సెక్రటేరియట్ అంతా బీఆర్ఎస్ అవినీతే..
x

సెక్రటేరియట్ అంతా బీఆర్ఎస్ అవినీతే..

తెలంగాణలో తమ మార్క్ కనిపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల్లో సెక్రటేరియట్ నిర్మాణం ఒకటి. సచివాలయ నిర్మాణంలో బీఆర్ఎస్ భారీ అవినీతికి పాల్పడిందంటున్న కాంగ్రెస్..


తెలంగాణలో తమ మార్క్ కనిపించేలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పనుల్లో సెక్రటేరియట్ నిర్మాణం ఒకటి. కాస్తంత సమయం తీసుకున్నా ఔరా అనిపించేలా సెక్రటేరియట్ భవనాన్ని నిర్మించింది. ఈ భవన ప్రారంభోత్సవం కూడా ఓ పండగలా నిర్వహించింది. అయితే ఇప్పుడు ఈ సెక్రటేరియట్ నిర్మాణంలో అనేక చీకటి కోణాలు ఉన్నాయని, ఈ భవనం బీఆర్ఎస్ అవినీతికి ప్రతిబింబం అని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తోంది. సెక్రటేరియట్ పేరుతో ప్రజాధనాన్ని బీఆర్ఎస్ దోచుకుందని, ఈ భవన నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ చూపినవన్నీ తప్పుడు లెక్కలేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే కాళేశ్వరం, విద్యుత్ కొనుగోళ్ల అంశం, వరంగల్ టిమ్స్ నిర్మాణం అంశాలు బీఆర్ఎస్ మెడకు ఉచ్చులా చుట్టుకుంటున్నాయి.. తాజాగా ఈ లిస్ట్‌లోకి సెక్రటేరియట్ అవినీతికి కూడా వచ్చి చేరింది. ఇప్పటికే సెక్రటేరియట్‌లో అవినీతి జరిగిందన్న అంశాలపై విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. ఈ అంశంపై తెలంగాణ కాంగ్రెస్.. తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో కీలక పోస్ట్ ఒకటి పెట్టింది. బీఆర్ఎస్ అవినీతి తవ్వేకొద్దీ బయటపడుతోందని, అవినీతిని ఇంత అందంగా చేయొచ్చా అనడానికి బీఆర్ఎస్ నిలువెత్తు ఉదాహరణగా నిలుస్తుందని కాంగ్రెస్ చురకలంటించింది.

ఒక్కసారిగా పెంచిన అంచనాలు..

‘‘బీఆర్ఎస్ హయాంలో సెక్రటేరియట్ నిర్మాణం కోసం తొలుత రూ.617 కోట్ల వ్యవయాన్ని అంచనా వేశారు. ఆ మొత్తాన్ని ఒక్కసారిగా రూ.1140 కోట్లకు పెంచేసింది అప్పటి ప్రభుత్వం. అనూహ్యంగా ఖర్చును అమాంతం పెంచడానికి గల ఒక్క కారణాన్ని కూడా అప్పటి ప్రభుత్వం తెలిపింది లేదు. అంతేకాకుండా సెక్రటేరియట్‌లో ఐటీ పరికరాల కొనుగోలుకని తొలుత రూ.181 కోట్ల వ్యవయాన్ని అంచనా వేసింది. దాన్ని కూడా ఒక్కసారిగా రూ.361కోట్లకు పెంచి ఖర్చు చూపించారు. అంటే పూర్తిగా సచివాలయం కోసం రూ.523 కోట్లు, ఐటీ పరికరాల కోసం రూ.180 కోట్ల అదనపు వ్యయాన్ని చూపింది అప్పటి ప్రభుత్వం. ఈ విషయంపై విజిలెన్స్ శాఖ నిగ్గు తేలుస్తోంది’’ అని కాంగ్రెస్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో చేసిన పోస్ట్‌లో పేర్కొంది.

‘‘అవినీతి పరులకే తెలుసు ఎన్ని రకాలుగా అవినీతి చేయొచ్చో. అందుకే బీఆర్ఎస్ అవినీతి నాయకులు, వారి అవినీతి అనుభవంతో అసంబద్ధ ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వం పై బురద జల్లుతూ పబ్బం గడుపుతున్నారు. వారి అవినీతి బయటపడుతుందని ముందే గ్రహించి, ప్రజా ప్రభుత్వం పై అసంబద్ధ విమర్శలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అని తమపై వస్తున్న విమర్శలను కూడా కాంగ్రెస్ తిప్పికొట్టింది.

Read More
Next Story