కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి... ఆ నలుగురు కూడా?
x

కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికపూడి... ఆ నలుగురు కూడా?

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆ పార్టీని వీడారు.


బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆ పార్టీని వీడారు. శనివారం ఆయన జూబిలీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు. రేవంత్ రెడ్డి ఆయనకి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అరికపూడి గాంధీతో పాటు ఆయన అనుచరులు కూడా రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు.

తొమ్మిదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్..

ఈరోజు కాంగ్రెస్ లో జాయిన్ అయిన అరికపూడి గాంధీతో కలిపి మొత్తం తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ని వీడారు. వీరంతా గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నిన్న (శుక్రవారం) రాత్రి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేరగా ఈరోజు అరికపూడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ఆ ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి?

శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ... త్వరలో బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కానుందని, రేపు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని చెప్పారు. అయితే ఇటీవల రంగారెడ్డి జిల్లాకి చెందిన ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో భేటీ అయ్యారు. ఇది మర్యాదపూర్వక భేటీ అని, నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాల్సిందిగా కోరడానికే మంత్రిని కలిసినట్టు చెప్పుకొచ్చారు.

మంత్రిని కలిసిన వారిలో జిల్లాకి చెందిన ఎమ్మెల్యేలు బండారు లక్ష్మారెడ్డి, మాధవరం కృష్ణారావు, అరికపూడి గాంధీ, మర్రి రాజశేఖర్, వివేకానంద ఉన్నారు. దీంతో రంగారెడ్డి జిల్లాకి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ లో చేరతారంటూ ప్రచారం మొదలైంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరగా... మిగిలిన నలుగురు ఎమ్మెల్యేలు కూడా జంప్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. దీంతో దానం నాగేందర్ చెప్పింది రంగారెడ్డి జిల్లాకి చెందిన ఈ ఆరుగురు ఎమ్మెల్యేల గురించే అనే చర్చ నడుస్తోంది.

Read More
Next Story