
కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ‘కార్డు’ల వార్
ఈ బాకీకార్డును తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills) ఉపఎన్నిక ప్రచారంతో పాటు రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో కారుపార్టీ నేతలు, శ్రేణులు జనాలకు పంచుతున్నారు
అధికార కాంగ్రెస్-ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య కార్డుల వార్ మొదలైంది. ఈ కార్డుల వార్ ను మొదట బీఆర్ఎస్ మొదలుపెట్టింది. 2023 ఎన్నికలసమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఇపుడు అమలవుతున్న హామీల జాబితాను చూపిస్తు బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ‘బాకీకార్డు’ (Baki Card)ఆందోళనను మొదలుపెట్టారు. ఈ బాకీకార్డును తొందరలో జరగబోయే జూబ్లీహిల్స్ అసెంబ్లీ(Jubilee Hills) ఉపఎన్నిక ప్రచారంతో పాటు రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లో కారుపార్టీ నేతలు, శ్రేణులు జనాలకు పంచుతున్నారు. పైన చెప్పిన రెండుఎన్నికల్లో బీఆర్ఎస్ విజయమే టార్గెట్ గా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేటీఆర్ ప్రచారం మొదలుపెట్టారు.
బీఆర్ఎస్ బాకీకార్డు ప్రచారానికి విరుగుడుగా కాంగ్రెస్ ‘ఢోకాకార్డ్’ ప్రచారం మొదలుపెట్టింది. 2014లో అధికారంలోకి రాకమునుపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన హామీలు, తొమ్మిదిన్నరేళ్ళపాలనలో జరిగిన స్కాములు, అరాచకాలంటు హనుమకొండలో కాంగ్రెస్ నేతలు ఢోకాకార్డును విడుదలచేశారు. వరంగల్ వెస్ట్ ఎంఎల్ఏ నాయిని రాజేంద్రరెడ్డి, స్టేషన్ ఘన్ పూర్ ఎంఎల్ఏ కడియం శ్రీహరి, వరంగల్ ఎంపీ కడియం కావ్య తదితరులు సోమవారం మధ్యాహ్నం ఢోకాకార్డును విడుదలచేశారు. రాష్ట్రమంతా ఈ ఢోకాకార్డును పంపిణీ చేయటం ద్వారా కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అరాచకాలను ప్రచారం చేయబోతున్నట్లు నాయిని చెప్పారు.
నిజానికి వరంగల్ లో నాయిని విడుదలచేసిన బీఆర్ఎస్ ఢోకాకార్డును హైదరాబాదులో రేవంత్ రెడ్డి లేదా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ విడుదల చేస్తే దాని ఇంపాక్ట్ వేరే లెవల్లో ఉండేది. కాని వరంగల్ లో ఎంఎల్ఏ విడుదలచేయటంతో రావాల్సినంత ప్రచారం లభించలేదు. సరే అసలు విషయానికి వస్తే రెండుపార్టీలు కార్డులప్రచారం ద్వారా ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయని అర్ధమవుతోంది. ఎందుకంటే ఏపార్టీ కూడా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చవని అందరికీ తెలిసిందే. ఇచ్చిన అనేకహామీల్లో ముఖ్యమైన హామీలను అంటే గేమ్ ఛేంజర్ లాంటి కొన్ని హామీలను మాత్రమే అమలుచేస్తాయి.
మొదటి కేసీఆర్ ఇచ్చిన హామీలనే తీసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రి దళితుడే అవుతాడని బహిరంగసభలో ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నది కేసీఆరే కాని దళితుడు కాదు. దళితుడిని సీఎంను చేయకుండా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న విషయాన్ని ప్రస్తావించినా కేసీఆర్ సమాధానం చెప్పలేదు. అలాగే ప్రతి దళితకుటుంబానికి 3 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయిస్తానని చేసిన హామీకూడా అమలుకాలేదు. ఈ హామీని గుర్తుచేసినా కేసీఆర్ పట్టనట్లే ఉండేవారు. నిరుపేదలందరికీ డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానన్న హామీ ఏమైందో తెలీదు. దళితులు వ్యాపారాలు చేసుకునేందుకు తలా రు. 10 లక్షలు ఇస్తానని హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఎంతచక్కడా అమలైందో అందరికీ తెలిసిందే. ఉపఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రకటించిన పథకం ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటంతో అటకెక్కేసింది. గ్రేటర్లో ప్రతిఇంటికి ఉచితంగా ఏడాదికి 20 వేల లీటర్ల మంచినీటిని సరఫరాచేస్తామన్న హామీ ఏమైందో కూడా తెలీదు.
