
బీఆర్ఎస్ రజతోత్సవానికి సిద్ధమైన ‘బాహుబలి’ వేదిక..
రజతోత్సవ సభను మొత్తం 1,159 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. అందులో 159 ఎకాలను సభాస్థలానికి కేటాయించింది. మిగిలిన 1000 ఎకరాలను ఐదు జోన్లుగా విభజించారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభను అంగరంగవైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఈ రోజు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు.. సభ ఏర్పాట్లును పరిశీలించారు. పలు సూచనలు కూడా చేశారు. ఎల్కతుర్తి వేదికగా ఆదివారం జరిగే బీఆర్ఎస్ సభ నెవ్వర్ బిఫోర్ అనేలా ఉండాలని చెప్పారు. ఈ సభకు పది లక్షల మందికి పైగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వస్తారని సభ నిర్వహకులు భావిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక దగ్గర నుంచి పార్కింగ్ ఏర్పాట్ల వరకు ఏ ఒక్కరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. అందులో భాగంగా ఈ రజతోత్సవ సభను మొత్తం 1,159 ఎకరాల్లో నిర్వహిస్తున్నారు. అందులో 159 ఎకాలను సభాస్థలానికి కేటాయించింది. మిగిలిన 1000 ఎకరాలను ఐదు జోన్లుగా విభజించారు.
ఒక్కో జోన్‌ను ఒక్కో అవసరానికి వినియోగించనున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సహా ఇతర నేతలు ప్రసంగిస్తే దానిని ప్రతి ఒక్కరూ చూసడటానికి వీలుగా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేదిక 8 అడుగుల ఎత్తు, 159 అడుగుల వెడల్పు, 100 అడుగుల పొడవుతో ఉండనుంది. అందుకే దీనిని బీఆర్ఎస్ నేతలు సహా కార్యకర్తలు కూడా ‘బాహుబలి’ వేదికగా అభివర్ణిస్తున్నారు. ఈ వేదికను ఇప్పటికే నిర్మించేశారు. ప్రధాన వేదిక ముందు వీఐపీలు, మీడియా ప్రతినిధుల గ్యాలరీలు ఉండనున్నాయి. అంతేకాకుండా దూరంగా ఉన్నవారికి వేదికపై ఎవరెవరు ఉన్నారు, ఎవరు ప్రసంగిస్తున్నారు అన్నవి కనిపించేలా అనేక చోట్లు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయనున్నారు. రాత్రి సమయంలో కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ సంఖ్యలలో లైట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఏర్పడిన తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ బీఆర్ఎస్ 25 ఏండ్ల పండుగను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించబోతున్నారు. లక్షలాదిగా తరలివచ్చే జనానికి, అందుకు తగ్గట్టుగానే తాత్కాలిక వసతి సౌకర్యాలు సిద్ధమయ్యాయి. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన 1,213 ఎకరాల్లో రజతోత్సవ సభ కోసం బీఆర్ఎస్ పార్టీ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మహాసభ ప్రాంగణాన్ని 154 ఎకరాల్లో సిద్ధం చేసింది. 500 మంది కూర్చునేలా గులాబీ రంగులతో వేదికను తీర్చిదిద్దారు. వేదిక పక్కనే కళాకారుల ఆట-పాట కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ను ఏర్పాటుచేశారు. ఇక ఎల్కతుర్తికి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో చెత్తను, ముళ్ళచెట్లను తొలగించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. ప్రతి రోడ్డుకు ఇరువైపులా మొరం పోసి చదును చేశారు.
ఇక సభకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి దాదాపు 50 వేల వాహనాల వస్తాయని అంచనా వేస్తున్నారు. పార్కింగ్ కోసం 1,059 ఎకరాలను కేటాయించారు. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమ భాగం, వెనుక భాగంలో పార్కింగ్‌ను ఏర్పాటుచేశారు. సభకు వచ్చే ప్రజల కోసం లక్షకు పైగా కుర్చీలను ఏర్పాటు వేశారు. మహిళల కోసం ప్రత్యేక కుర్చీలు వేసి బారికేడ్లు పెట్టారు. లైట్లు, ఎల్‌ఈడీల కోసం 200 భారీ జనరేటర్లను ఏర్పాటుచేశారు. కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టంను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు.
వేల మంది వాలంటీర్లు..
ఈ సభకు హాజరయ్యే వారికి ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకోవడం కోసం వాలంటీర్లను కూడా సిద్ధం చేశారు. ఈ వాలంటీర్లు ప్రతి జోన్‌లో ఉంటారు. ఐదు జోన్లకు గానూ దాదాపు 3 నుంచి 4 వేల మంది వాలంటీర్లు అందుబాటులో ఉంటారు. సభకు నాలుగు వైపులా పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాల్లో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ వాలంటీర్లు చూసుకుంటారు. అంతేకాకుండా ప్రజలకు, కార్యకర్తలను తీసుకురావడానికి దాదాపు నాలుగువేలకు పైగా బస్సులను, లారీలు, డీసీఎంలు సహా మరిన్ని వాహనాలను అందుబాటులో ఉంచారు. వాటి రాకపోకలకు కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు చూసుకుంటూ సభకు వచ్చేవారికి దిశానర్దేశం చేయడానికి వాలంటీర్లు ఉండనున్నారు.
అందుబాటులో ప్రథమ చికిత్స
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తారాస్థాయిలో ఉంటున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సభకు వచ్చే వారికి ఎటువంటి అస్వస్థ జరగకుండా చూసుకోవడానికి పార్కింగ్ స్థలాల్లోనే ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో ప్రాథమిక కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు నర్సులు ఉంటారు. పరుషులు, మహిళలకు వేరవేరుగా బయో టాయిలెట్స్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.
