తనమీద తానే ఫిర్యాదుచేసుకున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏ బండ్ల
x
BRS MLA Bandla Krishna Mohan Reddy with Revanth

తనమీద తానే ఫిర్యాదుచేసుకున్న బీఆర్ఎస్ ఎంఎల్ఏ బండ్ల

ఫిరాయింపు ఎంఎల్ఏ మాత్రం ఈనెల 11వ తేదీన గద్వాల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నాడు


ఈ ఫిరాయింపు ఎంఎల్ఏ వ్యవహారం రెండు ప్రధానపార్టీలకు ఏమాత్రం అంతుపట్టడంలేదు. బీఆర్ఎస్ తరపున గెలిచి తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించిన గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Gadwal BRS Defected MLA Bandla) వ్యవహారం ఇపుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం ఏమిటంటే బండ్ల తనమీద తానే గద్వాల పోలీసుస్టేషన్లో(Gadwal Police Station) ఫిర్యాదు చేసుకోవటమే. ఎవరైనా తనమీద తానే పోలీసులకు ఫిర్యాదు చేసుకుంటాడా ? నెవర్, ఎవ్వరూ చేసుకోరు కాని ఈ ఫిరాయింపు ఎంఎల్ఏ మాత్రం ఈనెల 11వ తేదీన గద్వాల పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసుకన్నాడు. ఈ విషయంలోనే ఎంఎల్ఏ వైఖరి అర్ధంకాక జనాలకు పిచ్చెక్కిపోతోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే తన నియోజకవర్గంలో తనకు తెలీకుండా కొందరు తన ఫొటోలను కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీల్లో చూపిస్తున్నారని బండ్ల ఫిర్యాదులో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు(Congress party), వాల్ పోస్టర్లలో తనకు తెలీకుండా తన ఫొటోను వాడి తన ఇమేజీకి భంగం కలిగించినట్లు ఫిరాయింపు ఎంఎల్ఏ ఫిర్యాదుచేయటం ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. గుర్తుతెలీని కొందరు చేసిన పనివల్ల తన పరువుకు, ఇమేజీకి భంగం కలిగింది కాబట్టి వెంటనే తప్పుచేసిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బండ్ల పోలీసులను కోరారు. బండ్ల ఫిర్యాదుతో ముందు పోలీసులకు కచ్చితంగా షాక్ కొట్టి ఉంటుందనటంలో సందేహంలేదు. అయితే ఏమిచేయాలో తోచక ఫిరాయింపు ఎంఎల్ఏ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదుచేశారు.


ఎఫ్ఐఆర్ అయితే నమోదుచేశారు కాని దర్యాప్తు ఎవరిమీద చేస్తారు ? ఏమని చేస్తారు ? ఎందుకంటే బీఆర్ఎస్(BRS) తరపున గెలిచిన బండ్ల తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. రేవంత్ రెడ్డి(Revanth) సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. బండ్ల కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం రాష్ట్రంమొత్తం తెలుసు. తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయాన్ని బండ్ల కూడా ఏమీ దాచుకోలేదు, రహస్యంగా జరిగిందీ కాదు. అందరి సమక్షంలోనే, తన మద్దతుదారులతో రేవంత్ ను కలిసిన బండ్ల కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. రేవంత్ సమక్షంలో బండ్ల కాంగ్రెస్ కండువా కప్పుకున్నపుడు తీసిన ఫొటోల్లో మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంఎల్ఏ మల్లురవి కూడా ఉన్నారు. ఎప్పుడైతే కాంగ్రెస్ లోకి ఫిరాయించారో అప్పటినుండి బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో కాని తెలంగాణ భవన్లో కాని జరిగిన పార్టీ మీటింగుల్లో ఒక్కటంటే ఒక్క మీటింగుకు కూడా హాజరుకాలేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీలోను, సచివాలయంలో రేవంత్ ఆఫీసు చుట్టే తిరుగుతున్నారు.

తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయాన్ని తనంతట తానే అందరికీ చెప్పుకున్నారు. రేవంత్ జిల్లా పర్యటనలో సీఎంతో కలిపి తన ఫెక్లీలను, పోస్టర్లను తానే నియోజకవర్గంలో ప్రదర్శించుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏనే అన్న విషయాన్ని నియోజకవర్గం జనాలకు తెలిసేట్లుగా బండ్లనే అన్నీరకాల ప్రచారాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినందుకు కారుపార్టీ నేతలు, క్యాడర్ గోలచేసినా పట్టించుకోలేదు. పైగా తనమీద దాడిచేసినట్లు బీఆర్ఎస్ నేతలపై యాక్షన్ తీసుకోవాలని గతంలో ఇదే బండ్ల పోలీసులకు ఫిర్యాదు కూడా చేసున్నాడు.

