కారుకి దొరకని స్పీకర్... అందుకే స్పీడ్
x

కారుకి దొరకని స్పీకర్... అందుకే 'స్పీడ్'

రాష్ట్ర శాసనసభలో ఫిరాయించిన BRS ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది.


రాష్ట్ర శాసనసభలో ఫిరాయించిన BRS ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ అపాయింట్‌మెంట్ కోరగా ఎటువంటి స్పందన రాకపోవడంతో, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదులను స్పీకర్‌తో పాటు శాసనసభ కార్యదర్శికి ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా పంపింది.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అపాయింట్‌మెంట్ కోసం ఎన్నిసార్లు విన్నవించినా స్పీకర్ నుంచి స్పందన లేదన్నారు. “మా ఫోన్‌ లకు కూడా సమాధానం ఇవ్వడం లేదు. అందుకే ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేయడం మినహా మాకు వేరే మార్గం లేదు. కాంగ్రెస్‌ లోకి ఫిరాయించిన ఐదుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వెంటనే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ ను అCభ్యర్థించాం" అని జగదీశ్ రెడ్డి తెలిపారు.

పాంచ్‌ న్యాయ్‌ లో పార్టీ ఫిరాయింపుల చట్టం...

"మా పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఇద్దరి సభ్యతం రద్దు కావల్సి ఉన్నది. నిన్నటి నుండి స్పీకర్ అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాం.. మాకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు. మాకున్న ఇతర మార్గాల ద్వారా ఒకటి స్పీడ్ పోస్టు, ఇంకోటి ఈ-మెయిల్ ద్వారా ఇద్దరిపై అనర్హత వేటు వెయ్యాలని ఫిర్యాదు చేశాం. వారిపై చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.. లేదంటే న్యాయపరంగా ముందుకు వెళ్తామన్నారు జగదీశ్ రెడ్డి.

"పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే కాంగ్రెస్ పార్టీ. పాంచ్‌ న్యాయ్‌లో భాగంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని మేనిఫెస్టోలో పెట్టారు. మళ్ళీ వారే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు" అని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. "ఇలాంటి సిగ్గుమాలిన పనులు చెయ్యొద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డే చెప్తున్నారు. మా హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే కేసీఆర్ దగ్గరకు వచ్చి కండువాలు కప్పుకున్నారు. చట్టం ప్రకారం 2/3 వంతు మా పార్టీలో జాయిన్ అయ్యారు" అని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

సుప్రీం కోర్టుకి వెళ్లే ఆలోచనలో బీఆర్ఎస్

దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్‌ రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఫిర్యాదు చేయగా, తాజాగా పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, సంజయ్‌ కుమార్‌ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ స్పీకర్ కి ఫిర్యాదు లేఖలు పంపారు. దానంపై అనర్హత వేటుకు స్పీకర్‌ ను ఆదేశించాలని కోరుతూ ఆ పార్టీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ గురువారానికి వాయిదా పడింది. హైకోర్టు తీర్పు ఆధారంగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాలని బీఆర్‌ఎస్‌ యోచిస్తోంది.

Read More
Next Story