పార్టీ మారిన ఎమ్మెల్యే దానం... రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు
x

పార్టీ మారిన ఎమ్మెల్యే దానం... రంగంలోకి దిగిన బీఆర్ఎస్ నేతలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మారారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశారు.



‘ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయండి’ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పలువురు చేసిన ఫిర్యాదు ఇది. దానం నాగేందర్.. బీఆర్ఎస్ తరపున గెలిచి ఇప్పుడు పార్టీ మారడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకే నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఫిర్యాదు చేసిన నేతల్లో పాడి కౌశిక్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి సహా పలువురు ఇతర నేతలు కూడా ఉన్నారు. దానం నాగేందర్ తమ పార్టీని మోసం చేశారని, అతనిని వెంటనే పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు.

పార్టీ మారిన దానం నాగేందర్

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం భారత రాష్ట్ర సమితి పార్టీకి రాజీనామా చేశారు. గంటల వ్యవధిలోనే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డితో కలిసి పార్టీ మారారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వారిద్దరూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ బలోపేతం కోసం పాటుపడతామని తెలిపారు. అయితే త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తనకు చెవెళ్ల ఎంపీ టికెట్ లభించలేదన్న మనస్థాపంతో రంజిత్ రెడ్డి పార్టీ మారారు.

నాగేందర్‌పై చర్యలు తీసుకోవాలి

దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు విజ్ఞప్తి చేశామని పాడి కౌశిక్ స్పష్టం చేశారు. ‘‘తమ ఫిర్యాదుకు స్పీకర్ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకే స్పీకర్‌ను కలిశాం. ఒక పార్టీ తరపున గెలిచి వేరే పార్టీలోకి మారడం సమంజసం కాదు. అలా చేసే వాళ్లని రాళ్లతో కొట్టి చంపాలని గతంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే రేవంత్ ఇప్పుడు దానం నాగేందర్‌ను ఎలా తమ పార్టీలోకి ఆహ్వానించారు. దానం బీడీలు అమ్ముకునే వాడంటే చేసిన విమర్శలు, అవమానకర వ్యాఖ్యలను ఆయన మర్చిపోయారా? ఇప్పుడు దానం చేత కాంగ్రెస్‌లో బీడీలు అమ్మిస్తారా? నోరు ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. మేము ఒకడుగు వెనక్కి వేశాం అంటే నాలుగడుగులు ముందుకు వేస్తాం. ఒక దెబ్బ మీరు కొట్టారు. ఇప్పుడు కొట్టడానికి మేము సిద్ధమవుతున్నాం. మీరు గెట్లు తెరిచామని అంటున్నారు. మేమూ గేట్లు తెరిచే సమయం వచ్చింది. మేము గేట్లు తెరిస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం’’అని వ్యాఖ్యానించారు.


Read More
Next Story