హైడ్రా విషయంలో రేవంత్ మాటను ఎవరైనా నమ్ముతారా  ?
x
Revanth Reddy

హైడ్రా విషయంలో రేవంత్ మాటను ఎవరైనా నమ్ముతారా ?

రేవంత్ రెడ్డి చెప్పేదానికి క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదానికి ఏమత్రం పొంతన ఉండటంలేదు


రేవంత్ రెడ్డి చెప్పేదానికి క్షేత్రస్ధాయిలో జరుగుతున్నదానికి ఏమత్రం పొంతన ఉండటంలేదు. హైడ్రా పోలీసుస్టేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా రేవంత్ మాట్లాడుతు చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకునే సమయంలో పేదలపై హైడ్రా(Hydraa) దయచూపించాలన్నారు. ఇదేసమయంలో బడాబాబుల ఆక్రమణల విషయంలో కటువుగా వ్యవహరించాలి హైడ్రాను రేవంత్(Revanth) ఆదేశించారు. ఆక్రమణలను కూల్చేసే విషయంలో హైడ్రా చర్యలకు తాను సంపూర్ణమద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్(Hyderabad) తాగునీటి అవసరాలకు మంచినీటిని అందించే హిమాయత్ సాగర్, గండిపేట జలాశయాల్లోకి ఫామ్ హౌస్ ల్లోని మురుగునీటిని కలిపేస్తున్న బడాబాబుల్లో ఏ ఒక్కరినీ వదలద్దని రేవంత్ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. పూర్వీకులు మనకు అందించిన అద్భుతమైన నగరాన్ని ఆక్రమణలనుండి రక్షించేందుకే హైడ్రాను ఏర్పాటుచేసినట్లు రేవంత్ గుర్తుచేశారు.

రేవంత్ చెప్పిందాంట్లో సందేహించాల్సిన అవసరం ఏమీలేదు. నిజానికి హైడ్రా చేయాల్సింది కూడా అదే. అయితే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది ఏమిటి ? హైడ్రా కూల్చేస్తున్నది ఎవరి ఇళ్ళనో రేవంత్ కు తెలీకుండానే ఉంటుందా ? ఎగువ, మధ్యతరగతి, పేదల ఇళ్ళనే హైడ్రా కూల్చేసింది, ఇప్పుడు కూడా కూల్చేస్తోంది. ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన బడాబాబుల అక్రమ నిర్మాణం అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)కు చెందిన ఎన్ కన్వెన్షన్(N Convention) సెంటర్ మాత్రమే. మిగిలిన నిర్మాణాలన్నీ ఎగువ తరగతి, మధ్య తరగతి జనాలు అప్పులు చేసిన కొనుక్కున్న ఫ్లాట్లు, అపార్టమెంట్లే అని అందరికీ తెలుసు. బిల్డర్లు, కొందరు అధికారులు చేసిన తప్పుకు ప్రాపర్టీని కొనుగోలుచేసిన జనాలు బలైపోయారు. చెరువులు, కాల్వలను ఆక్రమించి దశాబ్దాల క్రితమే కట్టి అమ్మేసిన బిల్డర్ బాగానే ఉన్నాడు. అక్రమ నిర్మాణాలకు అనుమతులు లేదా జలాశయాలకు దగ్గరగా నిర్మాణాలకు అనుమతులను మంజూరుచేసిన అధికారులు బాగానే ఉన్నారు.

