
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ ‘బుల్డోజర్’ క్షిపణి
తిప్పి కొట్టలేకపోతున్న కాంగ్రెస్
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ది బుల్డోజర్ పాలన అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తరచూ ఆరోపిస్తున్నారు. ఇపుడు ఇది రోజూ వారీ దాడి అయింది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు భారత రాష్ట్రసమితి బుల్డోజర్ ని ఒక క్షిపణిలాగా ప్రయోగిస్తున్నది
పేదలు, మధ్య తరగతి జనాల ఇళ్ళను ఆక్రమణలు, కబ్జాల పేరుతో రేవంత్ హైడ్రా ఆధ్వర్యంలో బుల్డోజర్లతో కూల్చేస్తున్నారంటు కేటీఆర్ పదేపదే ఆరోపిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ప్రచారం చేస్తున్న కేటీఆర్ ఓటర్లను ‘కారు పాలన కావాలా ? బుల్డోజర్ పాలన కావాలా’ ? అని ప్రశ్నిస్తున్నారు.
ఎన్నికల్లో లబ్దిపొందటానికో లేకపోతే జనాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగదోయటానికో మాత్రమే కేటీఆర్ వ్యాఖ్యలు పనికొస్తాయి. ఎందుకంటే బుల్డోజర్ పాలనను మొదలుపెట్టింది రేవంత్ కాదు కేసీఆర్ ప్రభుత్వమే. తమ ప్రభుత్వంలోనే బుల్డోజర్ పాలన మొదలైందని కేటీఆర్ కు బాగా తెలుసు. అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే అయ్యప్పసొసైటి, గురుకుల్ ట్రస్టు ఏరియాల్లో ఆక్రమణలపేరుతో చాలా భవనాలను జేసీబీలు, బుల్డోజర్లనుపెట్టి కేసీఆర్ కూల్చేసిన విషయం అందరికీ తెలుసు. కాకపోతే తెలియనట్లు, మరచిపోయినట్లు ఇపుడు కేటీఆర్ నటిస్తున్నాడు. మొదటినుండి గుడ్డకాల్చి ఎదుటివాళ్ళ మీద ఎలాగ వేయాలో కేటీఆర్, హరీష్ కు బాగా తెలుసు. 2019లో మున్సిపల్ చట్టంలో సవరణలపై అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతు హైదరాబాదులోని కబ్జాలు, ఆక్రమణలపై తమ ప్రభుత్వం ఉక్కపాదం మోపటానికే చట్టంలో సవరణలు తెస్తున్నట్లు ప్రకటించారు.
హైదరాబాద్ లో చిన్నా, పెద్దా అన్నీ కలిపి 28 వేల ఆక్రమణలున్నట్లు స్వయంగా కేసీఆరే అసెంబ్లీలో ప్రకటించారు. కబ్జాలు, ఆక్రమణలను తొలగించేందుకు ముందస్తు నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. హైదరాబాదును క్లీన్ సిటీగా మార్చాలంటే ఆక్రమణల కూల్చివేతల విషయంలో కఠినంగా ఉండక తప్పదని కూడా కేసీఆర్ అన్నారు. నాలాలు, కాల్వలను ఆక్రమించి భవనాలు కట్టేయటంతోనే వర్షాలు వచ్చినపుడు నీరంతా రోడ్లమీదకు లేదా లోతట్టుప్రాంతాలను ముంచేస్తున్నట్లు చెప్పారు. నాలాలను ఆక్రమించిన నిర్మాణాల్లో ప్రభుత్వ భవనాలు కూడా ఉన్నాయని, ఇదంతా గత పాలకుల తప్పిదంగా కేసీఆర్ ఎద్దేవా చేశారు. నాలాలను ఆక్రమించిన వారు ఎంతపెద్దవారు చివరకు మంత్రులు, ఎంఎల్ఏలైనాసరే ఆనిర్మాణాలను కూల్చేయాలని కేసీఆర్ ఉన్నతాధికారులను అప్పట్లో ఆదేశించారు.
