బిఆర్ ఎస్  కు బామ్మర్దుల నాయకత్వం... వ్యూహం ఫలిస్తుందా!
x

బిఆర్ ఎస్ కు బామ్మర్దుల నాయకత్వం... వ్యూహం ఫలిస్తుందా!

కెసిఆర్ కుటుంబ సభ్యులను ఎక్కుపెడుతూ ఒక వైపు మేడిగడ్డ జ్యుడిషియల్ ఎంక్వయిరీ ప్రయత్నాలు, మరొక వైపు ఫార్ములా రేస్ అక్రమాలు..ఈ గొడవలో బామ్మర్ధుల నాయకత్వం ...


బిఆర్ ఎస్ బావ బామ్మర్దులు ఈ మధ్య ఒక డ్యెయెట్ అందుకున్నారు. అది హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియదు. గతంలో లాగా కాకుండా ఇపుడు బిఆర్ ఎస్ కు ఉమ్మడి నాయకత్వం ఉంటుందనేందుకు ఇదొక సూచన. ఇద్దరు కలసి ఒకే మాట, ఒకే పాటగా సాగుతున్నారు.

గత డిసెంబర్ నాలుగో తేదీ నుంచి ఆ పాటను పదే పదే పాడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని భారత రాష్ట్ర సమితి ఓడిపోయేందుకు కారణం పార్టీలో లేదు, నాయకత్వంలో లేదు, పరిపానలో లేదు. ప్రజల్లో మాత్ర మే ఉందని అంటున్నారు. 15సంవత్సరాల వీరోచిత తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కెసిఆర్ నాయకత్వంలో పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు చాలా అమాయకంగా ఉండిపోయారని అర్థమొచ్చేలా వాళు చెబుతున్నారు. ఈ అమాయకత్వమే బిఆర్ ఎస్ ఓటమికి కారణమని చెబుతున్నారు.

కాంగ్రెస్ చెప్పే అబద్దాలు నమ్మేశారు. కాంగ్రెస్ కు ఓటేశారు అందుకే బిఆర్ ఎస్ ఓడిందనేది ఈ పాట అర్థం. “ అబద్దం గెలించింది. నిజం ఓడింది. ఓటమి పర్మినెంట్ కాదు, అది స్పీడ్ బ్రేకర్ మాత్రమే,” అనేది ఈ డ్యుయెట్ సాంగ్. నిన్న తెలంగాణ భవన్ లో జరిగిన మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కెటీఅర్) ఈ పాట అందుకున్నారు. తర్వాత ఆయన బావ, మాజీ మంత్రి హరీష్ రావు దాన్నిఇంకా ముందుకు తీసుకెళ్లారు.

కెటిఆర్ పాట : కాంగ్రెసోళ్లు నోటికి ఏది వస్తే అది హామి అని ఇచ్చారు. 420 హమీలిచ్చింది కాంగ్రెస్. వాళ్ళ తప్పుడు ప్రచారం నమ్మి ప్రజలు గొప్పగా పని చేసిన నాయకులను కూడా తిరస్కరించారు.

రేషన్ కార్డులు ఇవ్వలేదు అని ప్రచారం చేశారు. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అన్నారు, తొమ్మిదిన్నరేల్లలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చింది .

దేశంలో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మన ప్రభుత్వం. మేము ఏనాడు చెప్పుకోలేదు.ప్రభుత్వ ఉద్యోగులకు అత్యధిక వేతనాలు ఇచ్చింది మన ప్రభుత్వం కానీ మేము చెప్పుకోలేదు, ప్రచారం చేస్కోలేదు. 29 లక్షల ఫించన్లను 46 లక్షలకు పెంచినా ఏనాడు చెప్పుకోలేదు. దేశంలో అందరికన్నా ఎక్కువ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించింది తెలంగాణ ప్రభుత్వమే. కానీ ఇలాంటి అనేక అంశాలను చెప్పుకోవడం విఫలమయ్యాం. అందుకే కాంగ్రెస్ పార్టీ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచే వాళ్ళం.

హరీష్ రావు పాట:

దురదృష్ట వశాత్తూ ఓటమి చెందాం. బాధ పడవలసిన అవసరం లేదు. ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారం చేసింది. మీరు కూడా చర్చ చేయాలి. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణ మాఫీ అని మాట తప్పారు. వడ్ల కొనుగోలు బోనస్ అన్నారు. మాట తప్పారు. అన్ని మాటలు చెప్పారు. ఇప్పుడు మాట తప్పి దగా చేశారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం బండారం బయట పడుతుంది.

విశ్లేషకులు చెబుతున్నదేమిటి?

