రేవంత్ కు బీఆర్ఎస్ నేత క్లీన్ చిట్..కేటీఆర్ కు నోరుపడిపోయింది
x
Revanth and KTR

రేవంత్ కు బీఆర్ఎస్ నేత క్లీన్ చిట్..కేటీఆర్ కు నోరుపడిపోయింది

సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలతో కేటీఆర్ గాలంతాపోయింది. కేటీఆర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని తేలిపోయింది.



రేవంత్ రెడ్డికి సొంతపార్టీ నేత క్లీన్ చిట్ ఇవ్వటం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పెద్ద షాకిచ్చినట్లయ్యింది. రేవంత్ ‘అమృత్’ పథకంలో భారీ అవినీతికి పాల్పడ్డారని కేటీఆర్ మూడురోజులు ఒకటే ఊదరగొట్టిన విషయం తెలిసిందే. కేటీఆర్ ఆరోపణలకు సంబంధించే కేటీఆర్ కు సొంతపార్టీ నేత, మాజీ ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డి ఊహించని షాక్ ఇచ్చారు. అమృత్ పథకానికి సంబంధించి కేటీఆర్ మాట్లాడుతు రేవంత్ రు. 8888 కోట్ల పథకంలో కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. తన బావమరిది సృజన్ రెడ్డికి రు. 1150 కోట్ల టెండర్ దక్కేట్లుగా చక్రం తిప్పినట్లు చెప్పారు. రేవంత్ పాల్పడిన అవినీతికి తన దగ్గర అన్నీ ఆధారాలున్నాయని చెప్పారు. ఈ దెబ్బతో రేవంత్ మీద కేసు నమోదవ్వటం, రేవంత్ ఇరుక్కోవటం, ముఖ్యమంత్రిగా రాజీనామా చేయటం ఖాయమని నానా రచ్చ రచ్చ చేశారు.

మీడియా సమావేశంలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఇవే ఆరోపణలతో కేటీఆర్ హోరెత్తించారు. సోదరులు, బావమరుదులకు రేవంత్ రాష్ట్ర సంపదను దోచిపెడుతున్నారంటు గోల గోల చేశారు. అమృత్ పథకంలో రేవంత్ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వివరణ ఇచ్చినా కేటీఆర్ పట్టించుకోలేదు. దమ్ముంటే రేవంత్ ఈ విషయంలో తనతో చర్చకు రావాలని చాలెంజ్ కూడా చేశారు.

సీన్ కట్ చేస్తే బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ కందాళం ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలతో కేటీఆర్ గాలంతాపోయింది. రేవంత్ పై కేటీఆర్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజంలేదని తేలిపోయింది. ఉపేందర్ తెరమీదకు వచ్చి తన ఆరోపణలకు కౌంటర్ ఇస్తారని బహుశా కేటీఆర్ ఊహించుండరు. అందుకనే సొంతపార్టీ నేత ఇచ్చిన వివరణకు ఏమి మాట్లాడాలో దిక్కుతోచక కేటీఆర్ మౌనం వహించారు. ఇంతకీ విషయం ఏమిటంటే కేటీఆర్ చెప్పినట్లుగా సృజన్ రెడ్డి సీఎంకు బావమరిది కాదు. ఉపేందర్ రెడ్డి చిన్నల్లుడు. రాజకీయాలు, వ్యాపారాలు వేర్వేరు అంశాలని మాజీ ఎంఎల్ఏ అన్నారు.

తన వియ్యంకుడు అంటే సృజన్ తండ్రి మనోహర్ రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతు అమృత్ టెండర్లలో, పనుల కేటాయింపులో ఎలాంటి అవినీతి, అవకతవకలు జరగలేదన్నారు. తన అల్లుడు సృజన్ కు శోధా అనే కంపెనీ ఉందట. ఈహెచ్పీ అనే కంపెనీకి అమృత్ టెండర్లు దక్కినట్లు చెప్పారు. ఈహెచ్పీ కంపెనీతో తన అల్లుడి కంపెనీ జాయింట్ వెంచర్ ద్వారా అమృత్ పనుల్లో రు. 1100 కోట్ల టెండర్ దక్కించుకున్నట్లు క్లారిటి ఇచ్చారు. తన అల్లుడి సృజన్ ను రేవంత్ బావమరిదిగా ఎవరో పొరబాటుపడ్డారని కూడా అన్నారు. అమృత్ టెండర్ల విషయంలో కేటీఆర్ కు ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు అనుమానించారు. తనకు వచ్చిన తప్పుడు సమాచారాన్ని కేటీఆర్ క్రాస్ చెక్ చేసుకోకుండానే నిజమని నమ్మి రేవంత్ పైన అవినీతి ఆరోపణలు చేసినట్లు ఉపేందర్ అభిప్రాయపడ్డారు.

అమృత్ పథకంలో ఎలాంటి అవినీతి జరగలేదని సొంతపార్టీ నేతే క్లారిటి ఇచ్చి రేవంత్ కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. మరిప్పుడు కేటీఆర్ ఏమి మాట్లాడుతారో చూడాలి. రేవంత్ ను చాలెంజ్ చేసేటపుడు తన ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ భీకర ప్రతిజ్ఞ కూడా చేశారు. కేటీఆర్ ఆరోపణలు తప్పని విచారణలో కాదు సొంతపార్టీ నేతే తేల్చి చెప్పేశారు. పైగా తనకు వచ్చిన తప్పుడు సమాచారాన్ని నిజమని నమ్మి రేవంత్ పైన కేటీఆర్ అవినీతి ఆరోపణలు చేశారని కూడా మాజీ ఎంఎల్ఏ తేల్చేశారు. అందుకనే ఏమి మాట్లాడాలో దిక్కుతోచక కేటీఆర్ ఎక్కడా అమృత్ పథకంలో అవినీతి గురించి నోరిప్పటంలేదు.

ఆతృతే కొంపముంచిందా ?

ఎలాగైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డిని గబ్బుపట్టించాలన్న ఆతృతే కేటీఆర్ కొంపముంచినట్లు అర్ధమవుతోంది. తెల్లవారి లేచింది మొదలు ఏదో ఒక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటమే కేటీఆర్ పనిగా పెట్టుకున్నారు. తమ హయాంలో జరిగిన వాటిని కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసేసి నానా రచ్చ చేస్తున్నారు. కేటీఆర్ అడుగుజాడల్లోనే హరీష్ రావుతో పాటు ఇతర నేతలు ప్రయాణం చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలను కూడా బూతద్దంలో చూపించి నానా గోలచేస్తున్నారు.

Read More
Next Story