ఫిరాయింపుదారుల గొంతెమ్మ కోర్కెలు రేవంత్ తీర్చగలడా?
x
BRS defect MLAs with Revanth

ఫిరాయింపుదారుల గొంతెమ్మ కోర్కెలు రేవంత్ తీర్చగలడా?

ఫిరాయింపు ఎంఎల్ఏలు నిర్వహించిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారన్న విషయం వెలుగుచూడటంతో పార్టీలో కలకలం రేగుతున్నది.


రేవంత్ రెడ్డికి పెద్ద సమస్య తలకు చుట్టుకున్నది. విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది రేవంత్ పరిస్ధితి. ఇంతకీ విషయం ఏమిటంటే కాంగ్రెస్ లోని నేతలకు, ఫిరాయింపు ఎంఎల్ఏలకు మధ్య పడటంలేదు. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏలను పక్కనపెట్టి తమకే ప్రాధాన్యత ఇవ్వాలని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు పట్టుబడుతున్నారు. ఇదే సమయంలో హామీలిచ్చి తమను పార్టీలోకి చేర్చుకున్నారు కాబట్టి, ప్రభుత్వాన్ని, పార్టీని నమ్మి తాము కాంగ్రెస్ లోకి వచ్చాము కాబట్టి తమ నియోజకవర్గాల్లోని వ్యవహారాలన్నీ తమ ఆధ్వర్యంలోనే జరగాలని ఫిరాయింపు ఎంఎల్ఏలు పట్టుబడుతున్నారు. ఈ నేపధ్యంలోనే ఫిరాయింపు ఎంఎల్ఏలు నిర్వహించిన సమావేశంలో రేవంత్ పాల్గొన్నారన్న విషయం వెలుగుచూడటంతో పార్టీలో కలకలం రేగుతున్నది.


పదిమంది బీఆర్ఎస్ ఎంఎల్ఏలు కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన విషయం తెలిసిందే. వీరిలో చాలామందికి తమ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతల నుండి సహాయ నిరాకరణ ఎదురవుతోంది. తాము చెప్పినట్లుగా జిల్లాతో పాటు నియోజకవర్గాల్లోని అధికారులు వినటంలేదనే మంట పెరిగిపోతోంది. అందుకనే ఫిరాయింపు ఎంఎల్ఏలు ఒక సమావేశం పెట్టుకున్నారు. ఎక్కడంటే పదిమందిలో ఒక ఫిరాయింపు ఎంఎల్ఏ అయిన పోచారం శ్రీనివాసరెడ్డి ఇంట్లో. పోచారం నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నుండి ఎంఎల్ఏగా గెలిచారు. పోచారం ఇంట్లో ఫిరాయింపులందరు సమావేశం పెట్టుకుని సుదీర్ఘంగా తమ నియోజకవర్గాల్లోని పరిస్ధితులపై చర్చించారు. అక్కడినుండే పోచారంను రేవంత్ తో ఫోన్లో మాట్లాడించినట్లు సమాచారం. పోచారం-రేవంత్ ఫోన్లో ఏమి మాట్లాడుకున్నారో తెలీదు. అయితే కొద్దిసేపటికే పోచారం ఇంటికి రేవంత్ చేరుకున్నారు. ఫిరాయింపులు సమావేశమైన పోచారం ఇంటికి రేవంత్ చేరుకుంటున్న విషయం అంతవరకు చాలామందికి తెలీదు.




ఎప్పుడైతే రేవంత్ హడావుడిగా పోచారం ఇంటికి చేరుకున్నారో అప్పుడే ఆ ఇంట్లో ఫిరాయింపు ఎంఎల్ఏలు సమావేశమైన విషయం బయటపడింది. దాంతో ఇపుడందరి దృష్టి ఫిరాయింపుల మీద పడింది. ముందుగా ఫిరాయింపులందరితోను చర్చించిన రేవంత్ తర్వాత అక్కడే విడివిడిగా అంటే వన్ టు వన్ భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎవరి డిమాండ్లు వాళ్ళు వినిపించారు. ఫిరాయింపులకు ముందు తమకిచ్చిన హామీలేమిటి ? కమిట్మెంట్లు ఏమిటి ? కాంగ్రెస్ లో చేరిన తర్వాత జరుగుతున్నది ఏమిటన్న విషయాన్ని ఫిరాయింపు ఎంఎల్ఏలు రేవంత్ కు గుర్తుచేశారని సమాచారం. దాంతో ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని, కమిట్మెంట్లు కూడా పూర్తిచేస్తానని అయితే అందుకు కొంత సమయం ఇవ్వమని రిక్వెస్టు చేసినట్లు తెలుస్తోంది.



