
పాడి కౌశిక్ రెడ్డిపై కేసు
హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నిరాధార ఆరోపణపై రాజేంద్రనగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయివేటు హ్యకర్ల చేత హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నట్టు కౌశిక్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
హీరోయిన్ల ఫోన్ల ట్యాపింగ్ చేయిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేయిస్తున్న రేవంత్ రెడ్డిపై సిబిఐ, ఈడీ చేత విచారణ జరిపించాలని కౌశిక్ రెడ్డి కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీఎన్ ఎస్ 356(2)353(B), 352 సెక్షన్ల క్రింద హుజురాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. రాజేందర్ నగర్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ఫిర్యాదు మేరకు రాజేందర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేస్తారనే అనుమానంతో కొండాపూర్ లోని ఆయన నివాసం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.