చందానగర్ సర్కిల్లోని గురుకుల్ ట్రస్ట్ భూముల్లో నిర్మించిన ఆక్రమణల్లో అధికారులు చాలావాటిని తొలగించారు. ట్రస్ట్ భూముల్లో అనధికారికంగా నిర్మించిన 25 భవనాలను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి వాటిల్లోని 21 భవనాలను నేలమట్టంచేశారు. అలాగే మాదాపూర్లోని అయ్యప్పసొసైటిలో కూడా అనధికారికంగా నిర్మించిన 190 భవనాలను అధికారులు కొట్టేశారు. సోసైటిలో 200 భవనాలు అనధికారికంగా నిర్మించిన విషయాన్ని తాము గుర్తించినట్లు 2020, జూలైలోనే జీహెచ్ఎంసీ అధికారులు ప్రకటించారు. అక్రమభవనాలన్నింటికీ మంచినీరు, విద్యుత్ సరఫరా నిలిపేయాలని కూడా జీహెచ్ఎంసీ అధికారులు విద్యుత్, వాటర్ బోర్డ్ అధికారులకు రాతమూలకంగా ఆదేశాలు కూడా జారీచేశారు. అన్నీఆక్రమణలను యుద్ధప్రాతిపదికగా తొలగించాల్సిందే అని జీహెచ్ఎంసీ, పోలీసు ఉన్నతాధికారుల జాయింట్ మీటింగులో కేసీఆర్ ఆదేశించారు. అవసరమైతే పోలీసు పికెట్లను ఏర్పాటు చేయాలన్నారు. 390 కిలోమీటర్ల నిడివిలోని 173 నాలాలను ఆక్రమించినట్లు చెప్పారు. ఆక్రమణలు, కబ్జాలను తొలగించేందుకు కఠినంగా వ్యవహరించాలని చెప్పారు.
నాలాలు, చెరువులు, కుంటలను ఆక్రమించి నిర్మాణాలు చేయకూడదన్న సుప్రింకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుల ఆధారంగానే తాను అక్రమణలను తొలగించబోతున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. అప్పట్లో కేసీఆర్ నిర్ణయాన్ని మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ నూరుశాతం సమర్ధించారు. కేసీఆర్ ఆదేశాల తర్వాత కేటీఆర్ మున్సిపల్ ఉన్నతాధికారులతో సమీక్షించి 865 ఆక్రమణలను తొలగించినట్లు ఒక సమావేశంలో చెప్పారు. అక్రమ నిర్మాణలను తొలగించటంలో ప్రజలు సహకరించాలని, ప్రతిపక్షాలు రాద్దాంతం చేయకూడదని కేసీఆర్, కేటీఆర్ విజ్ఞప్తులు చేశారు.
కేటీఆర్ గురివింద నీతి
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ది మొదటినుండి గురివింద నీతే. తాము అధికారంలో ఉన్నపుడు చేసిన నిర్ణయాలను ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తప్పుపడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఆక్రమణలను తొలగించేందుకు సిద్ధపడిన వాళ్ళు ఇపుడు అదేపనిని రేవంత్ చేస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ఆక్రమణల తొలగింపును కేటీఆర్, హరీష్ తదితరులు బుల్డోజర్ పాలన అంటు గగ్గోలు పెడుతున్నారు. మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు ప్రత్యేకంగా ఒక వ్యవస్ధను ఏర్పాటుచేసి మూసీనదిని ప్రక్షాళన చేయాలని కేటీఆర్ నిర్ణయించారు. ఆ సందర్భంగా నదిఒడ్డుకు రెండువైపులా ఉన్న ఇళ్ళను తొలగించాలని ఆదేశించారు. స్ధానికులు అడ్డుపడినా పట్టించుకోకుండా ఇళ్ళను కొట్టేయమని గట్టిగా చెప్పారు. వివిధ కారణాలతో అప్పట్లో కేటీఆర్ ఆదేశాలు అంతస్పీడుగా అమలుకాలేదు.
అప్పుడు కేటీఆర్ చేపట్టిన మూసీ ప్రక్షాళననే ఇపుడు రేవంత్ మొదలుపెట్టగానే బీఆర్ఎస్ గోలగోల చేస్తున్నది. ఇళ్ళను ఎలాగ కొట్టేస్తారు ? పేదల ఇళ్ళు కొట్టడానికి రేవంత్ ప్రభుత్వానికి మనసెట్లా వచ్చిందంటు గోలచేస్తున్నారు. తాము అధికారంలో ఉన్నపుడు ఇదే పనిచేద్దామని అనుకున్న విషయాన్ని కేటీఆర్ కన్వీనియంట్ గా మరచిపోయారు. అప్పట్లో ఆక్రమణలను కేసీఆర్, కేటీఆర్ జీహెచ్ఎంసీ, పోలీసుల సమన్వయంతో కూల్చేయమన్నారు. ఇపుడు ఆక్రమణల కూల్చివేతలకు రేవంత్ ప్రత్యేకంగా హైడ్రా అనే వ్యవస్ధను ఏర్పాటు చేశారంతే తేడా.
