కొడంగల్ ఘటన బీఆర్ఎస్ పనే.. ఇవిగో ఆధారాలు: కాంగ్రెస్ ఎంపీలు
x

కొడంగల్ ఘటన బీఆర్ఎస్ పనే.. ఇవిగో ఆధారాలు: కాంగ్రెస్ ఎంపీలు

కొడంగల్‌లో నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ సహా ఆర్డీఓ స్థాయి అధికారులపై స్థానికులు, రైతులు దాడులకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది.


కొడంగల్‌లో నియోజకవర్గం లగచర్లలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌ సహా ఆర్డీఓ స్థాయి అధికారులపై స్థానికులు, రైతులు దాడులకు పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తోంది. ఈ ఘటననకు చాలా సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం పోలీసు బలగాలను రంగంలోకి దించింది. ఇప్పటి వరకు పోలీసులు 55 మందికిపైగానే అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలోనే పలు గ్రామాలకు ఇంటర్నెట్ సేవలను కూడా ప్రభుత్వం బంద్ చేసింది. తాజాగా ఈ ఘటనపై కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

దీని వెనక బీఆర్ఎస్ కుట్ర ఉందని, స్థానికులను అధికారులపై బీఆర్ఎస్ కార్యకర్తలతే ఉసిగొల్పారని కిరణ్ కుమార్ ఆరోపించారు. మల్లు రవి కూడా అధికారులపై దాడి వెనక బీఆర్ఎస్ హస్తం ఉందని ఆరోపించారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫార్మా సిటీ ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసమే బీఆర్ఎస్ నేతలు ఇటువంటి కుట్రలు చేస్తున్నారని వారు ఆరోపణలు చేశారు.

ఫార్మా సిటీ కోసం భూసేకరణ అంశంపై గ్రామస్తులతో సమావేశమవడానికి కలెక్టర్ వెళ్లారని, అక్కడ బీఆర్ఎస్ నేతల ఆదేశాలతోనే ఆ పార్టీ కార్యకర్తలు రైతుల ముసుగులో దాడికి పాల్పడ్డారని మల్లు రవి ఆరోపించారు. దీనికి సంబంధించి పలు ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని కూడా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారన్న తరహాలో ప్రచారం చేయాలనే బీఆర్ఎస్ ఈ డ్రామాకు తెరలేపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది రేవంత్‌పై దాడి కాదు..

‘‘కొడంగల్‌లో కలెక్టర్‌పై జరిగిన దాడిని సీఎం రేవంత్ రెడ్డిపై జరిగిన దాడిగా పలువురు ప్రచారం చేస్తున్నారు. కానీ ఇది సీఎంపై దాడి కాదు. ప్రజాస్వామ్య పాలనపై జరిగిన దాడి. కేసీఆర్ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎప్పుడూ కూడా హింస మార్గాన్ని ఎంచుకోలేదు. మేమెప్పుడూ అహింస మార్గంలోనే కేసీఆర్‌పై పోరాటం చేశాం. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. కుటుంబీకుల మేలు కోసమే కేసీఆర్ పదేళ్లపాటు పాలన చేశారు.అక్కడ దాడి చేయించి, ఢిల్లీకి వెళ్లి తమ చీకటి ఒప్పందంలో భాగంగా గతంలో బీజేపీకి సహకరించిన విషయాలను గుర్తు చేసి అమృత్ పథకం స్కాం అంటూ ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. బీజేపీని రెచ్చగొట్టి రేవంత్‌పై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నారు’’ అని మల్లు రవి ఆరోపించారు.

అభివృద్ధిని అడ్డుకోవడమే వాళ్ల లక్ష్యం

‘‘రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునేలా కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ రావులు వ్యవహరిస్తున్నారు. పార్టీ ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించిందే బీఆర్ఎస్. ఇప్పుడు పార్టీ ఫిరాయింపులంటూ మాట్లాడే నైతికత ఆ పార్టీకి లేదు. బీఆర్ఎస్ పాలనలో కలెక్టర్లు, ఎస్పీలు, ప్రభుత్వ ఉద్యోగులను తమ కుటుంబం కింద పనిచేసే కూలీల తరహాలో చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వచ్చిన తర్వాతే వారికి తగిన గౌరవం దక్కుతుంది. బీఆర్ఎస్ నేతలు దాడికి గురైన వారిని కాకుండా దాడి చేసిన వారిని పరామర్శించడానికి వెళ్తున్నారంటేనే ఆ పార్టీ తీరుతెన్నులేంటో స్పష్టం అవుతోంది. సాక్షాలు చూపాలి కానీ ఆరోపణలు చేయడం సరికాదు. రైతులైనా రాళ్లు పట్టి అధికారులపై దాడులు చేయడం తప్పు కాదా’’ అని ప్రశ్నించారు.

ఇదంతా కేసీఆర్ కుట్రే: చామల

‘‘కలెక్టర్‌పై దాడిని ప్రోత్సహించిన వారంతా బీఆర్ఎస్ కార్యకర్తలే. కేటీఆర్ తమ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి కావాలనే ఫార్మా సిటీకి భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి చర్యలతో ఆయన ప్రజలకు ఏమని సందేశం ఇవ్వాలనుకుంటున్నారో నాకర్థం కావట్లేదు. ఆయనే అయినా చెప్పాలి. ఏది ఏమైనా అధికారులపై దాడులకు పాల్పడిన వారిని ఎట్టిపరిస్థితుల్లో వదలబోము’’ అని తేల్చి చెప్పారు. ఈ విషయంపై కఠిన చర్యలు తప్పవని, సమగ్ర దర్యాప్తు చేయించి దీని వెనక ఉన్న ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Read More
Next Story