కేటీఆర్ కి షాకిచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే
x

కేటీఆర్ కి షాకిచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు.


బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సొంత పార్టీ ఎమ్మెల్యే షాకిచ్చారు. ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. ఈ వ్యవహారం రాజకీయ దుమారానికి తెరలేపింది. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత పార్టీ బాధ్యతలు కేటీఆర్ పైనే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ కూడా పార్టీ వ్యవహారాలు పెద్దగా పట్టించుకోవడం లేదు. బాధ్యతలు మొత్తం కేటీఆర్ భుజానేసుకుని మోస్తున్నారు. హరీష్ రావు కూడా పార్టీ బాధ్యతలు షేర్ చేసుకుంటున్నారు.

అయితే ఈ ఇద్దరు నేతలు హైడ్రాని తీవ్రంగా తప్పుపడుతున్నారు. బెదిరించి బీఆర్ఎస్ నేతల్ని తన పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ హైడ్రా డ్రామా మొదలు పెట్టారని దుయ్యబడుతున్నారు. ఈ క్రమంలో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హైడ్రాని స్వాగతిస్తున్నానని మీడియా ముఖంగా ప్రకటించారు. చెరువుల్లో కట్టుకున్న అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం అభినందనీయమని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ... గొలుసుకట్టు చెరువులపై అనేక నాలాలు ఉన్నాయి.. వాటిపై ఉన్న నిర్మాణాలపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో చాలా మందికి పట్టాలున్నాయి.. వాటిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో రేవంత్ రెడ్డి, హైడ్రా రంగనాథ్ చెప్పాలన్నారు. అలాగే చెరువుల ఆక్రమణలని తెలియక కొనుగోలు చేసిన పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వం ఏ విధంగా న్యాయం చేయనుందో... చెరువుల పరిరక్షణకు ఓ నోడల్ ఆఫీసర్, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి కమిటీలు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రభుత్వానికి సూచించారు.

మాధవరం కృష్ణారావు తాజా వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. పార్టీ హైకమాండ్ వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి ఆమోదం తెలపడమే కాదు.. సూచనలు, సలహాలు ఇవ్వడం కొత్త చర్చకి దారి తీసింది. ఇక ఆయన మాట్లాడిన క్లిప్పులు షేర్ చేస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా బీఆర్ఎస్ ని ఎక్కిరిస్తోంది. మీరు వద్దంటుంటే మీ పార్టీ ఎమ్మెల్యేలు మంచి నిర్ణయమని అభినందిస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ కి కృష్ణారావు గుడ్ బై..

గత కొంతకాలంగా మాధవరం కృష్ణారావు బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరతారంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డితో ఆయనకి గతంలో ఉన్న సన్నిహితం, కాంగ్రెస్ మంత్రిని, ఇటీవల చంద్రబాబుని కలవడమే. మాధవరం కృష్ణారావు తన రాజకీయ జీవితాన్ని టీడీపీ నుంచి ప్రారంభించారు. 2014లో కూకట్ పల్లి నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015 లో బీఆర్ఎస్ లో చేరారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలామంది కాంగ్రెస్ లో చేరుతారనే ప్రచారం సాగింది. అదే క్రమంలో నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కృష్ణారావు రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి దుద్దిళ్ల శ్రీధర బాబుని కలవడం హాట్ టాపిక్ అయింది. ఆ సమయంలో ఆయన ఒకటి రెండు రోజుల్లో పార్టీ మారతారు అంటూ గట్టిగానే చర్చ నడిచింది. కానీ అలా జరగలేదు.

ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పర్యటనలో ఉన్న సమయంలో కూడా మాధవరం కృష్ణారావు ఆయన్ని కలిసారు. జూబ్లీహిల్స్ చంద్రబాబు నివాసంలో వీరు భేటీ అయ్యారు. ఆ సమయంలోను కృష్ణారావు కాంగ్రెస్లో చేరుతారంటూ ప్రచారం ఊపందుకుంది. దీనికి కారణం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కృష్ణారావు టిడిపి నుంచి వచ్చినవారే. వీరిద్దరికి గతంలో సాన్నిహిత్యం ఉంది. ఈ అంశంపైనే చంద్రబాబుతో చర్చించడానికి వెళ్లి ఉంటారని గుసగుసలు వినిపించాయి.

తాజాగా రేవంత్ నిర్ణయానికి కృష్ణారావు మద్దతు ఇవ్వడం మరోసారి చర్చకు తెరలేపింది. ఆయన కేటీఆర్ కి షాక్ ఇచ్చి కాంగ్రెస్ లో చేరడం పక్కా అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Read More
Next Story