కాని, అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ ఎస్ ఓడిపోయాక అనేక మంది తలపండి రాజకీయ పండితులు ఎన్నికల ఫలితాలను రకరకాలుగా విశ్లేషించారు. లోగుట్టు వార్తలను పట్టే వనారు తెలిసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, లోతయిన చూపున్న పండితుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ వంటి వారు కెసిఆర్ ఓటమిని విశ్లేషించారు. ఇలాగే ఇతర విశ్లేషకులు కూడా బిఆర్ ఎస్ ఓటమి గురించి పలుకోణాల్లో వివరణ చెప్పారు.వీటన్నింటిని క్లుప్తీకరిస్తే అయిదు కారణాలు ప్రముఖంగా కనబడతాయి. 1. కెసిఆర్ ఎవరికీ అందుబాటులో లేకపోవడం. ఉంటే ఎవరికీ ప్రవేశంలేని ప్రగతిభవన్ లో. లేదంటే దరిదాపుల్లోకి కూడా నరమానవులను అనుమితించని ఫామ్ హౌజ్ లో. 2. రైతులకు భూమి పోతుందేమోనన్న భయం పుట్టించిన ధరణి 3. కొన్ని లక్షల మంది యువకుల జీవితాలతో ఆడుకున్న టిఎస్ పిఎస్ సి క్వశ్చన్ పేపర్ లీకేజీ, పరీక్షలు రద్దు, కుటుంబాల్లో టెన్షన్, 4. ఎటుచూసినా కనిపించింది కుటుంపెత్తనమే. 5. ప్రభుత్వంలో అవినీతి. ఎమ్మెల్యేల చీదరింపు.

ఇపుడు విచారణలు

ఈ ఆరు కారణాలు అంతిమ విశ్లేషణలో కెసిఆర్ కుటుంబం వైపే వేలెత్తి చూపుతాయి. ఎందుకంటే, ఈకుటుంబ సభ్యులను కాదని ప్రభుత్వంలో ఒక్క నిర్ణయం కూడా జరగదు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు అంశాలను తీసుకుంటూ ఉంది ఈ విషయం రుజువు చేయాలనుకుంటూన్నది. అందులో 1. కెసిఆర్ ఇంజనీరుగా మారి సొంతంగా రూపొందించిన మేడిగడ్డ బరాజ్ కుంగిపోవడం మీద జ్యుడిషియల్ విచారణ. కెసిఆర్ డిజైన్ తయారుచేస్తే అమలు చేసింది అజమాయిషీ చేసింది మేనల్లుడు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. 2. హైదరాబాదులో అర్జంటుగా జరపాలనుకున్న ఫార్ములా-ఇ ఈవెంట్. ఈ ఎలెక్ట్రానిక్ కార్ రేసింగ్ ని హైదరాబాద్ కు తేవడంలో కీలకపాత్ర పోషించింది మునిసిపల్ మంత్రి కెటి రామారావు. ఆయన ఆదేశాలమేరకే ఈ కంపెనీతో ఒప్పందం జరిగింది. దానికి 40 కోట్టు డబ్బులు చెల్లించారు. ఈ డబ్బులు చెల్లించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఒప్పందానికి కారణమయిన సీనియర్ ఐఎఎస్ అధికారి అర్వింద్ కుమార్ మునిసిపల్ శాఖ నుంచి విపత్తుల శాఖ కు మార్చేశారు. ఆయన కొన్ని రహస్యాలు చెప్పక తప్పదు. దీని మీద విచారణ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.

కెసిఆర్ కుటుంబాన్ని మెల్లిగా విచారణలు చుట్టుముట్టే అవకాశం కనబడుతూ ఉంది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వ విచారణలు. అంటే నోటీసులు ఇవ్వడం, సోదాలు చేయడం, విచారించడం చకచకా జరిగితపోతాయి. సిబిఐ విచారణ అయితే, శాతబ్దాల పాటు లాగించవచ్చు. పార్లమెంటు ఎన్నికల ముందు కెసిఆర్ కుటుంబ సభ్యుల్లో కొందరి మీద విచారణ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ కుటుంబానికి చెందిన చేదు వార్తలు వినిపించకుండా ఉండేందుకే కెటిఆర్, హరీష్ రావు రెట్టించిన ఉత్సాహంతో " అబద్దం గెలిచింది, నిజం ఓడింది” అనే యుగళ గీతం ఎత్తుకున్నట్లు కాంగ్రెస్ నేతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ సీనియర్ వర్కింగ్ ప్రెశిడెంట్, డా . మల్లురవి ఫెడరల్-తెలంగాణతో మాట్లాడుతూ అన్ని విషయాలు చాలా తొందరలోనే బయటకు వస్తాయని అన్నారు. "ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అబద్దాలు చెప్పిందా, గత పదేళ్లుగా బిఆర్ ఎస్ పార్టీ అబద్దాలు చెబుతూ వచ్చిందా అనేది తొందర్లో తేలుతుంది. పదేళ్లు ప్రజలు బిఆర్ ఎస్ అబద్దాలు విన్నారు. కాంగ్రెస్ ప్రచారంలో నిజమేదో తెలుసుకుని బిఆర్ ఎస్ ను ఓడించారు. దీన్ని వాళ్లు ఒప్పుకున్న లేకపోయినా, ప్రపంచం ఒప్పుకుంది," డాక్టర్ మల్లు అన్నారు.

ఓటమి తప్పు కెసిఆర్ ది కాదు, కుటుంబ సభ్యులదికాదు, చుట్టాలది కాదు. తప్పంతా కాంగ్రెస్ ఇచ్చిన హామీలది, వాటికి తలూపిన తెలంగాణ ప్రజలదే అనే ఈ కొత్త ట్యూన్ ని ప్రజలు వింటారో, కట్టేస్తారో లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

Read More
Next Story