
ఫిరాయింపులపై ఆధారాలు ఇవ్వలేక బీఆర్ఎస్ చేతులెత్తేసిందా ?
సోమవారం నుండి కోర్టు హాలులో జరిగినట్లే క్రాస్ ఎగ్జామినేషన్ మొదలైంది.
దాదాపు ఏడాదికాలంగా ఫిరాయింపు ఎంఎల్ఏలకు వ్యతిరేకంగా నానా రచ్చచేసిన బీఆర్ఎస్(BRS)చివరకు చేతులెత్తేసిందా. అందుబాటులోని సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. పదిమంది ఫిరాయింపు ఎంఎల్ఏల(BRS defection MLAs) అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సోమవారం విచారణ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు ఆరోపణలు చేస్తున్న ఎంఎల్ఏలకు కూడా స్పీకర్ ముందుగా నోటీసులు జారీచేశారు. వారందరి దగ్గర నుండి సమాధానాలు రాబట్టారు. తర్వాత వాళ్ళ వాదనలను బలపరుస్తు అఫిడవిట్లు దాఖలు చేయాలని అన్నారు. దాంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారితో పాటు ఆరోపణలు చేస్తున్నవారు కూడా తమవాదనలను బలపరిచేట్లుగా అఫిడవిట్లు దాఖలు చేశారు. సోమవారం నుండి కోర్టు హాలులో జరిగినట్లే క్రాస్ ఎగ్జామినేషన్ మొదలైంది.
సోమవారం స్పీకర్ ఛాంబర్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి తరపు లాయర్లు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు పల్లా రాజేశ్వరరెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్ ను క్రాస్ ఎగ్జామ్ చేశారు. ‘‘తమ క్లైంట్లు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా మీ దగ్గర ఏమన్నా ఆధారాలున్నాయా’’ అని అడిగారు. ‘‘కాంగ్రెస్ లో చేరినట్లుగా ఏమైనా ఆధారాలుంటే చూపించాల’’ని అడగారు. ఫిర్యాదుచేసిన ప్రతి ఎంఎల్ఏని లాయర్లు సుమారు 40 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.
అయితే లాయర్లు అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు కూడా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సరైన సాక్ష్యాన్ని చూపించలేకపోయారని తెలిసింది. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలవటమే పార్టీ మారారు అనటానికి నిదర్శనంగా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సమాధానమిచ్చారు. ‘‘సీఎంను ఏ ఎంఎల్ఏ అయినా కలవచ్చు కదా’’ అన్న లాయర్ల ప్రశ్నకు బీఆర్ఎస్ ఎంఎల్ఏలు ఎలాంటి సమాధానాలు చెప్పలేకపోయారు. ‘‘సీఎంను నియోజకవర్గ అభివృద్ధికోసం కలవటం ఎలా తప్పవుతుంద’’న్న లాయర్ల ప్రశ్నకు వీళ్ళనుండి సమాధానమే కరువైంది. ఎంఎల్ఏలు పార్టీ మారినట్లుగా మీడియాలో వచ్చినకథనాలు వాస్తవంకాదన్న లాయర్ల వ్యాఖ్యలకు ఎంఎల్ఏలు ఏమీసమాధానం ఇవ్వలేకపోయినట్లు తెలిసింది.
పార్టీ ఫిరాయించినట్లుగా చెబుతున్న ఎంఎల్ఏలకు పార్టీ షోకాజో నోటీసులు జారీచేసిందా ? అన్న ప్రశ్నకు కూడా బీఆర్ఎస్ ఎంఎల్ఏలు సమాధానం చెప్పలేకపోయారు. ముఖ్యమంత్రిని ఫిరాయింపు ఎంఎల్ఏలు కలిసినట్లు వచ్చిన ఫోటోలన్నీ వాస్తవాలే అని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గట్టిగా చెప్పారు. ఆ ఫొటోలను మర్ఫింగ్ ఫొటోలనేందుకు లేదని గట్టిగా సమర్ధించుకున్నారు. క్రాస్ ఎగ్జామినేషన్ దాదాపు గంటసేపు జరిగింది.
తర్వాత బీఆర్ఎస్ ఎంఎల్ఏలు మీడియాతో మాట్లాడుతు ఫిరాయింపు ఎంఎల్ఏల లాయర్ల ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు. ఎన్ని అసంబద్ధమైన ప్రశ్నలువేసినా అన్నింటికీ సమాధానాలు చెప్పటమే కాకుండా ఫిరాయింపులకు అవసరమైన ఆధారాలు కూడా అందించినట్లు చెప్పారు. అయితే పదిమంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లుగా మీడియా, సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్న ఫొటోలను తప్ప ఇంకేమీ చూపించలేకపోయారని సమాచారం. బుధవారం ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు కాలే యాదయ్య, బండ్ల, గూడెం, ప్రకాష్ గౌడ్ ను బీఆర్ఎస్ ఎంఎల్ఏల తరపు లాయర్లు క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. అప్పుడు వీరేమి సమాధానాలు చెబుతారో చూడాలి. ఆ తర్వాత ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగిలిన ఆరుమంది ఎంఎల్ఏల విషయంలో కూడా ఇలాంటి విచారణే జరుగుతుంది.