బ్యాంకులు రుణాలిచ్చాయి కాబట్టి ప్రాపర్టీలో ఎలాంటి సమస్యలు, లిటిగేషన్లు ఉండవని నమ్మి ఎప్పుడో కొనుగోలుచేసిన ఎగువ, మధ్య తరగతి జనాలు నష్టపోయారు. కొన్నిచోట్ల అన్నీ అనుమతులు తీసుకుని ఎప్పుడో నిర్మించిన అపార్టమెంట్లను కూడా హైడ్రా ఇపుడు బఫర్ జోన్ అని, ఫుల్ ట్యాంక్ లెవల్ అనే పేర్లతో కూల్చేసింది. ఇక్కడ నష్టపోయింది కూడా మధ్యతరగతి జనాలే. ఫ్లాట్లను ఖాళీచేయటానికి ఒకరోజు ముందు నోటీసులిచ్చి మరుసటి రోజే హైడ్రా కూల్చేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. 24 గంటల సమయంలోనే ఇళ్ళను కూల్చేస్తే అందులోని జనాలు ఎక్కడికి వెళతారు ? బ్యాంకుల్లో తీసుకున్న అప్పులకు ఇఎంఐలు ఎలా కడతారన్న కనీస విషయాలను కూడా హైడ్రా పట్టించుకోలేదు. ఇలాంటి అనేక చర్యల కారణంగానే హైడ్రా అంటేనే బాధితుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేసింది. ఇక్కడ బాధితులంటే అక్రమనిర్మాణాలు చేసిన వారు కాదు. బ్యాంకులు అప్పులు మంజూరుచేస్తే తీసుకున్న జనాలు లేకపోతే అన్నీ అనుమతులుండీ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలోని నిర్మాణాలను తెలీకుండా ఫ్లాట్లను కొనుగోలుచేసిన వాళ్ళన్నమాట.

పై రెండింటిలో ఏపద్దతిలో ప్రాపర్టీ కొనుగోలుచేసినా రాజకీయంగా ఎలాంటి మద్దతులేని వాళ్ళే బాధితులుగా మిగిలిపోయారు. ఇదేసమయంలో అక్రమనిర్మాణాలు చేసిన బిల్డర్లు, వాటికి అనుమతులు మంజూరుచేసిన అధికారుల్లో ఎవరిపైనా హైడ్రా కేసులుపెట్టి జైళ్ళకు పంపలేదు. ఒకే ఒక్క కేసులో అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇస్తు రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఇంజనీర్లు మాత్రం కేసులను ఎదుర్కొంటున్నారు.

బడాబాబులు ఎవరు ?

ఇక రేవంత్ చెప్పిన బడాబాబులగురించి ఎంతతక్కువ చెప్పుకుంటే అంతమంచింది. ఎందుకంటే బడాబాబుల జాబితాలో ముందువచ్చేది రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డే. తిరుపతిరెడ్డికి హైదరాబాద్, రాయదుర్గ్ ప్రాంతంలోని సాగర్ సొసైటీలో పెద్ద ఫ్లాట్ ఉంది. సాగర్ సొసైటీలో నిర్మించిన విలాసవంతమైన ఫ్లాట్లు దుర్గంచెరువుకు దగ్గరలోనే ఉంటుంది. హైడ్రా లెక్కప్రకారమైతే తిరుపతిరెడ్డి ఉంటున్న ఫ్లాట్లతో పాటు చాలా ఫ్లాట్లు, విల్లాలను ఎప్పుడో కూల్చేసేయాలి. కాని హైడ్రా వాటిని కూల్చకుండా ఇళ్ళు ఖాళీచేయటానికి నెలరోజులు గడువిచ్చింది. అంతకుముందు ఎవరికీ ఇవ్వనిపద్దతిలో తిరుపతిరెడ్డితో పాటు మరికొందరికి మాత్రమే ఫ్లాట్లను ఖాళీచేయటానికి నెలరోజులు ఎందుకు గడువిచ్చింది ? హైడ్రా ఇచ్చిన గడువు వల్ల ఏమైందంటే ఫ్లాట్ల ఓనర్లు వెంటనే కోర్టుకు వెళ్ళి తమ ప్రాపర్టీలను హైడ్రా కూల్చకుండా స్టే తెచ్చుకున్నారు. మరిదే అవకాశం ఇతరులకు ఎందుకు ఇవ్వలేదన్న ప్రశ్నకు హైడ్రా నుండి సమాధానం ఉండదు.

