కేటీయార్, హరీష్ ఢిల్లీలో ఏమిచేశారు ?
x
KTR and Harish Rao

కేటీయార్, హరీష్ ఢిల్లీలో ఏమిచేశారు ?

బీఆర్ఎస్ లోని కీలకనేతలు కేటీయార్, హరీష్ ఢిల్లీలో క్యాంపు వేయటంతో పార్టీలో ఏమి జరగబోతోందో అర్ధంకావటంలేదు.


క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోను ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. బీఆర్ఎస్ లోని కీలకనేతలు కేటీయార్, హరీష్ ఢిల్లీలో క్యాంపు వేయటంతో పార్టీలో ఏమి జరగబోతోందో అర్ధంకావటంలేదు. కారుపార్టీని రెండుపార్టీలు కాంగ్రెస్, బీజేపీలు పంచుకుంటున్నాయా ? అనే సందేహాలు పెరిగిపోతున్నాయి. కారుపార్టీ అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కదా బీఆర్ఎస్ పార్టీయే అని. పార్టీని రెండు పార్టీలు అంటే కాంగ్రెస్, బీజేపీలు పంచుకోవటం ఏమిటనే సందేహం మొదలైంది. విషయం ఏమిటంటే బీఆర్ఎస్ లో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, రాజ్యసభ ఎంపీలున్నారు. వీరిలో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను కాంగ్రెస్ లాగేసుకుంటోంది. మిగిలిన రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరబోతున్నట్లుగా విపరీతమైన ప్రచారం జరుగుతోంది.

కారుపార్టీకి నలుగురు రాజ్యసభ ఎంపీలున్నారు. బీ. పార్ధసారధిరెడ్డి, డీ దామోధరరావు, వడ్డిరాజు రవిచంద్ర, కేఆర్ సురేష్ రెడ్డిలు చాలాకాలం పదవుల్లో ఉంటారు. అసలైతే ఐదుగురు ఎంపీలుండేవారు కాని ఈమధ్యనే రాజ్యసభాపక్ష నేత కే కేశవరావు కాంగ్రెస్ లో చేరటంతో బీఆర్ఎస్ తరపున నలుగురు ఎంపీలు మిగిలారు. ఒకపుడు బలమైన పార్టీగా కనబడిన బీఆర్ఎస్ ఇపుడు అత్యంత బలహీనమైపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి దెబ్బకు పార్టీ కుదేలైపోయింది. అందుకనే ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. ఫిరాయింపులను ఆపాలని కేసీయార్ ఎంత ప్రయత్నించినా సాధ్యంకావటంలేదు. పార్టీపైనే కాదు చివరకు కేసీయార్ నాయకత్వం మీద కూడా నమ్మకం కోల్పోతున్న వాళ్ళు కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు.

ఇప్పటికి బీఆర్ఎస్ నుండి తొమ్మిది మంది ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలు హస్తంపార్టీలో చేరిపోయారు. ఇంకా కాంగ్రెస్ లో చేరే కారుపార్టీ ప్రజా ప్రతినిధులున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం పిడుగులాగ మీదపడింది. లోక్ సభ ఎంపీలు ఎలాగూ లేరు కాబట్టి మిగిలింది రాజ్యసభ ఎంపీలు మాత్రమే. రాజ్యసభ ఎంపీలంటే వీళ్ళ వ్యవహారాలు మొత్తం కేంద్రప్రభుత్వ స్ధాయిలోనే ఉంటాయి. అందుకనే మిగిలిన రాజ్యసభ ఎంపీల చూపు బీజేపీ మీద పడిందనే ప్రచారం బాగా జరుగుతోంది.

ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే కొద్దిరోజులు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్, మాజీమంత్రి హరీష్ ఢిల్లీలోనే క్యాపేశారు. తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను కలవాలన్న కారణంతో ఢిల్లీకి వెళ్ళిన ఇద్దరు ఇన్ని రోజులు ఢిల్లీలో ఏమిచేశారనే సందేహాలు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో చక్కబెట్టాల్సిన అధికారిక కార్యక్రమాలు ఏమీలేవు. పార్టీపరమైన వ్యవహారాలు కూడా లేవు. అయినా ఢిల్లీలో ఏమిచేశారు ? ఏమి చేశారంటే కాంగ్రెస్ దెబ్బకు కుదేలవుతున్న తమ పార్టీని, వ్యక్తిగత రక్షణకు ఢిల్లీలోని బీజేపీ అగ్రనేతలతో కలిసి మాట్లాడుకున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే పార్టీ రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపుతామని ప్రతిపాదించారో లేకపోతే ఒప్పందమే జరిగిందో.

ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతు తొందరలోనే బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమైపోతుందన్నారు. విలీనంలో మొదటి అధ్యాయంగా కారుపార్టీ రాజ్యసభ ఎంపీలను ముందు బీజేపీలోకి పంపటానికి ఒప్పందం కుదిరిందని రామ్మోహన్ చెప్పారు. రాజ్యసభ ఎంపీలను బీజేపీలోకి పంపిన తర్వాత హోలుమొత్తంగా పార్టీని కేసీయార్ బీజేపీలో విలీనం చేసేయబోతున్నట్లు చెప్పారు. సామా చెప్పిందానికి ఊతమిచ్చేట్లుగానే కారుపార్టీలో పరిణామాలు జరుగుతున్నాయి. కొద్దిరోజులు కేటీయార్, హరీష్ ఢిల్లీలోనే క్యాంపు వేయటంతోనే అందరిలో అనుమానాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళిద్దరు ఎవరిని కలిశారు ? ఏమి మాట్లాడుకుంటున్నారన్న విషయం సస్పెన్సుగా మారింది. కవితను కలవటానికి అయితే ఇన్నిరోజులు ఢిల్లీలో క్యాంపు వేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే వెళ్ళిన మరుసటి రోజే కవితను ఇద్దరు కలిసి మాట్లాడారు. కాబట్టి ఢిల్లీ పర్యటన కవితను కలవటం అన్నది ఒక కారణంగా మాత్రమే అనిపిస్తోంది. అసలు కారణం ఏమిటన్నదే తెలీటంలేదు. ఇక్కడే సామా రామ్మోహన్ రెడ్డి మాటలపై చర్చలు పెరిగిపోతున్నాయి. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాల్సిందే.

Read More
Next Story