Harish Rao
x
Harish Rao

ప్రమాద సమయంలోనూ రాజకీయాలేనా..హరీష్

అవకాశం దొరికిందికదాని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు


అగ్నిప్రమాదం జరిగి 17మంది చనిపోయిన సంఘటనలో కూడా బీఆర్ఎస్ ఎంఎల్ఏ హరీష్ రావు రాజకీయాలే మాట్లాడుతున్నారు. అవకాశం దొరికిందికదాని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ప్రమాదంపై హరీష్ మాట్లాడుతు ముందస్తుచర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. వేసవిలో అగ్నిప్రమాదాల నివారణకు ముందస్తు వ్యూహం లేకపోవటం ప్రభుత్వ నిర్లక్ష్యమే అని ఆరోపించారు. ప్రభుత్వఅలసత్వానికి సామాన్యులు చనిపోతున్నారని మండిపోయారు. అగ్నిమాపక శాఖ సన్నద్దతపై ఇప్పటికైనా సమీక్ష చేయాలని ప్రభుత్వాన్ని హరీష్(Harish Rao) కోరారు. బాధిత కుటుంబాలకు రు. 25 లక్షల పరిహారం ఇవ్వాలని హరీష్ డిమాండ్ చేశారు. 17మంది అగ్నిప్రమాదంలో మరణించటం బాధాకరమని ఎంఎల్ఏ విచారం వ్యక్తంచేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అగ్నిప్రమాదాలు జరుగుతున్నా ముందస్తుచర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం ఫెయిలైందన్న హరీష్ ఆరోపణకు అర్ధంలేదు. ఎందుకంటే ఎక్కడ ప్రమాదం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఇపుడు గుల్జార్ ఏరియాలో ప్రమాదం సంఘటననే తీసుకుంటే ఇందులో ప్రభుత్వ అలసత్వం ఏమీలేదు. ప్రమాదం విషయం తెలియగానే 11 ఫైర్ ఇంజన్లు ఘటనా స్ధలానికి చేరుకున్నట్లు ఫైర్ సర్వీస్ డీజీ నాగిరెడ్డి చెప్పారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని డీజీ చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని షాపులో షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని ప్రభుత్వం ఏమన్నా ముందుగా కలగుంటుందా ? తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరగటంతో బయటప్రపంచానికి తెలిసేందుకు సమయంపట్టింది. ప్రమాదఘటన తెలియగానే అగ్నిమాపకశాఖ వెంటనే స్పందించింది.

కట్టుకున్న ఇళ్ళు, షాపులు, షాపింగ్ కాంప్లెక్సుల్లో ఫైర్ సేఫ్టీ చర్యలు లేకుండా, ప్రమాదాలు జరిగినపుడు రెండోమార్గం నుండి బయటపడేందుకు అవకాశాలు లేకుండా నిర్మించుకుంటే ప్రభుత్వం ఏమిచేస్తుంది ? ఈ నిర్మాణాలన్నీ ఎన్నో దశాబ్దాల క్రితం చేసినవి. ప్రభుత్వం ఏదన్నా చర్యలు తీసుకుందామని ప్రయత్నిస్తే మళ్ళీ ప్రతిపక్షాలే అడ్డుకుని నానాగోలచేస్తాయి. మూసీనది(Musi River Project) ప్రక్షాళన, జలవనరులను కాపాండేందుకు హైడ్రా(Hydra) ప్రయత్నాలను ఇదే బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఎంతగా అడ్డుకున్నారో అందరు చూసిందే.

హుందాగా స్పందించిన కేటీఆర్

అగ్నిప్రమాద ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) దిగ్ర్బాంతి వ్యక్తంచేశారు. జరిగిన ప్రమాదం అత్యంత విషాధమన్నారు. దుర్ఘటనలో ప్రమాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వం మంచి వైద్యం అందించాలని సూచించారు. సంక్షోభసమయంలో అవసరమైన సహాయచర్యల్లో బీఆర్ఎస్ చర్యల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపిచ్చారు. బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓల్డ్ సిటీతో పాటు హైదరాబాద్ నగరంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పారు. విషాధ సమయంలో ప్రజలందరు ఐకమత్యంగా ఉండాలని విజ్ఞప్తిచేశారు.

Read More
Next Story