కేటీఆర్ నోటికి తాళం వేసేందుకేనా ఈ కేసు!
x
కేటీఆర్, రేవంత్ రెడ్డి

కేటీఆర్ నోటికి తాళం వేసేందుకేనా ఈ కేసు!

రేవంత్‌పై చేసిన వ్యాఖ్యలకు గానూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై కేసు నమోదైంది. ఇంతకీ కేసీఆర్ ఏమన్నారంటే..


సీఎం రేవంత్ రెడ్డే టార్గెట్.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్దిరోజులకే బీఆర్ఎస్ నేతలు మాటల దాడి మొదలుపెట్టారు. వారి విమర్శనాస్త్రాలు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కంటే రేవంత్ రెడ్డి వైపే గురిపెడుతున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఏక్ నాథ్ షిండే అని, బీజేపీ తొత్తులా వ్యవహరిస్తున్నాడని, ఏఐసీసీ నిర్ణయాలకు భిన్నంగా ఈయన చర్యలు ఉంటున్నాయని కాంగ్రెస్ లోని ఇతర నాయకులకి రేవంత్ ని దూరం చేసేలా బీఆర్ఎస్ నేతలు వ్యూహాత్మకంగా కామెంట్స్ చేస్తున్నారు. "నీ లెక్క డబ్బు సంచులు మోసి రాజకీయాల్లోకి రాలే రేవంత్ రెడ్డి. మోసగాళ్ళలో నిజాయితీ మోసగాడు రేవంత్ రెడ్డి. మోసం చేస్తానని చెప్పి మరీ ప్రజలను మోసం చేస్తున్నాడు" కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్.

"రేవంత్ రెడ్డి.. నీ సీటుకు మా పార్టీ నుండి ఎలాంటి ప్రమాదం లేదు. నీ పార్టీ నాయకులతోనే నీ సీటుకు ప్రమాదం ఉంది" కరీంనగర్ సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి. అదే విధంగా ట్విట్టర్‌లో రేవంత్‌పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘రేవంత్ కు తెలంగాణ “ఆత్మ”లేదు.
తెలంగాణపై “గౌరవం” అంతకన్నా లేదు.
అందుకే తెలంగాణ “ఆత్మగౌరవం”పై
మోడీ సాక్షిగా... రేవంత్ దాడి
అసలు తెలంగాణ సోయి లేనోడు..
సీఎం కావడం మన ఖర్మ..
తెలంగాణ ఆత్మగౌరవం విలువ తెల్వనోడు ముఖ్యమంత్రిగా ఉండటం మన దౌర్భాగ్యం’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
అయితే రేవంత్ టార్గెట్‌గా హరీష్ రావు కూడా ధ్వజమెత్తారు. ‘చోటే భాయ్ బడే భాయ్ రేవంత్ రెడ్డి. మోడీ ఆశీర్వాదం తీసుకున్నాడు’ అని మెదక్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో హరీష్ రావు వ్యాఖ్యానించారు. ‘‘మద్యం పాలసీ కేసులో కాంగ్రెస్ హై కమాండ్ ది ఓ దారి.. రేవంత్ రెడ్డిది ఓ దారి. ఖర్గే, రాహుల్ మాటలకు పూర్తి వ్యతిరేకంగా రేవంత్ మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి బీజేపీకి బీ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు’’ అని హరీష్ రావు అన్నారు.
వీరి వ్యాఖ్యలతో రేవంత్ రెడ్డికి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందని గ్రహించిన ఆయన వర్గీయులు సరైన సమయం కోసం ఎదురు చూశారు. చోటామోటా నాయకులకంటే గులాబీ పార్టీ అగ్రనాయకులు నోటికి తాళం వేస్తే అన్ని నోళ్లు సైలెంట్ అవుతాయని భావించారు. అందుకే అదును చూసి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని లాక్ చేసే ఎత్తుగడ అమలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలే ఆయుధంగా చేసుకుని పోలీస్ కేసుతో ఇరికించేశారు.
కేటీఆర్ పై కేసు ఎందుకు పెట్టారంటే..
ఇటీవల కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘వంద రోజుల కాంగ్రెస్ పాలనలో.. ఒకవైపు ఇసుక దందా.. మరోవైపు రైస్ మిల్లర్లను, బిల్డర్లను బ్లాక్ మెయిల్ చేస్తున్నరు, రియల్టర్లను బెదిరిస్తున్నరు. రేవంత్ రెడ్డి డబ్బులు వసూలు చేసి రూ. 2,500 కోట్లు ఢిల్లీకి ముడుపులు పంపాడు’’ అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతలను ఆగ్రహానికి గురి చేశాయి. దీంతో బత్తిన శ్రీనివాస్ రావు అనే కాంగ్రెస్ నేత హన్మకొండ పోలీస్ స్టేషన్లో కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. హన్మకొండ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు.. కేసును బంజారాహిల్స్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More
Next Story