బిజీగా ఉండే అభ్యర్ధులు ఏమిచేస్తున్నారో తెలుసా ?
x
candidates and leaders in relaxing mood

బిజీగా ఉండే అభ్యర్ధులు ఏమిచేస్తున్నారో తెలుసా ?

ఇలాంటి అభ్యర్ధులందరు పోలింగ్ అయిపోవటంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు.


దాదాపు రెండునెలలు ఎన్నికల రణరంగంలో బాగా అలసిపోయిన అభ్యర్ధులు ఇపుడు రిలాక్సింగ్ మూడ్ లోకి వెళ్ళిపోయారు. పగలనకా, రాత్రనక మండుటెండల్లో సైతం గెలుపుకోసం అభ్యర్ధులు నానా అవస్తలు పడ్డారు. పోటీచేసిన కొందరు అభ్యర్ధులకు చివరి నిముషంలో బీఫారాలు దక్కితే చాలామందికి ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ముందే టికెట్ కన్ఫర్మ్ అయిపోయిన నేతలు తమ నియోజకవర్గాల్లో ప్రచారానికి శ్రీకారంచుట్టేశారు. అసలే పార్లమెంటు ఎన్నికలు, దానికితోడు విస్తీర్ణంలో చాల పెద్దవి అవటంతో ప్రచారంలో అభ్యర్ధుల అవస్తలు అన్నీ ఇన్నీ కావు. మండుటెండలను సైతం లెక్కచేయకుండా, చెమటలు కక్కుతునే ప్రచారం చేశారు. ప్రచారంలో వెనకబడిపోతే అంతే సంగతులన్నా భయమే చాలామంది అభ్యర్ధులను అలుపెరగకుండా నిద్రాహారాలకు కూడా దూరం చేసి ప్రచారంలో ముణిగిపోయేట్లు చేసింది.




ఇలాంటి అభ్యర్ధులందరు పోలింగ్ అయిపోవటంతో ఒక్కసారిగా ఊపిరిపీల్చుకున్నారు. పోలింగ్ అయిపోయిన తర్వాత కౌంటింగుకు మూడువారాల గడువుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుండటంతో చాలామంది అభ్యర్ధులు రిలాక్సింగ్ మూడులోకి వెళ్ళిపోయారు. చేవెళ్ళ బీజేపీ అభ్యర్ధి కొండా విశ్వేశ్వరరెడ్డి తన కుటుంబసభ్యులతో హిల్ స్టేషన్ కు వెళ్ళిపోయారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎంఎల్ఏలు తెల్లం వెంకటరావు, జే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, మాజీ ఎంఎల్ఏ రోహిత్ రెడ్డితో పాటు 200 మంది మద్దతుదారులతో శబరిమలకు వెళ్ళారు. సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధి తీగుళ్ళ పద్మారావుగౌడ్ తన కుటుంబసభ్యులతో రిలాక్సవుతున్నారు.


File photo


కరీంనగర్ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ తన కుటుంబసభ్యులతో రిలాక్సవుతున్నారు. మనవడిని తీసుకుని స్కూటర్లో ఊరు తిరిగారు. బేకరీకి తీసుకెళ్ళి కేకులు, ఐస్ క్రీములు తినిపించారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి కొంపల్లె మాధవీలత తన పార్టీ కార్యాలయంలో నేతలు, కార్యకర్తలతో మీటింగు పెట్టుకున్నారు. మల్కాజ్ గిరి బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పార్టీ కార్యక్రమాల్లో బిజీగా గడిపేశారు. మల్కాజ్ గిరి బీఆర్ఎస్ అభ్యర్ధి రాగిడి లక్ష్మారెడ్డి తన కుటుంబంతోనే గడిపేస్తున్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి తన భార్య భారతితో కలిసి లండన్ వెళ్ళబోతున్నారు. చంద్రబాబునాయుడు కూడా తన కుటుంబసభ్యులతో కలిసి విదేశాలకు ప్లాన్ చేస్తున్నారు. చాలామంది అభ్యర్ధులు తమ కుటుంబసభ్యులతో హాలిడే ట్రిప్పుకు రెడీ అవుతున్నారు.




ఎందుకంటే పోలింగ్ జరిగి కౌంటింగ్ జరిగేనాటికి మూడువారాల సమయముంది. ఈ మూడువారాలు చేయటానికి వీళ్ళకు ఏమీ ఉండదు. ఎందుకంటే ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంది. అధికార యంత్రాంగం యావత్తు కేంద్ర ఎన్నికల కమీషన్ పరిధిలోనే పనిచేస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఏలు ఎవరు కూడా అధికారులతో పెద్దగా మాట్లాడేది ఏముండదు. ఆఫీసులకు వెళ్ళినా మంత్రులు చేసే పనికూడా ఏమీ ఉండదు. పేషీల్లో ఫైళ్ళు కూడా ఎక్కడివి అక్కడే ఉంటాయి. ఎందుకంటే యంత్రాంగమంతా ఎన్నికల నిర్వహణలోనే బిజీగా ఉంటారు కాబట్టి. పోలింగుకు కౌటింగుకు మధ్య ఉండే గ్యాపే రాజకీయనేతలకు ఆటవిడుపులాంటిది. మామూలురోజుల్లో 24 గంటలూ బిజీగానే ఉంటారు. కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడే టైంకూడా చాలామందికి ఉండదు. బీజీగా ఉండే అభ్యర్ధులకు ఇలాంటి సమయమే కుటుంబంతో గడిపేందుకు అవకాశం దొరుకుతుంది. ఈ సమయాన్నే చాలామంది రిలాక్సయ్యేందుకు ఉపయోగించుకుంటున్నారు.

Read More
Next Story