కాంగ్రెస్ చేతకానితనం
ఇక్కడే కాంగ్రెస్ నేతల చేతకానితనం బయటపడుతోంది. ప్రతిరోజు హైడ్రాకు వ్యతిరేకంగా కేటీఆర్, హరీష్ గోలచేస్తున్నా పట్టించుకున్న మంత్రులు, ఎంఎల్ఏలు లేరు. ఆక్రమణల తొలగింపు కేసీఆర్ హయాంలోనే మొదలైందన్న విషయాన్ని కేటీఆర్ తో పాటు జనాలకు గుర్తుచేసేంత తీరిక మంత్రులు, ప్రజాప్రతినిధులకు లేదు. ఎంతసేపు వాళ్ళల్లో వాళ్ళు కుమ్ములాడుకోవటానికే సమయం సరిపోవటంలేదు ఇక కేటీఆర్ ఆరోపణలను ఏమి తిప్పికొడతారు ? కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగం, సోషల్ మీడియా కూడా పార్టీకి తగ్గట్లే పనిచేస్తున్నాయి.
ప్రభుత్వంలో చిత్తశుద్దిలేదు : చలసాని
ఆక్రమణలు అన్నీ ప్రభుత్వాల్లోను జరుగుతున్నాయని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర తెలిపారు. అక్రమనిర్మాణాలను తొలగించటంపై తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కబ్జాలు, ఆక్రమణలను తొలగించటం సమాజానికి మంచిదే’’ అన్నారు. ‘‘ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాలు కూడా ఆక్రమణలను తొలగిస్తున్నాయి’’ అని గుర్తుచేశారు. ‘‘అయితే తెలంగాణలో ఆక్రమణల తొలగింపును రాజకీయపార్టీలు వివాదంగా మార్చేశాయి’’ అని ఆరోపించారు. ‘‘ఆక్రమణలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైన ఏ ప్రభుత్వమూ చర్యలు తీసుకోకపోవటాన్ని’’ చలసాని తప్పుపట్టారు. ‘‘నిర్మాణాలు జరుగుతున్నపుడు పట్టించుకోని ఉన్నతాధికారులు, శాఖలు ఇపుడు తొలగిస్తామని హడావుడి చేయటంతోనే జనాల్లో అనుమానాలు పెరిగిపోతున్నాయి’’ అని అన్నారు. ‘‘ఆక్రమణల్లో ప్రముఖుల భవనాలు, ఫామ్ హౌసులున్నా హైడ్రా ఇప్పటివరకు వాటిజోలికి వెళ్ళలేదు’’ అన్న విషయాన్ని చలసాని గుర్తుచేశారు. ‘‘ఆక్రమణల తొలగించటంలో ప్రభుత్వంలో చిత్తశుద్ది కనబడటంలేదు’’ అని ఆరోపించారు.
కాంగ్రెస్ ది కిచిడి ప్రభుత్వం : ప్రొఫెసర్ కూరపాటి
కాంగ్రెస్ ప్రభుత్వం కిచిడీ ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో వాళ్ళకు వాళ్ళకే కొట్టుకుంటున్నారు తప్ప కేటీఆర్ ఆరోపణలను తిప్పికొట్టేంత సీన్ కనబడటంలేదు’’ అని అన్నారు. ‘‘రేవంత్ ఒక్కడే కల్వకుంట్ల కుటుంబం ఆరోపణలను తప్పికొడుతున్నాడు’’ అని కూరపాటి గుర్తుచేశారు. ‘‘మిగిలిన మంత్రులు, ప్రజాప్రతినిధులకు ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పకొట్టేంత తీరిక లేదు’’ అని సెటైర్లు వేశారు. ‘‘ఆక్రమణల కూల్చివేతలు మొదలైంది కేసీఆర్ హయాంలోనే’’ అని చెప్పారు.
‘‘బీఆర్ఎస్ హయాంలోనే అక్కినేని నాగార్జున కన్వెన్షన్ హాలు కొట్టేందుకు వెళ్ళి తర్వాత ఏదో అడ్జస్టుమెంట్ జరిగి బుల్డోజర్లను ప్రభుత్వం వెనక్కు తెప్పించింది’’ అని ఆరోపించారు. ‘‘ఆక్రమ నిర్మాణాలకు రాజకీయ నేతల, ఉన్నతాధికారుల మద్దతుంది’’ అని అన్నారు. ‘‘ఆక్రమణలను తొలగించాల్సిందే, సమాజానికి మంచి జరగాల్సిందే’’ అని హైడ్రాకు మద్దతు పలికారు. ‘‘హైడ్రా ఏర్పాటు మంచిపనే కాని కాకపోతే బాధితులకు ప్రభుత్వం తరపు సహాయం అందించాలి’’ అని సూచించారు. ‘‘హైదరాబాద్ లో మాత్రమే కాదని తెలంగాణమొత్తంలో ఆక్రమణలు ఉన్నాయి’’ అని గుర్తుచేశారు. ‘‘ఆక్రమణలను తొలగించి నగరాలను, నాలాలను ప్రక్షాలన జరగాల్సిందే’’ అని మద్దతు పలికారు.

