
పత్తాలేని ‘స్టార్’ క్యాంపెయినర్
బీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్లలో మొదటిపేరున్న పార్టీఅధినేత కేసీఆర్ ఎక్కడున్నట్లు ?
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక పోరు ఉత్కంఠగా మారుతోంది. కాంగ్రెస్ అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలుపుకు స్వయంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డే(Revanth) రంగంలోకి దిగేశాడు. పోలీసు గ్రౌండ్స్ లో మంగళవారం రాత్రి జరిగిన బహిరంగసభలో నవీన్ కు మద్దతుగా రేవంత్ ప్రచారం చేశాడు. ఈనెల 30,31, నవంబర్ 4,5 తేదీల్లో మొత్తం ఆరుడివిజన్లలో నాలుగు రోడ్డుషోల్లో రేవంత్ పాల్గొనబోతున్నాడు.
ఇదంతా బాగానే ఉందికాని బీఆర్ఎస్ తరపున స్టార్ క్యాంపెయినర్లలో మొదటిపేరున్న పార్టీఅధినేత కేసీఆర్ ఎక్కడున్నట్లు ? ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కసారి కూడా ప్రచారంలో కనబడలేదు. కాంగ్రెస్ తరపున రేవంత్, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీజేపీ తరపున కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, కేంద్రమంత్రి సునీల్ బన్సల్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ తరపున అధినేత, స్టార్ క్యాంపెయినర్లలో మొదటిపేరున్న కేసీఆర్ మాత్రం ఇప్పటివరకు పత్తాలేరు.
ఫామ్ హౌస్ లో కూర్చుని ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారని, దిశానిర్దేశం చేస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కొడుకు కేటీఆర్ మీడియాతో చెబుతున్నారు. సరైనసమయంలో ప్రచారంలోకి దిగుతారని చెబుతున్నారే కాని కేసీఆర్ ప్రచారంలో పాల్గొనే సూచనలైతే కనబడటంలేదు. ఎందుకంటే కేసీఆర్ ఆరోగ్యం అంత బావోలేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. గడచిన రెండునెలల్లో పలుమార్లు జ్వరంతో కేసీఆర్ ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. ఒకసారైతే నాలుగురోజులు ఇన్ పేషంటుగా ఉన్నారు కూడా. ఇలాంటి పరిస్ధితుల్లో కేసీఆర్ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేదా అన్నది సస్పెన్సుగా మారింది.
పార్టీఅధినేత కేసీఆర్ రంగంలోకి దిగకుండా ఆయనపేరుచెప్పుకుని ఎంతమంది ప్రచారంచేసినా పెద్దగా ఉపయోగం ఉండదని అందరికీ తెలిసిందే. పార్టీలో కేసీఆర్ ఒకఎత్తయితే మిగిలిన నేతలంతా మరో ఎత్తు. కేటీఆర్ తో పాటు కీలకంగా వ్యవహరిస్తున్న మరో నేత, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావు కూడా నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. అయితే రెండురోజుల క్రితం తండ్రి సత్యనారాయణ చనిపోవటంతో హరీష్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. ప్రచారంలో కేటీఆర్ లేదా ఇతర నేతలు రేవంత్ పై ఆరోపణలు, విమర్శలు చేయటమే టార్గెట్ గా పెట్టుకున్నారు. తొమ్మిదిన్నరేళ్ళ తమపాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తాముచేసిన అభివృద్ధిగురించి కేటీఆర్ తదితరులు ఒక్కమాట కూడా మాట్లాడటంలేదు.
ఎంతసేపు ఉపఎన్నికలో బీఆర్ఎస్ ను గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పని ఖతమైపోతుంది, ప్రభుత్వం ముందే కూలిపోతుంది, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేస్తుందన్న గోలమాత్రమే వినబడుతోంది. నిజానికి ఉపఎన్నికలో కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ గెలిచినా ఓడినా పెద్దగా తేడా ఉండదు. కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ ప్రభుత్వంపై జనాల్లో వ్యతిరేకత లేదని చెప్పుకోవటానికి పనికొస్తుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటులో కాంగ్రెస్ గెలిచినట్లవుతుందంతే. ఇక బీఆర్ఎస్ గెలిస్తే జనాల్లో రేవంత్ ప్రభుత్వంపై బాగా వ్యతిరేకత పెరిగిపోయిందన్న తమ వాదనే నిజమని కొద్దిరోజులు ప్రచారం చేసుకుంటారంతే. తమ సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకున్నట్లవుతుంది. ఇంతకుమించి రెండుపార్టీలకు ఒరిగేదేమీ ఉండదు.
అయినా ఉపఎన్నిక అన్నతర్వాత ప్రచారం, పోరాటం తప్పదు. ఈ ప్రచారంలో, పోరాటంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే పార్టీ అధినేత, స్టార్ క్యాంపెయినర్ కేసీఆర్ పత్తాలేకపోవటంపైనే అందరు మాట్లాడుకుంటున్నారు. ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచేసినట్లే అని కేటీఆర్, నేతలు పదేపదే చెప్పుకుంటున్నారు. అయితే అసలు విషయం అధినేతతో పాటు కేటీఆర్ కు బాగా తెలుసు. ఇక్కడ అభ్యర్ధి మాగంటి సునీత గెలుపు అంత వీజీకాదు. ఈవిషయంలో స్పష్టత ఉన్నకారణంగానే కేసీఆర్ ప్రచారంలోకి దిగలేదా అనే అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ప్రచారం చేసినా సునీత గెలవకపోతే తన నాయకత్వానికి పెద్ద మైనస్ అవుతుందన్న అనుమానం కేసీఆర్ లో ఉన్నట్లుంది. అందుకనే ఏదైతే అదవుతుందని ఇప్పటివరకు ప్రచారంలోకి దిగలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఫలితంలో ఏదైనా తేడాకొడితే కేసీఆర్ ప్రచారంలోకి దిగలేదు కాబట్టే అభ్యర్ధి ఓడిపోయిందని చెప్పుకునే అవకాశమన్నా ఉంటుంది కారుపార్టీ నేతలకు. అందుకనే ఇప్పటివరకు కేసీఆర్ ప్రచారంలోకి దిగలేదేమో.

