హైడ్రాకు అంత ధైర్యముందా ?
అక్రమనిర్మాణాలన్నింటిపైనా ఇదే విధంగా వ్యవహరిస్తుందా అన్న ప్రశ్న సామాన్యుల్లో పెరిగిపోతోంది.
ఇపుడిదే అన్నీ చోట్లా వినబడుతున్న కామన్ ప్రశ్న. హైడ్రా ఏర్పాటైన దగ్గర నుండి సంచలనాలు సృష్టిస్తోంది. దీనికి కారణం ఏమిటంటే చెరువులు, కుంటలు ఆక్రమించుకుని చేసిన నిర్మాణాలు, ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాల్లో కొన్నింటిని కూల్చేయటమే. చెరువులు, కుంటలు ఆక్రమించుకుని నిర్మాణాలు చేయటం తప్పే అనటంలో సందేహంలేదు. అలాగే ప్రభుత్వ భూములను కబ్జాచేసి సొంతం చేసుకుని అక్రమంగా నిర్మాణాలు చేయటమూ తప్పే. అయితే ఇప్పటివరకు హైడ్రా కూల్చేసిన అక్రమనిర్మాణాల్లో చాలావరకు మామూలు జనాలవే. వీరిలో కొందరు ఓ మాదిరి బిల్డర్లున్నా హైడ్రా పట్టించుకోకుండా కొట్టేసింది. మొదటిసారి హైడ్రా జోరుకు బ్రేకులుపడింది మాత్రం జన్వాడలో కేటీఆర్ ఫాం హౌస్ గా పాపులరైన నిర్మాణం దగ్గరనే చెప్పాలి.
ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే అక్రమనిర్మాణం పేరుతో నిర్మాణాల్లో ఉన్న వాటిని, పూర్తయిన వాటిల్లో కొన్నింటిని కూల్చేసిన హైడ్రా అక్రమనిర్మాణాలన్నింటిపైనా ఇదే విధంగా వ్యవహరిస్తుందా అన్న ప్రశ్న సామాన్యుల్లో పెరిగిపోతోంది. ఎందుకంటే హైడ్రాకు అతిపెద్ద సవాలుగా నిలుస్తోంది 111 జీవో. 111 జీవో ఏమి చెబుతోందంటే చెరువులు, కుంటల్లాంటి వాటితో పాటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరీవాహ ప్రాంతాలకు పదికిలోమీటర్ల పరిధిలో ఎలాంటి శాస్వత నిర్మాణాలు చేయకూడదని. హైదరాబాద్, రంగారెడ్డి, మహూబూబ్ నగర్ జిల్లాల పరిధిలోని 84 గ్రామాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నదీ పరివాహక ప్రాంతాల పరిధిలోకి వస్తాయి. కాబట్టి 111 జీవో ప్రకారం పై గ్రామాల్లో ఎలాంటి శాస్వత నిర్మాణాలు చేసేందుకు లేదు. ఈ జీవో జారీ అయ్యింది 1996లో.
జీవో 111 పరిధిలోకి మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకరపల్లి, చేవెళ్ళ మండలాలు వస్తాయి. 1996లో జారీ అయిన జీవోను చాలా ప్రభుత్వాలు జాగ్రత్తగానే అమలుచేశాయి. గడచిన పదేళ్ళల్లో ఈ జీవోకు విపరీతంగా తూట్లు పడిపోయాయి. లేఅవుట్లు, నివాసభవనాలు, కమర్షియల్ కాంప్లెక్సులు, పారిశ్రామికభవనాలు విచ్చలవిడిగా వెలిశాయి. పై మండలాల్లో అక్రమంగా వేసిన లే అవుట్లు 426 ఉన్నాయి. అలాగే సుమారు 11 వేల నివాస భవనాలు, 1363 కమర్షియల్ కాంప్లెక్సులు, 190 పారిశ్రామిక భవనాలు నిర్మించేశారు. ఇవికాకుండా మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంపీలు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, సినీ సెలబ్రిటీలు, ప్రముఖ క్రీడాకారులు, వ్యాపారవేత్తలకు వేలాది ఎకరాల్లో ఫాంహౌస్ లున్నాయి. వీటిల్లో ఎన్ని నదీపరివాహక ప్రాంతాల్లో ఉన్నాయి, ఎన్ని చెరువులు, కుంటులను ఆక్రమించి నిర్మించారో తెలీదు. ప్రభుత్వ లెక్కల ప్రకారమైతే పై నిర్మాణాల్లో అత్యధికం అక్రమ నిర్మాణాలే అని అర్ధమవుతోంది.
111 జీవో పరిధిలో 8 ఏళ్ళక్రితమే 12 వేలకు పైగా అక్రమనిర్మాణాలున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పుడు అక్రమనిర్మాణాలు లక్షల్లో ఉంటాయని అంచనా. చాలామంది ప్రముఖులకు పైన చెప్పిన ఆరుమండలాల్లోనే ఫాం హౌసులున్నాయి. మరి ఈ ఫాం హౌసులను టచ్ చేసే ధైర్యం హైడ్రాకుందా ? అన్నదే ఇపుడు చాలామందిలో పెరిగిపోతున్న సందేహం. జనాల సందేహాలకు హైడ్రా ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.