మైనారిటీ ఓట్లకోసమే అజహరుద్దీన్ కు మంత్రిపదవి
x
Mohammed Azharuddin

మైనారిటీ ఓట్లకోసమే అజహరుద్దీన్ కు మంత్రిపదవి

ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azaharuddin) కు మంత్రిపదవి అనే వార్త తెలంగాణ(Telangana) రాజకీయాల్లో సంచనంగా మారింది


ఉరుములేని పిడుగులాగ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు ముందు అజహరుద్దీన్ పేరు ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. ప్రముఖ క్రికెటర్, మాజీ ఎంపీ మహమ్మద్ అజహరుద్దీన్(Mohammed Azharuddin) కు మంత్రిపదవి అనే వార్త తెలంగాణ(Telangana) రాజకీయాల్లో సంచనంగా మారింది. అన్నీ ప్రధానపార్టీలు ఉపఎన్నికల బిజీలో ఉంటే బుధవారం మధ్యాహ్నం నుండి ఒక్కసారిగా అజహరుద్దీన్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ప్రచారం సారంశం ఏమిటంటే ఈనెల 31వ తేదీ మంత్రివర్గ విస్తరణ జరుగుతోందని. అందులో అజహరుద్దీన్ కు చోటు దక్కిందని. ఏఐసీసీ అగ్రనాయకత్వం అజహరుద్దీన్ కు మంత్రిపదవి ఇవ్వటంపై గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మంత్రివర్గం విస్తరణ జరుగుతోందని. మీడియాతో పాటు సోషల్ మీడియాలో కూడా ఇదే విషయం బాగా వైరల్ అవుతోంది.

ప్రస్తుతం మంత్రివర్గంలో రేవంత్ కాకుండా 14 మందున్నారు. మొత్తం మంత్రివర్గంలో రేవంత్ తో కలుపుకుని 18 మంది ఉండచ్చు. మంత్రివర్గంలో ముస్లింమైనారిటి నుండి ఒక్కరు కూడా లేరు. లేరంటే పోటీచేసిన మైనారిటిల్లో ఒక్కరు కూడా గెలవలేదు. నిజామాబాద్ అర్బన్ నుండి షబ్బీర్ ఆలీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి అజహరుద్దీన్ పోటీచేసినా గెలవలేదు. దాంతో మంత్రివర్గంలో ముస్లింలకు ప్రాధాన్యత దక్కలేదు.

తొందరలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక జరగబోతోంది కదా అందుకనే ముస్లింల ఓట్లకు గాలమేయటానికి అజహరుద్దీన్ కు మంత్రిపదవి ఇస్తున్నారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. అజహరుద్దీన్ పేరే ఎందుకంటే ఉపఎన్నికలో మళ్ళీ పోటీచేయటానికి అజహర్ గట్టి ప్రయత్నాలు చేసుకున్నాడు. అయితే నవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చేందుకని అజహర్ ను పోటీనుండి తప్పించాల్సొచ్చింది. పోటీనుండి తప్పించాలి కాబట్టి గవర్నర్ కోటాలో ఎంఎల్సీ పదవికి అజహర్ ను ప్రభుత్వం ప్రతిపాదించింది. డబ్బులు ఖర్చులేకుండా, గెలుపుపై టెన్షన్ లేకుండానే ఎంఎల్సీ పదవి వస్తోంది కాబట్టి క్రికెటర్ కూడా ఓకే చెప్పేశాడు. జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓట్లు 1.2 లక్షలున్నాయి.

అజహర్ ను పోటీనుండి తప్పించటంపై ముస్లింల్లో ఆగ్రహం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఎంఎల్సీగా ప్రభుత్వం పంపిన ప్రతిపాదన ఇంకా గవర్నర్ ఆమోదం పొందలేదు. కాబట్టి ఎంఎల్సీ వద్దని తిరిగి ఎంఎల్ఏగానే పోటీచేయాలని కొందరు మద్దతుదారులు అజహర్ పై బాగా ఒత్తిడితెచ్చారు. అయితే అధిష్ఠానం నవీన్ కు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అవ్వటంతో చేసేదిలేక అజహర్ ఊరుకున్నాడు. ఇపుడు జూబ్లీహిల్స్ లో గెలుపు కాంగ్రెస్ తో పాటు రేవంత్ కు ప్రిస్టేజిగా మారింది కాబట్టి అజహర్ కు మంత్రిపదవి ఇవ్వాలని అధిష్ఠానం నిర్ణయించిందనే వార్త విపరీతంగా వైరలవుతోంది. హోం, మైనారిటి మంత్రిగా ప్రమాణం చేయబోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం.


Read More
Next Story