చాలామంది ఎంఎల్ఏలకు కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్, ఫైనాన్స్, మైనింగ్ తో పాటు అనేక వ్యాపారాలుంటాయి. అధికారపార్టీలోకి ఫిరాయించటం వాటి రక్షణ కోసమే అన్న విషయం అందరికీ తెలిసిందే. దాంతో పాటు తమకు, తమ మద్దతుదారులకు రాజకీయ భవిష్యత్తు, పదవులు ఇవ్వాలన్న డిమాండ్లతోనే పార్టీలు ఫిరాయిస్తుంటారు. ఇపుడు రేవంత్ తో భేటీలో చాలామంది ఫిరాయింపులు పై డిమాండ్లను, హామీలను గుర్తుచేసినట్లు సమాచారం. పార్లమెంటు ఎన్నికలు, ఇతరత్రా డెవలప్మెంట్లతో పాటు అసెంబ్లీ సమావేశాల కారణంగా తాను దృష్టి పెట్టలేకపోయినట్లు రేవంత్ చెప్పుకున్నారట. అమెరికా పర్యటన నుండి తిరిగి రాగానే మరోసారి అందరితోను భేటీ అయి హామీలను, కమిట్మెంట్లను సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు పార్టీలోనే ప్రచారం జరుగుతోంది.



ప్రభుత్వం సుస్ధిరంగా ఉండాలంటే తమ అవసరం రేవంత్ కు ఎంతగా ఉందో ఫిరాయింపులందరికీ బాగా తెలుసు. అందుకనే దాన్ని అవకాశంగా తీసుకుని తమ డిమాండ్లను, కమిట్మెంట్లను కచ్చితంగా నెరవేర్చాల్సిందే అని ఫిరాయింపులు ఒక విధంగా హెచ్చరించినట్లే అనిపిస్తోంది. లేకపోతే పోచారం ఇంట్లో సమావేశమైన ఫిరాయింపుల దగ్గరకు రేవంత్ అంత అర్జంటుగా వెళ్ళరు. తిరిగి బీఆర్ఎస్ లోకి వెళ్ళాలన్న ఆలోచన మానుకోమని కూడా రేవంత్ ఫిరాయింపులను రిక్వెస్టు చేసినట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని దృష్టిలో పెట్టుకునే రేవంత్ చెప్పినట్లున్నారు.



ఎందుకంటే బీఆర్ఎస్ తరపున గెలిచిన బండ్ల నాలుగు వారాల క్రితమే కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. కాంగ్రెస్ లోకి రావటానికి బండ్లకు రేవంత్ ఎలాంటి హామీలిచ్చారో, కమిట్మెంటిచ్చారో తెలీదు. అయితే ఇచ్చిన హామీలను, కమిట్మెంట్లను రేవంత్ పట్టించుకున్నట్లు లేదు. అందుకనే బండ్ల నాలుగురోజుల క్రితం అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో కేటీఆర్ తో భేటీ అయ్యారు. దాంతో కాంగ్రెస్ లోనుండి బండ్ల తిరిగి బీఆర్ఎస్ లోకి వెళిపోయినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. బండ్ల బాటలోనే మరో ఇద్దరు ఫిరాయింపు ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, కాలే యాదయ్య ఆలోచిస్తున్నారని ప్రచారం జరిగింది. దాంతో రేవంత్ లో టెన్షన్ మొదలైనట్లుంది. మరి పోచారంకు రేవంత్ చెప్పి రేవంతే మీటింగ్ పెట్టించారా లేకపోతే ఫిరాయింపులంతా కలిసి పోచారం ఇంట్లో సమావేశమై రేవంత్ ను పిలిపించుకున్నారా అన్నది తెలీదు.



పోచారంకు రేవంత్ మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు, గూడెం మహిపాల్ రెడ్డి మీద నమోదైన కేసులు ఎత్తేయటంతో పాటు పెండింగులో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ అయ్యేట్లు రేవంత్ హామీ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. అలాగే చాలామంది ఫిరాయింపులకు పెండింగులో ఉన్న వందల కోట్ల రూపాయల బిల్లులను క్లియర్ చేయిస్తానని రేవంత్ హామీ ఇచ్చారట. అలాగే తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో తమ మద్దతుదారులకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ఫిరాయింపుల డిమాండ్లకు రేవంత్ ఓకే చెప్పినట్లు సమాచారం. అమెరికా నుండి తిరిగొచ్చిన తర్వాత వీళ్ళ గొంతెమ్మ కోర్కెలను రేవంత్ ఏ రీతిలో తీర్చుతారో చూడాలి.

Read More
Next Story