ఇచ్చినహామీలు గాలికి పోవటంతో పాటు కేసీఆర్ పాలనలో అవినీతి, అరాచకాల సంగతి ఎంత తక్కువచెప్పుకుంటే అంతమంచిది. కాళేశ్వరం, మేడిగడ్డలో కేసీఆర్, హరీష్ అవినీతి, అవకతవకలు, ఫార్ములా కార్ రేసు కేసులో కేటీఆర్ అవినీతి, అధికారదుర్వినియోగం, టెలిఫోన్ ట్యాపింగ్ అరాచకాలు గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు. వీటన్నింటి గురించి కాంగ్రెస్ పార్టీ కరపత్రాల రూపంలో ముద్రించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయటానికి రెడీ అవుతున్నది. ఇప్పటికే వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో కేసీఆర్ ఢోకా ప్రచారం మొదలైంది.
ఇక బీఆర్ఎస్ చేస్తున్న కాంగ్రెస్ బాకీకార్డు విషయం చూస్తే అధికారంలోకి రావటంకోసమే 2023 ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నోటికొచ్చిన హామీలిచ్చేశాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలుచేయటానికి కిందామీదా పడుతున్నాడు. ఖజానా మొత్తం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమపథకాల అమలుకు డబ్బులు లేవని ఇపుడు బీదమాటలు మాట్లాడుతున్నాడు. రాష్ట్రం లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందన్న విషయం రేవంత్ తెలిసే ఆచరణసాధ్యంకాని హామీలిచ్చాడు.
మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీ, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, కాలేజీలకు వెళ్ళే అమ్మాయిలకు ఉచిత స్కూటి, ఆడవాళ్ళందరికీ తులం బంగారం, రైతుభరోసా, రైతు రుణమాఫీ లాంటి అనేక హామీలు రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని పూర్తిగా దిగజార్చేస్తున్నాయి. అందుకనే స్కూటి, తులంబంగారం హామీలను అటకెక్కించేశారు. రైతుభరోసా, రైతురుణమాఫీ హామీలను చాలావరకు నెరవేర్చారు. ఉచితబస్సు ప్రయాణం, 3 సిలిండర్ల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పూర్తిగా అమలవుతున్నాయి. పాక్షికంగా అయినా, పూర్తిగా అయినా హామీలను నెరవేర్చటం వల్ల ఖజానా గుల్లయిపోతోంది. అధికారంలో ఉన్నపుడు కేసీఆర్ చేసిన తప్పులను కాంగ్రెస్ సరిదిద్దుతుందని జనాలు ఓట్లేస్తే ముఖ్యమంత్రి అవగానే రేవంత్ కూడా మరోరకమైన తప్పులనే చేస్తున్నాడు. గురివిందగింజ తన నలుపును తాను ఎరుగదు అన్న సామెతలాగ రెండుపార్టీలు కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో విఫలమై ఒకదాని తప్పును మరోటి ఎత్తిచూపుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.
