BRS | వేషాలు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు..
x

BRS | వేషాలు వేస్తున్న బీఆర్ఎస్ నేతలు..

బీఆర్ఎస్ నేతలు రోజురోజుకు వేషాల రాయుళ్లలా మారుతున్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి రోజుకో వేషంలో దర్శనమిస్తున్నారు.


బీఆర్ఎస్ నేతలు రాయజకీయ నాయకులు కాస్తా రోజురోజుకు వేషాల రాయుళ్లలా మారుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వీరు రోజుకో వేషం కట్టి దర్శనమిస్తున్నారు. తమ పోరాటం ప్రజా సంక్షేమం కోసం, ప్రజల సమస్యలపై అని, ప్రజలను పీడిస్తునన కాంగ్రెస్ రాక్షస పాలనపై అని చెప్తున్న బీఆర్ఎస్ నేతలు సభలో చర్చలు చేయకుండా, వేషాలు వేయడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారో అర్థం కావట్లేదని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడటానికి తమ దగ్గర అంతా డొల్లగా ఉండటం వల్లే.. బీఆర్ఎస్ నేతలు రోజుకో వేషం కట్టి అసెంబ్లీ సమావేశాలను దాటవేస్తున్నారని, ఏదో ఒక సమస్య పేరుతో నిరసన, ఆందోళన అంటూ సభ నుంచి బయటకు వచ్చేసి పబ్బం గడుపుకుంటున్నారంటూ కూడా టాక్ వినిపిస్తోంది. సభలో నోరు విప్పితే బీఆర్ఎస్ బొక్కలే బయటపడతాయని తెలిసే వారు అసెంబ్లీలోకి అడుగు పెట్టడం లేదని, పెట్టినా ఏదో తూతూమంత్రంగా నాలుగు మాటలు మాట్లాడి వెంటనే నిరసన బాట పడుతున్నారని, దీనంతటికీ కారణంగా తమ దగ్గర స్టఫ్ లేకపోవడమేనని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.

రోజుకో వేషం..

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలైన మొదటి రోజు నుంచే బీఆర్ఎస్ నేతల వేషాలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు సమావేశాలకు ‘రేవంత్, అదానీ భాయ్ భాయ్’ అని ఉన్న టీషర్ట్‌లు వేసుకుని వచ్చారు. దాంతో వారిని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ రచ్చరచ్చ చేసి అసెంబ్లీ బయట నుంచి బయటకే వెళ్లిపోయారు. ఆరోజు వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు మళ్ళీ 16 డిసెంబర్ సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. మంగళవారం రోజు అంటే రెండో రోజునే లగచర్ల రైతులకు సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నా బీఆర్ఎస్ నేతలు.. నల్ల చొక్కాలు వేసుకుని అసెంబ్లీకి విచ్చేశారు. అంతేకాకుండా లగచర్ల రైతుకు బేడీలు వేయడానికి నిరసనగా కేటీఆర్, హరీష్ రావు మినహా పలువురు బీఆర్ఎస్ నేతలు చేతులకు బేడీలు కూడా వేసుకుని అసెంబ్లీకి వచ్చారు. మంగళవారం సభలో రాష్ట్ర అప్పులపై హరీష్ రావు చర్చించారు. అనంతరం లగచర్ల రైతుల సమస్యపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు నిరసన బాట పట్టారు. అలా నిన్నటి సమావేశాలు పూర్తయ్యాయి. ఈరోజు బుధవారం తాజాగా ఆటో డ్రైవర్ల వేషధారణలో బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్ పాలనలో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు విమర్శించారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఖాకీ చొక్క వేసుకుని స్వయంగా ఆటో తోలుకుంటూ అసెంబ్లీకి వచ్చారు. ఇవాళ్టికి ఈ సమస్య కూడా పూర్తవుతుంది. మరి రేపు, ఎల్లుండి అంటే గురు, శుక్ర వారాలు జరిగే అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు ఏ వేషాల్లో వస్తారు? అన్నది ప్రస్తుతం రాష్ట్రమంతా హాట్ టాపిక్‌గా మారింది.

ఇదే తొలిసారి కాదు..

అయితే అసెంబ్లీకి ప్రతిపక్ష నాయకులు రకరకాల సమస్యలపై నిరసన తెలపడానికే రావడం ఇదేమీ తొలిసారి కాదు. పార్లమెంటులో కూడా ఇటువంటివి చూస్తూనే ఉంటాం. గ్యాస్ ధరలు పెరిగితే వాటి ఫొటోలు, బొమ్మలు పట్టుకుని రావడం, నిత్యావసరాలు ధరలు పెరిగే కూరగాయాల హారాలతో సభకు హాజరుకావడం, పంటనష్టాలు, పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైతే రకరకాల పంట సంబంధిత మొక్కలు, కంకులు వంటిని చేతపట్టుకుని సభలు రావడం ప్రతిపక్ష నాయకులకు చాలా కామన్. సభకు వచ్చి ఆ సమస్యలపై నిరసనలు తెలపడం కూడా సర్వసాధారణం. అదానీ, మోదీ ఫ్రెండ్స్ అని ఉన్న టీషర్ట్ వేసుకుని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా పార్లమెంటుకు వెళ్లారు. ఇలాంటి మరెన్నో సంఘటనలు ఉన్నాయి. ఇవి ప్రతి రాష్ట్రంలో జరుగుతుంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా అదే పంథాలో దూసుకుపోతోంది. రోజుకో సమస్యపై పోరాడుతూ.. దానికి సంబంధించిన తరహాలో వేషధారణ వేసుకుని బీఆర్ఎస్ నాయకులు వస్తున్నారు.

Read More
Next Story