ట్రాఫిక్ మళ్లిస్తున్న పోలీసులు..
బీఆర్ఎస్ సభ సందర్భంగా భారీ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే కరీంనగర్, హుస్నాబాద్, సిద్దిపేటకు వెళ్లే వాహనాలను దారిమళ్లిస్తున్నట్లు వరంగల్ ట్రాఫిక్ ఏసీసీ సత్యనారాయణ వెల్లడించారు. మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు సభ జరగనున్న క్రమంలో ఆ సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు ఉంటాయని చెప్పారు. "కరీంనగర్ నుంచి హనుమకొండ, వరంగల్కు వచ్చే వాహనాలు హుజూరాబాద్ పరకాల క్రాస్ రోడ్డు, ఉప్పల్, కమలాపూర్, అంబాల, ముచ్చర్ల క్రాస్ రోడ్డు నుంచి కొత్తగా నిర్మించిన ఓఆర్ఆర్ మీదుగా రావాలి. వరంగల్, హనుమకొండ నుంచి తిరిగి వెళ్లే వాహనాలు అదే మార్గంలో కరీంనగర్ వైపు వెళ్లాలి’’ అని చెప్పారు.
‘‘సిద్దిపేట నుంచి హనుమకొండ వైపు వచ్చే వాహనాలు సిద్దిపేట, జనగామ మీదుగా వచ్చి, తిరిగి అదే మార్గంలో వెళ్లాలి. హుస్నాబాద్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు హుస్నాబాద్, తరిగొప్పుల మీదుగా వచ్చి.. తిరిగి అదే మార్గంలో వెళ్లాలి. లేదా భీమ దేవరపల్లి మండలం ములుకనూర్, కొత్తకొండ, వేలేరు, మల్లికుదుర్లు, క్యాతంపల్లి, పెద్ద పెండ్యాల మీదుగానైనా హనుమకొండకు చేరుకోవచ్చు" అని ఏసీపీ వెల్లడించారు.
జోన్ల వారీగా పార్కింగ్ వివరాలిలా..
జోన్ 1: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి 163 మీదుగా కేయూ క్రాస్రోడ్, హసన్పర్తి, ఎల్లాపూర్ గుండా సభాస్థలికి చేరుకుంటాయి. హనుమకొండ - కరీం నగర్ (ఎన్హెచ్ 563) జాతీయ రహదారి పక్కన ఉన్న ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 35 వేల వరకు వాహనాలు నిలిపేలా ఏర్పాట్లు చేశారు.
జోన్ 2: ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాలు, హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు జాతీయ రహదారి 163 మీదుగా కరుణాపురం, దేవ న్నపేట, మడిపల్లి అనంతసాగర్ గుండా చేరుకుం టాయి. చింతగట్టు, జయగిరి, అనంత్సాగర్ మీదు గానూ అక్కడికి చేరుకోవచ్చు. 250 ఎకరాల్లో విస్త రించి ఉన్న ఈ ప్రాంతంలో 40 వేల వరకు వాహ నాలు నిలిపే సదుపాయం ఉంది.
జోన్ 3: జనగామ, స్టేషన్ఫన్పూర్తోపాటు హైద రాబాద్ లోని పలు ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ధర్మసాగర్ మీదుగా దేవునూరు, దామెర, చింతలపల్లి నుంచి ఇక్కడకు చేరుకుంటాయి. సుమారు వందెక రాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంతంలో 18 వేల వరకు వాహనాలు నిలిపే వీలుంది. దీన్ని ప్రధాన వేదిక వెనక భాగంగా ఏర్పాటు చేశారు.
జోన్ 4: ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు ఆదిలాబాద్ జిల్లాలోని సిర్పూర్, బెల్లంపల్లి, చెన్నూరు, మంచి ర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, పరకాల నియోజకవ ర్గాల నుంచి వచ్చే వాహనాలు ఈ ప్రాంగణానికి చేరు కుంటాయి. దీనిని హనుమకొండ-కరీంనగర్ జాతీయ రహదారి 563 పక్కనున్న ఎల్కతుర్తి తహసీల్దారు కార్యా లయం, గ్రానైట్ క్వారీ పక్కన ఏర్పాటుచేశారు. సుమారు 250 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాంగణంలో 40 వేల వరకు వాహనాలు నిలిపే అవకాశం ఉంది.
జోన్ 5: ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతో పాటు ఆదిలాబాద్, నిర్మల్, బోద్, ఖానాపూర్ నియో జకవర్గాల నుంచి వచ్చే వాహనాలకు ఇక్కడ పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సిద్ధిపేట-హుస్నాబాద్ 765 డీజీ జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ ప్రాంగణానికి సిద్దిపేట, హుస్నాబాద్, ముల్కనూరు, గోపాల్పూర్ క్రాస్రోడ్డు, ఇందిరానగర్ మీదుగా చేరుకోవచ్చు
బీఆర్ఎస్‌కు అనుభవం ఉంది: హరీష్
ఆదివారం జరగనున్న రజతోత్సవ సభ ఏర్పాట్లను శనివారం మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారీ బహిరంగ సభలను జరిపిన ఘనత, అనుభవం తమ పార్టీకి ఉన్నాయని అన్నారు. ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు తరలివస్తున్నారని చెప్పారు. ‘‘ఎడ్ల బండ్లు, వాహనాలు, సైకిల్, పాదయాత్రగా తరలి వస్తున్నారు. కేసీఆర్‌ని చూడాలి, కేసీఆర్ ప్రసంగం వినాలి అని వస్తున్నారు. బిఆర్ఎస్ రజతోత్సవం తెలంగాణ ప్రజలకు పండుగ రోజు’’ అని హరీష్ చెప్పుకొచ్చారు.