కెసిఆర్  స్వేదపత్రం :  రేపే విడుదల
x

కెసిఆర్ 'స్వేదపత్రం' : రేపే విడుదల

"చెమటోడ్చి, రేయింబగలు కష్టించి" తెలంగాణలో కెసిఆర్ పరిపాలన సంపద సృష్టించిందంటున్న బిఆర్ ఎస్. అదేమిటో రేపు విడుదల


కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన రెండు సంచలన శ్వేతపత్రాలు తీసుకు వచ్చిన అప్రతిష్టనుంచి బయటపడేందుకు భారత రాష్ట్ర సమితి శనివారం నాడు స్వేద పత్రం పేరుతో ఒక నివేదిక విడుదల చేస్తున్నది. ఈ సందర్బంగా గత పదేళ్ల కాలంలో నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో సాధించిన అభివృద్దినంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో ప్రదర్శిస్తారు.

ఆ తొమ్మిదిన్నరేళ్ల కాలం తెలంగాణ ప్రగతి ప్రస్థానంలోనే కాదు, దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం అని బిఆర్ ఎస్ పేర్కొంటున్నది.

పగలూ రాత్రి తేడా లేకుండా రెక్కల కష్టంతో చెమటోడ్చి నిర్మించిన తెలంగాణ ఇదని, బిఆర్ ఎస్ సాధించిన తెలంగాణ ప్రతిష్టను దెబ్బతీస్తే సహించమని ఆ పార్టీ హెచ్చరించింది.

"తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపించాలని ప్రయత్నిస్తే భరించం. అగ్రగామి రాష్ట్రాన్ని అవమానిస్తే ఎట్టిపరిస్థితుల్లో ఊరుకోం," అని హెచ్చరిస్తూ వాస్తవ తెలంగాణ ముఖచిత్రాన్ని వివరించేందుకు గణాంక వివరాలతో సాధించిన కృషిని ప్రదర్శించాలనుకుంటున్నారు బిఆర్ ఎస్ నేతలు.

ఆ అంకెలు అప్పులు కాదు, తెలంగాణ రాష్ట్రానికి సృష్టించిన సంపద అంటూ దానిని ఆవిష్కరించేందుకు తెలంగాణ భవన్ లో డిసెంబర్ 23, శనివారం ఉదయం 11 గంటలకు “స్వేదపత్రం” పవర్ పాయింట్ ప్రెజేంటేషన్ ఏర్పాటు చేశారు.

ఈ అసెంబ్లీ సమావేశాలలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద, విద్యుత్ రంగం మీద ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు రెండు శ్వేత పత్రాలను విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బిఆర్ ఎస్ ప్రభుత్వం సక్రమంగా అజమాయిషీ చేయలేకపోయిందో వివరించారు.

దుబారా వ్యయం,నిధుల దారి మళ్లింపు, బిల్లు చెల్లించకపోవడం, మిస్ మేనేజ్ మెంట్ వంటి వాటితో రాష్ట్రం అప్పులపాయిందని ప్రభుత్వం పేర్కొొంది. ఇక విద్యుత్ రంగం విషయానికి వస్తే, బిఆర్ ఎస్ అనుసరించిన విధానాలు విద్యుత్ సంస్థలను రాష్ట్ర ఖజానాను అస్తవ్యస్తం చేయడమే కాదు, వాటిని కొల్లగొట్టారని, దాదాపు పదివేల కోట్ల రుపాయలుఒక్క విద్యుత్కేంద్రం ఏర్పాటులో వృధా అయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. దీని మీద న్యాయవిచారణకు సిద్ధమని ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ ప్రచారం పూర్తిగా జనంలోకి పోక ముందే బిఆర్ ఎస్ వాటికి సమాధాం చెప్పేందుకు స్వేద పత్రం విడుదల చేస్తున్నది. ముఖ్యమంత్రి గా ఉండగా కెసిఆర్ చెమటోడ్చి, రేయనక పగలనకు శ్రమించి సృష్టించిన సంపద వివరాలను పార్టీ ప్రజల దు పెట్టబోతున్నది.

Read More
Next Story