సడెన్ గా బండ్లలో ఎందుకు మార్పు ?

నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎంఎల్ఏగానే చెలామణి అవుతున్న ఫిరాయింపు ఎంఎల్ఏ బండ్లలో సడెన్ గా ఎందుకు మార్పు వచ్చింది ? ఇపుడీ విషయంపైనే అందరిలోను చర్చ జరుగుతోంది. ముఖ్యకారణం ఏమిటంటే తనమీద అనర్హత వేటుపడకుండా ఫిరాయింపు ఎంఎల్ఏ ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారేమో అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ ఫిరాయింపుల అనర్హత వేటు అంశం సుప్రింకోర్టు విచారణలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఫిరాయింపు ఎంఎల్ఏల మీద అనర్హత వేటు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ పదేపదే చెబుతున్నారు. ఫిరాయింపులపై అనర్హత వేటుపడదని రేవంత్ పరోక్షంగా భరోసా ఇస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఫిరాయింపుల్లో గందరగోళమైతే మొదలైంది.

తమపై అనర్హత వేటుపడితే ఏమిచేయాలో వీళ్ళకు అర్ధంకావటంలేదు. ఎందుకంటే అనర్హత వేటుపడిన తర్వాత జరగబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తమకు టికెట్ ఇస్తుందో ఇవ్వదు తెలీదు. టికెట్ ఇచ్చినా తాము గెలుస్తామో లేదో అంతకన్నా తెలీదు. ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే ఏమిచేయాలో అర్ధంకావటంలేదు. ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధులు గెలిస్తే తమ పరిస్ధితి ఏమిటి అన్నదే వీళ్ళల్లో టెన్షన్ పెంచేస్తున్నట్లుంది. ఇలాంటి అనేక అంశాలను ఆలోచించుకునే గద్వాల ఫిరాయింపు ఎంఎల్ఏ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏ అయిన తనను కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కొందరు దుష్ప్రచారం చేస్తున్నట్లు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో చెప్పారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నట్లుగా బండ్ల చెప్పుకుంటే సరిపోతుందా ? రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న మాటేమిటి ? దానికి సాక్ష్యంగా ఉన్న ఫొటోలు, వీడియోలపై బండ్ల ఏమిచెబుతారు ? గతంలో శేరిలింగంపల్లి ఫిరాయింపు ఎంఎల్ఏ అరెకపూడి గాంధీ చెప్పినట్లుగా రేవంత్ తనకు కప్పింది కాంగ్రెస్ కండువా కాదని, తిరుమల శ్రీవేంకటేశ్వరుని కండువా అని అంటారా ?

బండ్ల వైపునుండి అంతా బాగానే ఉందికాని ఇపుడు పోలీసులు ఏమిచేయాలి ? అన్నది కీలకమైన ప్రశ్న. బండ్ల ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు ఏమని దర్యాప్తుచేయాలి ? ఎవరిని బాధ్యులను చేయాలి ? ఎవరిమీద చర్యలు తీసుకోవాలి ? బండ్ల తనమీద తానే పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారన్నది స్పష్టం. ఎందుకంటే కాంగ్రెస్ లోకి ఫిరాయించింది తానే, రేవంత్ సమక్షంలో కండువా కప్పుకున్నదీ తానే. రేవంత్+బండ్ల ఉన్న ఫెక్సీలు, పోస్టర్లను నియోజకవర్గంలో అతికించుకున్నదీ తానే. తానే అంటే తన మద్దతుదారులే బండ్ల+రేవంత్, బండ్ల+కాంగ్రెస్ ఫెక్సీలు, పోస్టర్లను నియోజకవర్గంలో అతికించి ప్రచారం చేశారు. అందుకనే బండ్ల తన పిర్యాదులో ‘గుర్తుతెలీని వ్యక్తులు’ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నది. మొత్తానికి పోలీసులకు, జనాలకు బండ్ల పిచ్చెక్కించేస్తున్నదయితే వాస్తవం. మరీ కేసును పోలీసులు ఎలా డీల్ చేస్తారో చూడాలి.

Read More
Next Story