ఈ విషయాలను వదిలేస్తే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక మండలాల్లో అక్రమంగా బడాబాబులు నిర్మించుకున్న ఫామ్ హౌసుల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా ఎక్కువగానే ఉంటుంది. శంషాబాద్, గండిపేట, షాద్ నగర్, మోకిల్లా, మహేశ్వరం లాంటి అనేకప్రాంతాల్లో మంత్రులు, మాజీమంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీలు నిర్మించుకున్న ఫామ్ హౌసుల్లో చాలావరకు అక్రమనిర్మాణాలే అన్న విషయం అందరికీ తెలుసు. హైడ్రా కూల్చివేతలు ముమ్మరంగా జరిగిన సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫామ్ హౌస్ ను కూల్చేందుకు నోటీసులు జారీచేసింది. అయితే తర్వాత ఏమైందో తెలీదు అంతా కామ్ అయిపోయింది. ఆ సమయంలోనే మంత్రుల్లో ఎవరెవరికి ఎక్కడెక్కడ ఫామ్ హౌసులున్నాయి ? వాటిల్లో అక్రమనిర్మాణాలెన్ని అనే వివరాను బీఆర్ఎస్ బయటపెట్టింది. దానికి కౌంటరుగా బీఆర్ఎస్ నేతల్లో ఎవరెవరికి ఎక్కడ ఫామ్ హౌసులున్నాయన్న విషయాన్ని మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు బయటపెట్టారు. ఏ పద్దతిలో చూసుకున్నా రెండుపార్టీల వాళ్ళు బయటపెట్టుకున్న ఫామ్ హౌసుల్లో చాలావరకు అక్రమనిర్మాణాలే అనటంలో సందేహంలేదు.

చాలావరకు అక్రమనిర్మాణాలే అన్నది ఎందుకంటే చాలా ఫామ్ హౌసులు జలవనరులను ఆక్రమించి నిర్మించినవే అన్నవిషయం వీడియోల్లో బయటపడింది. జలవనరులకు ఆనుకుని, లేదా ఆక్రమించి నిర్మించినవన్నీ అక్రమనిర్మాణాలే అని తేలిన తర్వాత కూడా హైడ్రా వాటిల్లో ఏ ఒక్కదాన్ని కూడా ఎందుకు కూల్చలేదు ? ఎందుకంటే వాళ్ళంతా బడాబాబులే కాబట్టి. ఒక మీటింగులో రేవంత్ మాట్లాడుతు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ(Congress leader KVP), బీఆర్ఎస్ కీలక నేతలు సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy), హరీష్ రావు, కేటీఆర్ లాంటి చాలామంది జలవనరులను ఆక్రమించి ఫామ్ హౌసులు కట్టుకున్నారని ఆరోపించిన విషయం గుర్తుండే ఉంటుంది. స్వయంగా ఎవరెవరు జలవనరులను ఆక్రమించి ఫామ్ హౌసులు కట్టుకున్నారో చెప్పిన తర్వాత కూడా హైడ్రా వాటిని ఎందుకు కూల్చలేదు ? నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు ఎన్నిసార్లు హైడ్రాకు తలంటిందో లెక్కేలేదు. పేదలు, మధ్య తరగతి వాళ్ళు ఇళ్ళు కూల్చటం కాదని దమ్ముంటే పెద్దల ఇళ్ళను కూల్చమని హైడ్రాకు హైకోర్టు సవాలు విసిరితే హైడ్రా కమీషనర్ ఏవీ రంగనాధ్ నోరెత్తలేదు.

హైడ్రా లెక్కఏమిటి ?

2024, జూలై 19వ తేదీన హైడ్రా ఏర్పడింది. ఇప్పటివరకు అక్రమనిర్మాణాలకు సంబంధించి 8 వేల ఫిర్యాదులు అందింది. 13 పార్కులు, 20 చెరువులు, 7 ప్రభుత్వ భూములను కలిపి మొత్తం 450 ఎకరాలను అక్రమార్కుల నుండి రక్షించింది. జలవనరుల ఎఫ్టీఎల్ గుర్తింపునకు వీలుగా జాతీయ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీతో ఒప్పందం కూడా చేసుకుంది. విపత్తుల సమయంలో బాధితులకు వీలైనంత తొందరగా సాయంచేసేందుకు సహాయక బృందాల సంఖ్యను 30 నుండి 72కి పెంచింది.

Read More
Next Story