కేసీఆర్ కు రేవంత్ బంపర్ ఆఫర్
x
Revanth and KCR

కేసీఆర్ కు రేవంత్ బంపర్ ఆఫర్

కేసీఆర్ సభకు వస్తానంటే జనవరి 2వ తేదీనుండే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు


బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలకు వస్తే కృష్ణా, గోదావరి జిల్లాలపై అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పారు. కేసీఆర్(KCR) సభకు వస్తానంటే జనవరి 2వ తేదీనుండే సభ నిర్వహిస్తామన్నారు. సమావేశాల్లో కృష్ణా, గోదావరి జలాలపైనే ప్రత్యేక అంశంగా చర్చిద్దామని చెప్పారు. ఎవరి హయాంలో జలాలపంపిణిలో తెలంగాణకు అన్యాయం జరిగిందో, రాష్ట్రానికి అన్యాయం చేసిందెవరో తేల్చుకుందామని (Revanth)రేవంత్ సవాలు విసిరారు. అసెంబ్లీలో చర్చకురమ్మని తాము ఆహ్వానిస్తుంటే సభకు రాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడో సభలు నిర్వహిస్తామని, మాట్లాడుతానని కేసీఆర్ చెప్పటంలో అర్ధంలేదన్నారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు 36శాతం వాటా అంటే 299టీఎంసీలు చాలని సంతకాలు చేసిందే కేసీఆర్ అని గుర్తుచేశారు. అందుకు కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీలోని పట్టిసీమ ప్రాజెక్టును, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ప్రోత్సహించిందే కేసీఆర్ అంటు రేవంత్ మండిపడ్డారు. జలదోపిడీ జరిగింది కేసీఆర్ హయాంలోనే అని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో తెలంగాణకు జరిగినంత అన్యాయం సమైక్య రాష్ట్రంలో కూడా జరగలేదని చెప్పారు. కేసీఆర్, కేటీఆర్ ఆర్ధిక, జల ఉగ్రవాదులు అని రెచ్చిపోయారు.


తెలంగాణకు చేయాల్సినంత హానిచేసి, ప్రాజెక్టుల రూపంలో వేల కోట్లరూపాయలు దోచుకున్న కేసీఆర్ ఇపుడు తమను విమర్శించటం విచిత్రంగా ఉందన్నారు. పాలమూరుజిల్లా రాజకీయబిక్ష పెట్టి, తెలంగణ ఉద్యమానికి ఊపిరి అందిస్తే అదే జిల్లాకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని రేవంత్ మండిపోయారు. కాళేశ్వరం పేరుతో కూలేశ్వరాన్ని కట్టి వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నది ఎవరు ? అంటు నిలదీశారు.

కేసీఆర్ ఆరోగ్యంగురించి ప్రధానమంత్రి నరేంద్రమోడీ వాకాబుచేయగానే బీఆర్ఎస్ అధినేతకు ఎక్కడలేని ఉత్సాహం కనబడుతోందని ఎద్దేవాచేశారు. కేసీఆర్ కుర్చీకోసం కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావే ఎదురుచూస్తున్నారని ఎద్దేవాచేశారు. కేసీఆర్ చావుకోరుకుంటున్నది కొడుకు, మేనల్లుడే కాని తాము కాదన్నారు. కేసీఆర్ ను అసెంబ్లీకి రాకుండా అడ్డుకుంటున్నది కూడా కొడుకు, మేనల్లుడే అని వ్యగ్యంగా అన్నారు.


కొడుకు ఐరన్ లెగ్ అన్న విషయం తేలిపోవటంతో నేతలు హరీష్ నాయకత్వం వైపు చూస్తున్నారని ఆ విషయంలో టెన్షన్ పెరిగిపోవటంతోనే కేసీఆర్ ఫామ్ హౌస్ నుండి బయటకు వచ్చారని రేవంత్ ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా మించిపోయిందిలేదని కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తెలంగాణకు అన్యాయంచేసింది ఎవరో లెక్కలతో సహా తేలుస్తామని చెప్పారు.

అసలు విషయం ఏమిటి ?

దాదాపు ఆరుమాసాల తర్వాత కేసీఆర్ ఆదివారం మీడియా ముందుకొచ్చారు. అంతకుముందు పార్టీ ఆఫీసు తెలంగాణ భవన్లో పార్టీ విస్తృతస్ధాయి సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడుతు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలుచేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మించలేకపోతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్వభ్రష్టప్రభుత్వం అంటు మండిపడ్డారు. అన్నీరంగాల్లోను కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి తాను ఇకనుండి రెగ్యులర్ గా జనాల్లో తిరుగుతానని, తాటతీస్తా, తోలు వలుస్తా అంటు తనదైన శైలిలో హెచ్చరిక చేశారు. కేసీఆర్ ఆరోపణలు, విమర్శలు, వ్యాఖ్యలపైన రేవంత్ స్పందించారు. రేవంత్ సవాలు విసిరినట్లుగా కేసీఆర్ అసెంబ్లీకి హాజరవుతారా ? ఏమో చూడాలి.

Read More
Next Story