కాంగ్రెస్ పాలనలో రైతులు రోదిస్తున్నారు: కేటీఆర్
x

కాంగ్రెస్ పాలనలో రైతులు రోదిస్తున్నారు: కేటీఆర్

మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం పక్కా అని రైతులు హామీ ఇచ్చారన్న కేటీఆర్.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రైతులు రోదిస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. యూరియా లేక రైతులు నానా తిప్పలు పడుతున్నారన్నారు. షాపుల్లో లేని యూరియా యాప్‌ల్లోకి ఎలా వస్తుంది? అని ప్రశ్నించారు. పాలిచ్చే గేదెను వదులుకొని.. తన్నే దున్నపోతును గెలిపించారని తాను రైతులతో చెప్పానని కేటీఆర్ అన్నారు. అయితే రైతులు తమ తప్పు తెలుసుకున్నామని, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని హామీ ఇచ్చారని చెప్పారు. ఖమ్మం జిల్లాలో నూతనంగా గెలిచిన సర్పంచ్ అభ్యర్తులతో కేటీఆర్.. ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శనాస్త్రాలు సంధించారు.

‘‘ఆనాడు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డును అత్యంత భద్రంగా దాచి పెట్టుకోమన్నాడు భట్టి విక్రమార్క. హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పారు.. మరి రెండేళ్ళు అవుతుంది మీ హామీలు ఎక్కడ పోయాయి?’’ అని ప్రశ్నించారు కేటీఆర్. కాంగ్రెస్ పాలన ఎగవేతలు కూల్చివేతలకే పరిమితమైందని అందుకే ఆ పార్టీని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

సర్పంచ్ ఎన్నికలను ఉద్దేశిస్తూ కేటీఆర్ మాట్లాడుతూ క్వార్టర్ ఫైనల్ లో మంచి ఫలితాలు వచ్చాయని సెమీ ఫైనల్ లో ఇంకా మెరుగైన ఫలితాలు వస్తాయని చివరికి ఫైనల్ లో విజయం మనదేనని స్పష్టం చేశారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. రైతులతో మాట్లాడినప్పుడు యూరియా బస్తాలు దొరకడం లేదని వారు వాపోయారని చెప్పారు. పాలిచ్చే గేదెను వదిలేసి తన్నే దున్నపోతును గెలిపించారని రైతులతో అన్నానని తెలిపారు. అయినా రైతులు చాలా స్పష్టంగా ఇది తాత్కాలికమే వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ అని చెప్పారని పేర్కొన్నారు. రైతులు ఎంత స్పష్టతతో ఉన్నారో అర్థమైందన్నారు.

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో యూరియా సమస్యే లేదని కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులు లైన్లలో నిలబడి చెప్పులు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. షాపుల్లో లేని యూరియా యాప్ ల్లో ఎలా కనిపిస్తుందని ప్రశ్నించారు. లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు అది ఏమైందని నిలదీశారు. కౌలు రైతులకు ఇస్తామన్న సాయం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలయ్యిందా అని అడిగారు. రెండేళ్లలో ఏ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. కూల్చివేతలు ఎగవేతలే కనిపిస్తున్నాయని ఇది సర్వభ్రష్ట ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు.

ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలని కేసీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఇదే జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా రైతులకు కనీసం యూరియా అందించలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. కమిషన్ల కోసమే ఆ ముగ్గురు మంత్రులు పనిచేస్తున్నారని ఆరోపించారు. ముప్పై శాతం ట్యాక్స్ పాలన నడుస్తోందని అన్నారు. ఎన్నికల సమయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరు గ్యారెంటీలు భద్రంగా పెట్టుకోవాలని చెప్పారని గుర్తు చేశారు. ఇప్పుడు రెండేళ్లు గడిచినా ఒక్క గ్యారెంటీ కూడా సక్రమంగా అమలు కాలేదని అన్నారు. దీనిపై భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ఓటమికి రంగం సిద్ధమైందని కేటీఆర్ స్పష్టం చేశారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నలభై శాతం పదవులు గెలుచుకోవడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఇక్కడే రెండేళ్లలో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత వచ్చిందో తెలుస్తోందన్నారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటమి తప్పదని తెలిపారు. ఖమ్మం జిల్లా నుంచి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story