ఫిరాయింపు ఎంఎల్ఏలను వెంటాడుతున్న కేటీఆర్
x
BRS defection MLAs

ఫిరాయింపు ఎంఎల్ఏలను వెంటాడుతున్న కేటీఆర్

ఫిరాయింపులపై(BRS Defection MLAs) అనర్హత వేటు విషయమై మళ్ళీ సుప్రింకోర్టు(Supreme Court)లో కేసులు దాఖలు చేయబోతున్నట్లు చెప్పారు


ఫిరాయింపు ఎంఎల్ఏలను కేసులతో వెంటాడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిసైడ్ అయినట్లున్నారు. తొందరలోనే ఫిరాయింపులపై(BRS Defection MLAs) అనర్హత వేటు విషయమై మళ్ళీ సుప్రింకోర్టు(Supreme Court)లో కేసులు దాఖలు చేయబోతున్నట్లు చెప్పారు. ఫిరాయింపులపై అనర్హత వేటు పడేంతవరకు వెంటాడుతునే ఉంటామని కేటీఆర్(KTR) చెప్పారు. తాము చేస్తే------ఇతరులు చేస్తే----------అన్నట్లుగా ఉంది వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యవహారం. దీనికి కారణం ఏమిటంటే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానని, కాంగ్రెస్ లో చేరలేదని గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి(Gadwal MLA Bandla Krishna Mohan) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు సమాధానం చెప్పటాన్ని కేటీఆర్ తట్టుకోలేకపోతున్నారు.

ఫిరాయింపు ఎంఎల్ఏలు పదిమందికి స్పీకర్ నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. పార్టీ ఫిరాయించిన ఎంఎల్ఏల మీద ఎలాంటి యాక్షన్ తీసుకున్నారని సుప్రింకోర్టు స్పీకర్ ను అడిగింది. ఫిరాయింపులపై యాక్షన్ తీసుకునేందుకు స్పీకర్ కు సుప్రింకోర్టు మూడునెలలు గడువిచ్చింది. అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలకు స్పీకర్ నోటీసులు పంపుతున్నారు. అందిన నోటీసులకు ఫిరాయింపులు గట్టిగానే సమాధానాలు ఇస్తున్నారు. తాము పార్టీ మారలేదని సమాధానంలో చెబుతున్నారు.

ఇదేవిషయాన్ని బండ్ల మీడియాతో మాట్లాడుతు తాను కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నట్లు చెప్పారు. స్పీకర్ నోటీసుకు తాను ఇదే విషయాన్ని సమాధానంగా చెప్పినట్లు ఎంఎల్ఏ తెలిపారు. జగిత్యాల ఎంఎల్ఏ సంజయ్ కుమార్, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ అరెకపూడి గాంధి, పటాన్ చెరు, రాజేంద్రనగర్ ఎంఎల్ఏలు గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ మాట్లాడుతు తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు దుష్ప్రచారం జరుగుతోందని మండిపడ్డారు. అంటే స్పీకర్ నోటీసులకు వీళ్ళు కూడా తాము పార్టీ మారలేదనే సమాధానాలు ఇచ్చినట్లు చెప్పుంటారు.

ఇలాంటి డెవలప్మెంట్లను బహుశా కేటీఆర్ ఊహించుండరు. అందుకనే ఫిరాయింపులపై అనర్హత వేటు పడేట్లుగా తొందరలోనే సుప్రింకోర్టులో మరోమారు కేసు వేయబోతున్నట్లు చెప్పారు. ఫిరాయింపు ఎంఎల్ఏల సమాధానంతో స్పీకర్ ఎవరిపైనా అనర్హత వేటు వేయరు అన్న అనుమానం కేటీఆర్ కు వచ్చినట్లుంది. స్పీకర్ కూడా వేటు వేసేట్లుగా లేరు. ఎందుకంటే తాము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పిన తర్వాత ఇక స్పీకర్ మాత్రం వేటు ఎలాగ వేస్తారు ? ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని కలిసినట్లు అంగీకరిస్తున్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు అడిగేందుకే రేవంత్ ను కలిశామని ఫిరాయింపులు చెబుతున్నారు. దీన్ని ఎవరూ కాదనేందుకు లేదు.

తాము బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించలేదని ఎంఎల్ఏలు ఇచ్చిన సమాధానాలను స్పీకర్ తెలియజేస్తే అప్పుడు సుప్రింకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. ఫిరాయింపు ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేయాల్సిందే అని స్పీకర్ ను సుప్రింకోర్టు ఆదేశించే అవకాశాలు లేవు. పదిమంది ఎంఎల్ఏల్లో పార్టీ ఫిరాయించారని ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానంనాగేందర్ విషయంలో తప్ప ఇంకెవరి విషయంలోను కేటీఆర్ ఆధారాలు చూపించలేరు. దానం విషయం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏగా గెలిచి 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా సికింద్రాబాదు సీటుకు పోటీచేశారు. కాబట్టి దానం మాత్రం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు కేటీఆర్ నిరూపించగలరు.

ఈ లాజిక్ అంతా కేటీఆర్ కు తెలియంది కాదు. అయినా సరే పదిమంది ఎంఎల్ఏలపైన ఎలాగైనా సరే అనర్హత వేటు వేయించాలని చాలా పట్టుదలతో ఉన్నారు. ఒకపుడు తామే ఫిరాయింపులను ప్రోత్సాహించిన విషయాన్ని కేటీఆర్ మరచిపోయినట్లున్నారు. టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ లోకి కేసీఆర్ లాగేసుకున్న విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో కాంగ్రెస్, టీడీపీ నుండి ఫిరాయించిన ఎంఎల్ఏలు డైరెక్టుగా బీఆర్ఎస్ కండువాలు కప్పుకున్నారు. తలసాని శ్రీనివాసయాదవ్, సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తామ ఇతర పార్టీల ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలను లాక్కున్నపుడు ఫిరాయింపులు తప్పని కేటీఆర్ కు అనిపించకపోవటమే విచిత్రంగా ఉంది.

Read More
Next Story