కవితపై అంత కుట్ర ఎవరు చేశారు..?
x

కవితపై అంత కుట్ర ఎవరు చేశారు..?

కొప్పుల ఈశ్వర్ నియామకం కూడా కుట్రలో భాగంగానే జరిగిందంటున్న కవిత.


బీఆర్ఎస్ పార్టీలో తనకు వ్యతిరేకంగా భారీ కుట్రలు జరుగుతున్నాయని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. తాను లేని సమయం చూసుకుని అన్నీ చకచకా చేసేస్తున్నారని అన్నారు. టీవీజీకేఎస్ అధ్యక్ష పదవి ఎన్నిక కూడా అలానే జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా పార్టీలో కావాలనే కుట్రలు చేస్తున్నారంటూ ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీజీకేఎస్ అధ్యక్ష పదవికి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నికయ్యారు. మొన్నటి వరకు ఆ పదవిలో కవిత ఉన్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇటీవల ఆమెను ఆ పదవి నుంచి తొలగించారు. తాజాగా ఆ స్థానంలో కొప్పుల ఈశ్వర్‌ను కూర్చోబెట్టారు. దీంతో బీఆర్ఎస్‌లో కల్వకుంట్ల కుటుంబ కలహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అయితే ఇప్పుడు కొప్పుల ఈశ్వర్ నియామకం కూడా కవిత అమెరికా వెళ్లిన సమయంలోనే ఆగమేఘాలపై చేసేయడం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. దీనిపైనే కవిత కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సింగరేణి బొగ్గు గని కార్మికులకు ఆమె బహిరంగ లేఖ రాశారు.

నాపైనే కక్ష కట్టారు..

ముందుగా టీవీజీకేఎస్ అధ్యక్షుడిగా ఎన్నికయినా కొప్పుల ఈశ్వర్‌కు అభినందనలు తెలిపారు. అనంతరం పలు అంశాలను ఆమె లేవనెత్తారు. ‘‘ఈ ఎన్నికను కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. రాజకీయ కారణాలతోనే ఎన్నికల జరిగింది. సింగరేణి కార్మికుల పక్షాన పోరాడుతున్నానని నాపై కుట్ర పన్నారు. బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు. నా తండ్రికి రాసిన లేఖను నేను అమెరికా వెళ్లిన సమయంలో లీక్ రూపంలో విడుదల చేశారు. ఆ కోవర్టులను బయటపెట్టాలని కోరినా.. నాపైనే కక్షకట్టారు. నన్నే తప్పుబట్టారు. ప్రతి పార్టీలో కోవర్టులు ఉంటారు.. సమయం వచ్చినప్పుడు వారే బయటపడతారన్నారు. ఆ కుట్రదారులో నన్ను అనేక రకాలుగా వేధింపులకు గురిచేస్తున్నారు. ఇప్పుడు అధ్యక్ష ఎన్నిక కూడా నేను అమెరికాలో ఉన్నప్పుడే జరిగింది. చట్టవిరుద్ధంగా టీవీజీకేఎస్ సమావేశం పెట్టి అధ్యక్షుడిని ఎన్నుకున్నారు’’ అని కవిత పేర్కొన్నారు.

కుట్రలు పన్నుతోంది కేటీఆరేనా..!

కొంతకాలంగా బీఆర్ఎస్‌లో జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. బీఆర్ఎస్‌లో కవిత వర్సెస్ కేటీఆర్‌గా పోరునడుస్తున్నట్లు కనిపిస్తోంది. కవిత ఎటువంటి వ్యాఖ్యలు చేసినా వాటికి బీఆర్ఎస్ నేతల నుంచి స్ట్రాంగ్ కౌంటర్లు వస్తున్నాయి. అదే విధంగా కవిత చేపట్టే ఏ నిరసనకు, ఆందోళనకు బీఆర్ఎస్ నుంచి మద్దతు అందడం లేదు. ఇటీవల బీసీ రిజర్వేషన్ల కోసం కవిత చేపట్టిన నిరాహార దీక్షలో కూడా ఒక్క బీఆర్ఎస్ నేత కూడా పాల్గొనలేదు. ఈ క్రమంలోనే పార్టీ మొత్తాన్ని కవితకు మద్దతు ప్రకటించకుండా శాసించే పవర్.. ఒకే ఒక్క వ్యక్తి ఉందని, అది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని విశ్లేషకులు చెప్తున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతలంతా కూడా కవితను చెప్పకుండానే వెలివేసినట్లు చూస్తున్నారని అంటున్నారు. అలా కాకుండా ఎవరో ఒకరో ఇద్దరో చిన్న చిన్న నేతలు, సీనియర్ నేతలు కవితకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతుంటే.. వారిని పార్టీ మొత్తం ఫాలో అవ్వదని కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అమెరికా పర్యటనలో కవిత..

ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. తన రెండో కుమారుడు ఆర్యను గ్రాడ్యుయేషన్‌లో జాయిన్ చేసేందుకు ఆమె అమెరికా వెళ్లారు. ఇందుకోసం ఆమె 15 రోజుల పాటు అమెరికాలోనే ఉండనున్నారు. అమెరికాకు వెళ్లే ముందు కవిత తన కుమారిడితో కలిసి ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో తన తండ్రిని కలవడానికి వెళ్లారు. కానీ అక్కడ కవితను కలవడానికి కేసీఆర్ ఇష్టపడలేదని, ఆర్యను మాత్రం కవిత తల్లి వచ్చి లోపలికి తీసుకెళ్లినట్లు సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో కవితపై కేసీఆర్ కూడా ఆగ్రహం ఉన్నారన్న చర్చ మొదలైంది.

Read More
Next Story