వరద బాధితులకు అండగా బీఆర్ఎస్.. నెల జీతం విరాళం
x

వరద బాధితులకు అండగా బీఆర్ఎస్.. నెల జీతం విరాళం

ఖమ్మం వరద బాధితులకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.


ఖమ్మం వరద బాధితులకు అండగా నిలబడాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆయన నిర్ణయం మేరకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒక నెల జీతం విరాళంగా ఇస్తున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. బుధవారం సిద్దిపేటలో ఓ కార్యక్రమానికి హాజరైన హరీష్ రావు మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వరదలు వల్ల సర్వం కోల్పోయి ఇబ్బంది పడుతున్న ప్రజలకు అండగా నిలవాలని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన సహాయక చర్యలు చేపట్టిందన్నారు. అందుకు తోడుగా బీఆర్ఎస్ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు ఒక నెల జీతాన్ని వారికి అందించనున్నామని తెలిపారు. ప్రజల కష్టాల్లో తోడుండే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా విలియం సృష్టించిన విపత్తులో ప్రజలతో, ప్రజల పక్షాన నిలబడి ఉందని చెప్పుకొచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజలందరూ ముందుకు రావాలని హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంత నష్టం...

రాష్ట్రంలో వరద బీభత్సం పై మాట్లాడిన హరీష్ రావు.. ప్రభుత్వ వైఫల్యం వల్లే తీవ్ర నష్టం జరిగిందని ఆరోపించారు. మూడు నాలుగు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జనజీవనం స్తంభించింది, ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ నష్టం జరిగిందన్నారు. కట్టు బట్టలు తప్ప మా దగ్గర ఏమీ లేవని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. తక్షణమే మరణించిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోల్పోయిన వస్తువులకు రూ.2 లక్షలు ఆర్థిక సహాయం అందించాలన్నారు. చదువుకున్న వారికి సర్టిఫికెట్లు ఇప్పించాలని కోరారు.

వరద బాధితులకు కనీసం తాగునీళ్లు, భోజనం అందించలేకపోయారని ప్రభుత్వంపై హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రికి వైరాగ్యం ఎక్కువ, పాలనపై పట్టు కోల్పోయి ప్రతిపక్షాలపై మండిపడుతున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం వల్లనే ఇంత నష్టం జరిగిందన్నారు. ఇప్పటికే మరణించింది 28 మంది అయితే ఈ ప్రభుత్వం 16 మంది అని చూపిస్తుంది అన్నారు. భక్త రామదాసు, పాలమూరు ప్రాజెక్టులు మునిగిపోయాయి అన్నారు. ఇప్పుడు పంట నష్టం ఎకరానికి రూ. 30,000 ఇవ్వాలన్నారు. అధికారంలో ఉండి ప్రతిపక్షం సహాయం అడుగుతున్నాను, మీ బురద ప్రతిపక్షానికి పూయాలని చూస్తున్నారు, వరదల్లో ముఖ్యమంత్రి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అవ్వడం వల్లే ముఖ్యమంత్రి వెళ్లారని హరీష్ రావు విమర్శించారు.

Read More
Next Story