
Assembly | ఆర్థికమంత్రి భట్టిపై బీఆర్ఎస్ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి అయిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రివిలేజ్ మోషన్ ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అప్పులు రూ.7 లక్షల కోట్లు అని ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క చెబుతూ శాసనసభను, తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పదేపదే ప్రయత్నాలు చేస్తుందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం అసలు అప్పు రూ.3.89 లక్షలు మాత్రమే అని కేటీఆర్ చెప్పారు.ఈ విషయంలో భట్టి విక్రమార్కకు వ్యతిరేకంగా తాము ప్రివిలేజ్ మోషన్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడతామని కేటీఆర్ పేర్కొన్నారు.
అప్పుల పై ఆర్థికశాఖ మంత్రి ప్రసంగం పూర్తిగా అవాస్తవం అని ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ పేరుతో విడుదల చేసిన నివేదిక పేర్కొందని కేటీఆర్ వివరించారు. 2014-15లో తెలంగాణ మొత్తం రుణాలు రూ.72 వేల 658 కోట్లు ఉండగా, 2024 మార్చి నాటికి ఈ రుణాల మొత్తం రూ. 3,89, 673 కోట్లకు చేరిందని ఆర్‌బీఐ వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు.
‘‘ఆర్థిక మంత్రి భట్టి అప్పులపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారు, అందువల్ల తెలంగాణ శాసనసభ కార్యవిధానం, కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 168 (1) నిబంధన ప్రకారం భారత రాష్ట్ర సమితి శాసనసభా పక్షం తరపున ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాం’’ అని కేటీఆర్ ఎక్స్ పోస్టులో వివరించారు.
Next Story