అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాలు... బాధితుడికే నష్టమంటోన్న బీఆర్ఎస్
x

అర్ధరాత్రి నుంచి కొత్త చట్టాలు... బాధితుడికే నష్టమంటోన్న బీఆర్ఎస్

కేంద్ర ప్రభుత్వం మూడు పాత చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో జులై 1 నుంచి మూడు కొత్త క్రిమనల్ చట్టాలను తీసుకురానుంది.


కేంద్ర ప్రభుత్వం మూడు పాత చట్టాలను రద్దు చేసి, వాటి స్థానంలో జులై 1 నుంచి మూడు కొత్త క్రిమనల్ చట్టాలను తీసుకురానుంది. వీటిపై దేశవ్యాప్తంగా పలు పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ మాజీ ఎంపీ కొత్త చట్టాల అమలును వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. మార్పు అంటే మంచి జరగడం కానీ నష్టం జరగడం కాదన్నారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం తీసుకురానున్న మూడు కొత్త చట్టాలు:

మూడు కొత్త చట్టాలకు గతేడాది డిసెంబర్ 21న పార్లమెంట్ ఆమోదం లభించగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డిసెంబర్ 25న ఆమోదం తెలిపారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన మూడు ఒకే విధమైన నోటిఫికేషన్ల ప్రకారం, కొత్త చట్టాల నిబంధనలు జూలై 1 నుంచి అమల్లోకి వస్తాయి. బ్రిటీష్ వలస పాలన నాటి చట్టాల స్థానంలో కొత్తగా కేంద్ర ప్రభుత్వం నేర న్యాయ చట్టాలను తీసుకొస్తున్నట్టు తెలిపింది.

ఇండియన్ పీనల్ కోడ్ 1860 స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్లేస్ లో భారతీయ సాక్ష్య అధినయమ్ 2023 చట్టాలు నేటి అర్ధరాత్రి (2024 జులై 1) నుంచి అమలులోకి రానున్నాయి. జీరో ఎఫ్ఆర్, ఆన్ లైన్ లో పోలీసు ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపంలోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటి కీలక అంశాలను ఈ కొత్త చట్టాల్లో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్లనవసరం లేకుండానే ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసేందుకు వీలు కలగనున్నది. ఇప్పటికే పోలీసులకు కొత్త చట్టాలపై అవగాహన కల్పించేందుకు ట్రైనింగ్ ఇచ్చారు.

కొత్త చట్టాలతో బాధితులకు నష్టం -వినోద్ కుమార్

జూలై 1 వ తేదీ నుండి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి కొత్త చట్టాలను తీసుకువస్తుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఈ చట్టాలు వున్నాయి. మార్పు అంటే మంచి జరగడం.. కానీ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టాలు ప్రాథమిక హక్కులకు విఘాతంగా ఉన్నాయి అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

"2023 ఆగస్టులో చట్టాల మార్పు బిల్లులను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ కొత్త చట్టాలపై విస్తృతంగా పరిశీలించి అనేక మంచి సూచనలు చేశారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలను కేంద్రం పట్టించుకోలేదు. దాదాపు 160 మంది పార్లమెంట్ సభ్యులను బయటకు పంపి బిల్లును కేంద్రం పాస్ చేయించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సీనియర్ న్యాయవాదులు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. కొత్త చట్టాలను రద్దు చేయాలని కేంద్ర హోంశాఖా మంత్రి, న్యాయ శాఖా మంత్రులకు లేఖ రాశాను. చట్టాలను ఇంగ్లీష్‌లో ప్రవేశపెట్టాలని రాజ్యంగంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు ఇండియన్ పీనల్ కోడ్‌కు భారతీయ న్యాయ సంహిత, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌కు భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ కి భారతీయ సాక్ష్య అధినయమ్ అనే పేర్లు పెట్టారు. కొత్త చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టారు. ఇవి దక్షిణ భారత రాష్ట్రాల భాషకు వ్యతిరేకంగా ఉన్నాయి" అని వినోద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

"చట్టాల మార్పులను వాయిదా వేయాలని మోడీని డిమాండ్ చేస్తున్నాం. ఎఫ్ఐఆర్‌ను రిజిస్టర్ చేయకుండా ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసే విధంగా కొత్త చట్టం తెచ్చారు. స్టేషన్ బెయిల్‌ను స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ దుర్వినియోగం చేస్తున్నారు. బాధితుడు హింసకు గురి అవుతున్నారు. దేశ న్యాయ వ్యవస్థను కేంద్రం నిర్వీర్యం చేస్తుంది. కొత్త చట్టాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతంగా మారాయి. చేతికి బేడీలు వేయవద్దని సుప్రీం కోర్టు చెప్పింది. ఇప్పుడు కొత్త చట్టాల్లో చేతికి బేడీలు వేయాలని వుంది. కొత్త చట్టాల వలన బాధితుడికి అన్యాయం జరుగుతోంది. పోలీస్ కస్టడీకి తీసుకోవడానికి 14 రోజులకు బదులుగా 90 రోజుల వరకు అవకాశం ఇచ్చారు. బార్ కౌన్సిల్‌ను మోడీ మోసం చేశారు. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేస్తున్నా. కొత్త చట్టాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు స్పందించాలి" అని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

Read More
Next Story