
'అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల మీదే ఏదీ?'
అధికారంలోకి 20 నెలలైనా పంటల బీమా ఊసే లేదుంటున్న బిఆర్ ఎస్ నేత హరీష్ రావు
పంట బీమా అంటూ ఎన్నికల ప్రచారంలో ఊదర గొట్టిన రేవంత్ రెడ్డి నాలుగు సీజన్లుగా పంట బీమా అమలు చేయకపోవడం సిగ్గుచేటు అని రైతుల పట్ల, వ్యవసాయం పట్ల కాంగ్రెస్ కు ఉన్న చిత్త శుద్ధి ఇదేనా అని మాజీ మంత్రి బిఆర్ ఎస్ సీనియర్ నాయకుడు టి హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతీ లేక పోవడం పట్ల ఆయన విస్మయం వ్యక్తం చేశారు.
మాటలు కోటలు దాటితే, రేవంత్ రెడ్డి ఆచరణ గడప కూడా దాటదు అనడానికి.. ఇప్పటికీ అమలు కాని పంటల బీమా మరో ఉదాహరణ అని ఆయన అన్నారు.
ఎన్నికలు వస్తే హామీలు గుప్పించడం, అధికారంలోకి వచ్చాక ‘మొండిచేయి’ చూపడం హస్తం పార్టీకి అలవాటుగా మారింది.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, రోట్లో తలపెట్టిన చందంగా మారింది రైతుల పరిస్థితి అని ఆయన అన్నారు.
‘వివిధ కారణాలతో పంట నష్టపోతే తక్షణం నష్టపరిహారం అందేలా పటిష్టమైన పంట బీమా పథకం తెస్తాం’ అని అభయ హస్తం మేనిఫెస్టో, వరంగల్ రైతు డిక్లరేషన్ లో హామి ఇచ్చారు. ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమం ఆధారంగా చేసుకొని రాష్ట్రంలో పంట బీమా పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తాం’ అని ఇప్పటి వరకు ప్రవేశ పెట్టిన మూడు బడ్జెట్ ప్రసంగాల్లోనూ (ఓటాన్ అకౌంట్ తో సహా) చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామికి, బడ్జెట్ లో చెప్పిన మాటకు విలువ లేకుండా పోయింది. గత బడ్జెట్ లో రూ. 1300 కోట్లు కేటాయించి, కేవలం కాగితాలకే పరిమితం చేసారు తప్ప రూపాయి విదిల్చింది లేదు. అధికారంలోకి వచ్చి 20 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకు పంటల బీమాకు అతీగతీ లేక పోవడం కాంగ్రెస్ మార్కు రైతు వ్యతిరేక విధానానికి నిదర్శనం.
"నిజంగా పంట బీమా అమలు చేయాలనే చిత్తశుద్ది గనక ఉంటే, మే, జూన్ నెలల్లోనే టెండర్లు పిలవాల్సి ఉంది. కానీ ఆ ప్రక్రియ ఇప్పటికీ చేపట్టక కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. అకాల వర్షాలు, వడగండ్లు, ఇతర విపత్తులు వచ్చిన ప్రతిసారి సాయం అందక రైతన్నలు మరింత చితికిపోతున్నారు. పంట బీమా అమలు చేయకపోవడం, రైతు భరోసా సరిగ్గా ఇవ్వకపోవడంతో రైతులు అప్పుల పాలై కోలుకోవడం లేదు. సర్వేల పేరుతో కాలయాపన తప్ప, నష్ట పరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వ్యవసాయం, రైతాంగం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టింపు లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. రెండు సీజన్ల రైతు భరోసా ఎగ్గొట్టారు. రైతు కూలీలకు ఆత్మీయ భరోసా అటకెక్కించారు. రుణమాఫీ చారాణ చేసి బారాణ మందిని మోసం చేసారు. అన్ని పంటలకు బోనస్ అని, సన్నాలకే పరిమితం చేసారు. సన్నాలకు 1200 కోట్ల బోనస్ డబ్బులను ఇప్పటికీ చెల్లించక రైతులకు బాకీ పడ్డరు,"అని హరీష్ రావు పేర్కొన్నారు.
యూరియా సమస్య
మరోవైపు యూరియా కొరత వేదిస్తున్నా ప్రభుత్వానికి ఉలుకులేదు పలుకులేదు. అందాల పోటీల రివ్యూలపై పెట్టిన శ్రద్ధ ఒక్కటైనా రాష్ట్రంలోని యూరియా సరఫరా కొరకు పెట్టి ఉంటే యూరియా కొరత వచ్చేది కాదు. ఆదిలాబాద్ జిల్లా, తలమడుగు మండలం పల్లి(బి) PACS లో ఎరువుల కొరత కారణంగా పల్లి(బి), పల్లి(కె) గ్రామస్థుల అవస్థలు.నిజామాబాద్ జిల్లా, ఆర్మూర్ సహకార సొసైటీలో యూరియా కొరకు ఉదయం నుండి రైతులు కట్టారు. కామారెడ్డి జిల్లా, గాంధారి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ముందు రోడ్డుపై రైతులు బైఠాయించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి)లో యూరియా కోసం రైతులు, మహిళలు బారులు తీరారు. రాష్ట్రంలోని అన్ని సహకార సొసైటీలలో ఇదే పరిస్థితి. నాట్లు పడకముందే యూరియా కొరత ఏర్పడితే, రైతుల పట్ల మీ శ్రద్ధ ఏ పాటి ఉందో స్పష్టంగా తెలుస్తోంది," అని అన్నారు.
ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి, ఎన్నికల మేనిఫెస్టోలో, బడ్జెట్ ప్రసంగాల్లో పంట బీమా అమలు చేస్తామని చెప్పిన మాటను నిలుపుకోవాలని, యూరియా కొరత లేకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం.