బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన పెరిగిపోతోందా ?
x
KTR and Harish Rao

బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన పెరిగిపోతోందా ?

రుణమాఫీ మొదలుకావటంతో వెంటనే తేరుకుని ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది.


కారుపార్టీ నేతలు ఉలిక్కిపడుతున్నట్లున్నారు. రైతు రుణమాఫీని మూడువిడతలుగా అమలుచేయాలని నిర్ణయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొదటివిడతకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రుణమాఫీని ప్రభుత్వం మూడువిడతలుగా వర్గీకరించింది. మొదటి విడత లక్ష రూపాయల లోపు రుణాలు, రెండో రకం లక్ష నుండి లక్షన్నర వరకు మూడో రకం లక్షన్నర నుండి రు. 2 లక్షల వరకు. ఎప్పుడైతే మొదటిరకం రుణాలను ప్రభుత్వం అమలు చేసిందో వెంటనే బీఆర్ఎస్ నేతలు గోల మొదలుపెట్టేశారు. రుణమాఫీని ప్రభుత్వం అమలుచేసే అవకాశాలు లేవన్నది బీఆర్ఎస్ నేతల గట్టి నమ్మకం. అయితే అందుకు విరుద్ధంగా రుణమాఫీ మొదలుకావటంతో వెంటనే తేరుకుని ప్రభుత్వంపై నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది.

రుణమాఫీ పేరుతో రైతులను ప్రభుత్వం మోసంచేస్తోందంటు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీయార్ తో పాటు హరీష్ రావు, కొందరు సీనియర్ నేతలు పదేపదే గోలచేస్తున్నారు. రుణమాఫీ అయిన రైతులకన్నా రుణాలు మాఫీకాని రైతులసంఖ్యే ఎక్కువగా ఉన్నారంటు ఆరోపిస్తున్నారు. మొదటివిడతలో భాగంగా 11.50 లక్షలమంది రైతులకు రు. 7 వేల కోట్ల రుణాలు మాఫీ అయ్యాయి. రెండో విడత రుణాన్ని ఈనెలాఖరుకు, మూడో విడత రుణాన్ని ఆగష్టు మొదటివారంలోను మాఫీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించుకున్నది. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బహిరంగంగానే ప్రకటించారు. దీన్నే కారుపార్టీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రుణమాఫీ అయిన వాళ్ళకన్నా కంటితడిపెడుతున్న వాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కేటీయార్ ట్విట్టర్లో ఎద్దేవాచేశారు. రుణమాఫీకి ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు రైతుమాఫీ పథకానికి ఉరితాళ్ళయినట్లు మండిపడ్డారు. రుణమాఫీకి అన్నీ అర్హతలున్నా రుణం ఎందుకు మాఫీ కాలేదో చెప్పేటోడు లేడు, సమస్యలు చెప్పుకుందామని వెళితే వినోటోడు లేడు అంటు ఆరోపణలు చేశారు.

ఇదే పద్దతిలో హరీష్, కేపీ వివేకానందగౌడ్, పల్లా రాజేశ్వరరెడ్డి తదితర సీనియర్ నేతలు పదేపదే ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వీళ్ళ ఆరోపణలు, విమర్శల్లో రుణమాఫీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టేసిందన్న బాధ, ఆందోళనే ఎక్కువగా వ్యక్తమవుతోంది. రుణమాఫీ వ్యవహారం పార్టీలకు ప్రిస్టేజియస్ గా మారింది. ఈ నేపధ్యంలోనే రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారు. రైతుల్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ మైలేజి వచ్చేస్తుందో అన్న ఆందోళనే వీరిలో ఎక్కువగా కనబడుతోంది. ఏ పథకం అమలైనా నిజమైన అర్హుల్లో కొందరికి పథకం వర్తించకపోవటం కొత్తేమీకాదు. నూరుశాతం అర్హులకు పథకాలు వర్తించటం అన్నది మనదగ్గర జరిగేపనికాదు. అలాగని అర్హులను వదిలేయాలనీ కాదు. ఇపుడు మొదటివిడతకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి పథకం వర్తించని అర్హులు కలెక్టర్లను కలస్తే ప్రయోజనం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. పథకం వర్తించని అర్హులుంటే తమను కలవాలని కలెక్టర్లు కూడా చెబుతున్నారు.

పథకం తమకు వర్తిస్తుందో వర్తించదో అన్న ఆందోళన పథకం వర్తించని లబ్దిదారులకు ఉండటం సహజమే. అయితే కాస్త ఓపికగా కలెక్టర్లను కలిసి సమస్యను వివరిస్తే వాళ్ళ రుణాలు కూడా మాఫీ అయ్యే అవకాశాలున్నాయి. రుణమాఫీని ఏ విధంగా అమలుచేయాలో సూచనలు చేయాల్సిన బీఆర్ఎస్ నేతలు అందుకు విరుద్ధంగా ప్రభుత్వంపై ఆరోపణలతో విరుచుకుపడుతుండటమే వారిలోని ఆందోళనను ఎత్తిచూపుతోంది. అర్హుల జాబితాలను కారుపార్టీ నేతలు సేకరించి, ఆ జాబితాలను అందచేసి రుణమాఫీ వర్తించేసేట్లుగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవటం ప్రతిపక్షాల బాధ్యత. అయితే తమ బాధ్యతలను వదిలేసిన కారుపార్టీ నేతలు కేవలం ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయటం వరకే పరిమితమవటం ఆశ్చర్యంగా ఉంది. ఆరోపణలకు మాత్రమే ఎందుకు పరిమితయ్యారంటే పథకం నూరుశాతం అమలైతే ప్రభుత్వానికి ఎక్కడ మంచి మైలేజి వచ్చేస్తుందో అన్న ఆందోళనే కనబడుతోంది. మొత్తంమీద రైతు రుణమాఫీతో ప్రతిపక్షాలు ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు బాగా ఉలిక్కిపడుతున్నట్లు అర్ధమైపోతోంది. మరి దీని ప్రభావం తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో ఎలాగుంటుందో చూడాలి.

Read More
Next Story