
బస్సు సేవలకు ఎంజీబీఎస్ రెడీ..
ఆదివారం ఉదయం నుంచి తిరిగి మొదలైన బస్సు సేవలు.
వరద ముంపు నుంచి మహాత్మాగాంధీ బస్ స్టేషన్(MGBS) తేరుకుంది. రెండు రోజుల పాటు దంచికొట్టిన వర్షాలతో మూసీ వరద ముంచెత్తింది. ఈ క్రమంలోనే వరద ఉధృతికి ఎంజీబీఎస్ కూడా నీటమునిగింది. దీంతో బస్ స్టేషన్‌ను అధికారులు మూసేశారు. ఎవరూ రావొద్దని ప్రయాణికులకు సూచించారు. ఆదివారం ఉదయానికి మూసీ వరద ఉధృతి తగ్గడంతో ఎంజీబీఎస్ రీస్టోరేషన్ పనులను అధికారులు శరవేగంగా చేపట్టారు. స్టేషన్ మొత్తం నిండిపోయిన బురదను తొలగించారు. ఎంజీబీఎస్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం నుంచి ఇక్కడ బస్సు సేవలను పునఃప్రారంభమయ్యాయి.
చరిత్రలో తొలిసారి..
ఛాదర్ ఘాట్ లో మూసీ నది మధ్యలో నిర్మించిన ఎంజీబీఎస్ చరిత్రలో మొదటిసారి మునిగిపోయింది. గడచిన రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా జంట జలాశయాలు, ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ ల నుండి నీటిని అధికారులు దిగువప్రాంతాలకు వదిలిపెట్టారు. అప్పటికే భారీవర్షాలు కురుస్తున్నాయి. జలాశయాలనుండి దిగువకు వదిలేసిన నీరు మూసీలో వరద సృష్టించింది. దానికి అదనంగా భారీవర్షాలు కలవటంతో నీరు ఒక్కసారిగా బస్టాండును ముంచెత్తింది. శుక్రవారం అర్ధరాత్రికి వర్షపునీరు, వరదనీరు బస్టాండులోకి ప్రవేశించాయి. ఫలితంగా బస్టాండ్ మొత్తం ఒక్కసారిగా జలదిగ్భందంలోకి వెళిపోయింది. జలాశయాల్లోని నీరంతా మూసీనదిలోకి చేరుతోంది. బస్టాండ్ మూసీ ఒడ్డునే ఉండటంతో నీరంతా లోపలకు వచ్చేసింది.