బీఆర్ఎస్ కు నైతికత లేదు :కూరపాటి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళవుతున్నా కాంగ్రెస్ పాలన అన్నది కనబడటంలేదని కాకతీయ యూనివర్సిటి పొలిటికల్ సైన్స్ విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్, రాజకీయ విశ్లేషకుడు కూరపాటి వెంకటనారాయణ అన్నారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘కాంగ్రెస్ పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందన్నారు’’. ‘‘కేసీఆర్ హయాంలో మొదలైన అవినీతి ఇపుడు మరింతగా పెరిగిపోయింద’’ని చెప్పారు. ‘‘కాంగ్రెస్ బాకీ అంటే వాస్తవంగా బాకీ ఉంద’’న్నారు. ‘‘అయితే కేసీఆర్ పాలనలోని దుష్ఫలితాల కొనసాగింపే కాంగ్రెస్ పాలనలో జరుగుతోంద’’ని అభిప్రాయపడ్డారు. ‘‘పరిపాలన ఎలా జరగాలి ? కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతి, అప్పులపై నిష్ణాతులతో కమిటి వేసి జనాలకు వాస్తవాలు చెప్పుంటే బాగుండేది’’ అన్నారు. ‘‘కేసీఆర్ కూడా జనాలను ఢోకా చేసే దిగిపోయాడు’’ అని గుర్తుచేశారు. కేసీఆర్ హయాంలో విద్య, వైద్యరంగాలను నాశనం చేసినట్లు కూరపాటి మండిపోయారు. ‘‘కేసీఆర్ హయాంలో మూడురెట్లు జీతాలు పెరిగిన కారణంగా అవేఇపుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భారంగా తయారైంద’’న్నారు.
‘‘కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం దెబ్బతినేసింద’’న్నారు. ‘‘బలహీన, బడుగు వర్గాలను తొక్కేసి’’నట్లు మండిపడ్డారు. ‘‘ప్రత్యేక తెలంగాణ వద్దని చెప్పిన టీడీపీ ఎంఎల్ఏలను ఫిరాయింపులతో బీఆర్ఎస్ లోకి చేర్చుకుని మంత్రులను చేసి’’నట్లు విమర్శించారు. ‘‘రాష్ట్ర ఆర్ధికపరిస్ధితిని చక్కదిద్దటానికి వీలుకానంతగా కేసీఆర్ దెబ్బతీసి’’నట్లు చెప్పారు. ‘‘కాంగ్రెస్ బాకీలకన్నా పాలన సక్రమంగా లేదని జనాలు భావిస్తున్న’’ట్లు చెప్పారు. ‘‘కాంగ్రెస్ ది బాకీ పాలన అనిచెప్పే నైతిక బాధ్యత బీఆర్ఎస్ కు లేద’’ని కూరపాటి అభిప్రాయపడ్డారు.
బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయి : నట్చరాజు వెంకట సుభాష్
పదేళ్ళు అధికారంలో ఉన్నపుడు బీఆర్ఎస్ కు బాకీలు గుర్తుకురాలేదా ? అని ప్రశ్నించారు. బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి నట్చరాజు వెంకట సుభాష్ మాట్లాడుతు ‘‘కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ అప్పులు చేసి పోయార’’ని మండిపడ్డారురు. ‘‘తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్సే బాకీ ఉంద’’న్నారు. ‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా చక్కబెడతానని రేవంత్ చెప్పి మరిన్నిఅప్పులు చేస్తున్నాడ’’ని గుర్తుచేశారు. ‘‘అప్పులు తీర్చాల్సిన రేవంత్ మరిన్ని అప్పులు చేస్తు ఖజానాపై మరింత భారం మోపుతున్న’’ట్లు సుభాష్ అభిప్రాయపడ్డారు. ‘‘ఒకరిపై మరొకరు బ్లేమ్ గేమ్ ఆడుతున్నార’’ని మండిపడ్డారు. ‘‘రెండుపార్టీల పాలనను చూశారు కాబట్టే రాబోయే ఎన్నికల్లో తమకు ఒక అవకాశం ఇవ్వాలని అడుగుతున్న’’ట్లు చెప్పారు. ‘‘ఇతర రాష్ట్రాల్లో తమపరిపాలన చూసి బీజేపీకి ఓట్లేయమని రిక్వెస్టు చేస్తున్నా’’ము అన్నారు. ‘‘జనాలను కాంగ్రెస్ మోసంచేసి అధికారంలోకి వచ్చిందని భూములను అమ్ముకుని కాలం గడపటం తప్ప కాంగ్రెస్ చేస్తున్న పాలన ఇంకేమీలేద’’ని సుభాష్ దుయ్యబట్టారు.