలి. తెలంగాణ సమస్యలపై కేంద్రంతో నిజాయతీగా కొట్లాడింది బీఆర్ఎస్సే.. ఇకముందు కూడా కొట్లాడుతాం" అన్నారు వినోద్ కుమార్.


రక్షణ మంత్రితో సైనిక్ స్కూల్ పై రేవంత్ చర్చలు...

రెండు రోజుల పర్యట నలో భాగంగా సోమవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎంపీలతో కలిసి అక్బర్ రోడ్ లోని రక్షణ శాఖ మంత్రి నివాసానికి చేరుకొని.. రాజ్ నాథ్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో హైదరాబాద్ లో రోడ్ల విస్తరణ, ఇతర అవసరాలకు దాదాపు 2,500 ఎకరాల డిఫెన్స్ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రక్షణ శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సీఎం కోరారు. అలాగే వరంగల్ లో సైనిక్ స్కూల్ అనుమతులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ నగరానికి గతంలోనే సైనిక్ స్కూల్ మంజూరు చేసినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణపరంగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రక్షణ మంత్రి దృష్టికి ఆయన తీసుకెళ్లారు. వరంగల్ సైనిక్ స్కూల్ అనుమతుల గడువు ముగిసినందున ఆ అనుమతులు పునరుద్ధరించాలని, లేదా కొత్తగా మంజూరు చేయాలని సీఎం రక్షణమంత్రికి విజ్ఞప్తి చేశారు.


Read More
Next Story