Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ పగటి కలలు కంటోందా..?
x

Ponguleti Srinivas Reddy | బీఆర్ఎస్ పగటి కలలు కంటోందా..?

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సెటైర్లు వేశారు.


తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్(KTR) పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas Reddy) సెటైర్లు వేశారు. జైలుకు వెళ్లడానికి కేటీఆర్ తహతహలాడుతున్నారంటూ చురకలంటించారు. తప్పు రుజువైనప్పుడు చేసిన వారెవరైనా జైలుకు వెళ్లడం ఖాయమని, ఎంత ఆత్రపడినా అది ముందుకు జరగదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అందిస్తున్న ప్రజా పాలన చూసి బీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు పుట్టుకొస్తుందని, మళ్ళీ ఎన్నికలోస్తే వాటిల్లో కూడా ప్రజలు తమకు అవకాశం ఇవ్వరని బీఆర్ఎస్ బెంబేలెత్తిపోతోందని దుయ్యబట్టారు. అధికారం పోవడంతో బీఆర్ఎస్ నేతలు అయోమయ స్థితిలో పడిపోయారని, వారి అధినేత ఫామ్ హౌస్ నుంచి అడుగు బయటపెట్టడానికి కూడా నిరాకరిస్తున్నారంటూ విమర్శలు చేశారు. బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుని, బయట మాత్రం బీజేపీ విమర్శిస్తున్నట్లు నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. నేను బాంబులు పేల్తాయ్ అంటే చాలు కేటీఆర్ ఉలిక్కిపడుతున్నారని ఎద్దేవా చేశారు.

‘‘నేను రాష్ట్రంలో బాంబులు పేలనున్నాయి అనగానే కేటీఆర్.. ఢిల్లీకి పరుగు పెట్టారు. ఎందుకో మరి. కేంద్ర పెద్దలతో ఏం ఒప్పందం చేసుకున్నారో. నేను అమిత్ షా కాళ్లు మొక్కినా అనడానికి వాళ్లకి సిగ్గుండాలి. నా తల్లిదండ్రుల తర్వాత నేను కేసీఆర్ కాళ్లు మాత్రమే మొక్కినా. మెడలో పార్టీ కండువా వేసి దాంతో గొంతు కోశారు. ఐదేళ్లు నా రాజకీయ జీవితాన్ని నాశనం చేశారు’’ అని బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే విధంగా బీఆర్ఎస్ నేతలు పగటి కలలు కనడం మానుకోవాలని, బయట వాస్తవాలను చూడటం అలవాటు చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని వాళ్లు పగటి కలలు కంటున్నారని, కానీ అదెన్నటికీ జరగదని జోస్యం చెప్పారు.

‘‘రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలను మార్చేది లేదు. విగ్రహాలు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాయి. రాష్ట్రంలోని రైతులను, యువకులను బీఆర్ఎస్ మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు రుణమాఫీ చేశాం. యువకులకు 57వేల ఉద్యోగాలు కల్పించాం. ఏడాదిలోనే చెప్పిన హామీలే కాకుండా చెప్పని హామీలను కూడా అమలు చేశాం. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం’’ అని తెలిపారు మంత్రి పొంగులేటి. అయితే కేటీఆర్ జైలుకు వెళ్లడానికి తొందరపడుతున్నారంటూ గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా విమర్శించారు. సీఎం పదవి కోసం జైలుకు వెళ్లాలని కేటీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

అదానీ లంచాల వ్యవహారంలో భాగంగా కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ‘‘కేటీఆర్ జైలుకు వెళ్లాలని తహతహలాడుతున్నారు. జైలుకెళ్తే సీఎం అవ్వొచ్చని అనుకుంటున్నారు కాబోలు. కేసీఆర్ కుటుంబం నుంచి కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి ఐదు నెలల ఉండి వచ్చారు. జైలుకెళితే సీఎం అవుతారంటే.. ఈ రేసులో ముందు కవిత ఉంటారు. కేసీఆర్ ఫ్యామిలీలో సీఎం సీటుకు గట్టి పోటీ ఉంది. ఆ సీటు కోసం సొంతింటి వాళ్లే పోటీలు పడుతున్నారు’’ అని రేవంత్ రెడ్డి చురకలంటించారు.

Read More
Next Story